ఐడీ నుంచి ఆర్గానిక్ ఇడ్లీ, దోశ పిండి, రూ.350 కోట్ల టర్నోవర్ టార్గెట్
ఇడ్లి, దోశె పిండితో దక్షిణాది రాష్ట్రాల్లో విపరీతంగా ఫేమస్ అయిన ఐడి ఫ్రెష్ ఇప్పుడు మరో అడుగు ముందుకేసింది. జనాలంతా ఆర్గానిక్ మంత్రం పఠిస్తున్న వేళ తాను కూడా ఆర్గానిక్ ఆహార ఉత్పత్తులను ప్రవేశపెడ్తోంది. రాగి ఇడ్లీ, రాగి దోశె, ఓట్స్ దోశ సహా వివిధ ప్రోడక్ట్స్‌ను త్వరలో తీసుకురాబోతోంది ఈ బెంగళూరు సంస్థ. దీనికి ఐడి 2.0గా నామకరణం చేశారు ఈ స్టార్టప్ నిర్వాహకులు.
ఆరు నెలల్లో మొత్తం ఆర్గానిక్ రేంజ్ ప్రోడక్ట్స్‌ను మార్కెట్లోకి తీసుకురాబోతున్న ఐడీ సంస్థ చెబ్తోంది. లైఫ్ స్టైల్ రోగాల భయంతో ఈ మధ్య జనాలు సేంద్రీయ ఉత్పత్తులకు బాగా ఆకర్షితులవుతున్నారని, ఇందుకు నాలుగు డబ్బులు ఎక్కువ పెట్టేందుకు కూడా వెనుకాడకపోవడం వల్లే తాము ఈ రంగంలోకి దిగినట్టు ఐడీ ఫౌండర్ ముస్తఫా వెల్లడించారు.
ఏంటీ ఆర్గానిక్?

తాజాగా, ఎలాంటి ప్రిజర్వేటివ్స్ లేకుండా ఆర్గానిక్ ఫుడ్‌ను అందిస్తామని ఐడీ సంస్థ చెబ్తోంది. గత మూడేళ్లుగా ఇందుకోసం గ్రౌండ్ వర్క్ చేసుకున్నామని, సుమారు 1000 మంది రైతులతో ఒప్పందం కుదుర్చుకుని వారితో కలిసి పనిచేస్తున్నట్టు వెల్లడించారు. కెమికల్ వినియోగం ఏ మాత్రం లేకుండా తయారైన ఉత్పత్తిని మాత్రమే ఆర్గానిక్ అనాలని నిబంధనలు ఉన్నాయి. అందుకే మూడేళ్ల క్రితం నుంచే ప్లానింగ్ చేసుకున్నట్టు ఐడీ చెబ్తోంది. ఆర్గానిక్ అనే లేబుల్ వేసే ముందు ఎంతో ఆలోచించాలని, ఊరికే లేబుల్ వేసి లోపల ఏదో ఒక ప్రోడక్ట్ పెడితే జనాల నమ్మకం కోల్పోతామనేది ముస్తఫా మాట. ఆర్గానిక్ ప్రోడక్ట్స్‌లో ఇడ్లీ, దోశె పిండి, పరోటా, ఓట్స్ దోశ, రైస్ రవ ఇడ్లీ సహా గోధుమ పిండి చపాతీ, పన్నీర్, ఫిల్టర్ కాఫీ, వడ పిండిని స్టోర్స్‌లోకి త్వరలో తీసుకురాబోతున్నారు. అయితే వీటి ధర సాధారణ వాటితో పోలిస్తే రూ.10 ఎక్కువగా ఉండబోతోందని ఐడీ సంస్థ వెల్లడించింది.
రూ.25 వేల నుంచి రూ.210 కోట్లకు...
2005లో కేవలం రూ.25000 పెట్టుబడితో బెంగళూరులో ఇడ్లీ, దోశె పిండి వ్యాపారాన్ని మొదలుపెట్టిన సంస్థ ఇప్పుడు జాతీయ స్థాయిలో ఫేమస్ అయి ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచింది. 50 చదరపు అడుగుల్లో మొదలైన వ్యాపారం ఇప్పుడు ఐదు ఫ్యాక్టరీల స్థాయికి ఎదిగింది. బెంగళూరు, హైదరాబాద్, ముంబైలో ఫ్యాక్టరీలను కలిగిన సంస్థ ఈ ఏడాది రూ.210 కోట్ల టర్నోవర్‌ను సాధించింది. ఐఐటి అలుమ్నీ అయిన ముస్తఫా స్థాపించిన ఈ సంస్థలో హీలియన్ వెంచర్స్ సహా ప్రేమ్‌జీ ఇన్వెస్ట్‌మెంట్ సంస్థలు పెట్టుబడి పెట్టాయి.


Click it and Unblock the Notifications