లాభాల్లో మార్కెట్: బలపడిన రూపాయి, పెరిగిన బంగారం ధర
మార్కెట్లు శుక్రవారం స్వల్ప లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 10.45 గంటల సమయంలో సెన్సెక్స్ 38 పాయింట్లు బలపడి 38,580 వద్ద కొనసాగింది. నిఫ్టీ 15 పాయింట్లు లాభపడి 11,585 వద్ద ట్రేడ్ అయింది. డాలరుతో రూపాయి మారకం విలువ 69.15 వద్ద కొనసాగింది. గురువారం 69.30 వద్ద ముగిసింది. ఇప్పుడు 15 పైసలు లాభపడింది. బంగారం ధర కొద్దిగా పెరిగింది.
ఇరాన్, వెనెజువెలాపై ఒపెక్, అమెరికా ఆంక్షల నేపథ్యంలో ఎగుమతుల్లో కోతపడడంతో చమురు ధరలు శుక్రవారం పెరిగాయి. ఐఓసీ, ఇండియా బుల్స్ హౌసింగ్, హిండాల్కో, విప్రో, టెక్ మహీంద్రా, బీపీసీఎల్, వొడాఫోన్ ఐడియా, జెట్ ఎయిర్‌వేస్ షేర్లు లాభాల్లో ట్రేడ్ అయ్యాయి. ఇండస్ ఇండ్, యాక్సిస్ బ్యాంక్, ఎస్బీఐ లైఫ్ తదితర షేర్లు నష్టాల్లో నమోదయ్యాయి.
కాగా, గురువారం మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. బ్యాంకింగ్, ఫైనాన్స్, ఐటీ షేర్లు కొత్త రికార్డుల దిశగా అడుగులేశాయి. నిఫ్టీ కీలక 11,500 పాయింట్లను మరోసారి అధిగమించింది. మార్చి డెరివేటివ్ కాంట్రాక్టుల గడువు ముగింపు నేపథ్యంలో మదుపర్లు షార్ట్ కవరింగ్ కొనుగోళ్లకు మొగ్గు చూపారు. ఇది సెంటిమెంట్‌పై సానుకూల ప్రభావం చూపింది.

విదేశీ పెట్టుబడులు స్థిరంగా కొనసాగడం కలిసి వచ్చింది. డాలరుతో పోలిస్తే రూపాయి 42 పైసలు తగ్గి 69.30 వద్ద ముగిసింది. శుక్రవారం ప్రారంభంలో రూపాయి 15 పైసలు బలపడింది. గురువారం ఉదయం సెన్సెక్స్ 38,208 పాయింట్ల వద్ద లాభాల్లో ప్రారంభమైంది. చివరి వరకు అదే జోరు కొనసాగింది. చివరకు 38,500 పాయింట్లను చేరుకుంది.
కొనుగోళ్లు స్థిరంగా కొనసాగడంతో ఇంట్రాడేలో 38,593 పాయింట్ల వద్ద గరిష్ఠానికి చేరింది. చివరకు 412.84 పాయింట్ల లాభంతో 38,545.72 వద్ద ముగిసింది. నిఫ్టీ 124.95 పాయింట్లు రాణించి 11,570 దగ్గర స్థిరపడింది. ఇంట్రాడేలో ఈ సూచీ 11,452- 11,588 పాయింట్ల మధ్య కదలాడింది.


Click it and Unblock the Notifications