ఓ క్యాన్సర్ రోగికి రూ.600 కోట్ల పరిహారం.. కోర్టు సంచలన తీర్పు
ప్రముఖ పురుగు మందుల తయారీ సంస్థ బేయర్‌కు అమెరికా కోర్ట్ కోలుకోలేని షాక్ ఇచ్చింది. క్యాన్సర్ వచ్చిన ఓ ఫిర్యాదుదారుడికి ఏకంగా 80 మిలియన్ డాలర్లు నష్టపరిహారంగా ఇవ్వాలని ఆదేశించింది. మన కరెన్సీలో ఇది సుమారు రూ.560 కోట్లు. ఈ వ్యవహారం పూర్వాపరాల్లోకి వెళ్తే.. బేయర్‌కు చెందిన గ్లైఫోసేట్ పెస్ట్ కిల్లర్ రౌండ్ అప్ ప్రోడక్ట్‌ను తన పొలానికి వినియోగించడం ద్వారా తనకు క్యాన్సర్ సోకిందని ఎడ్విన్ హార్డేమ్యాన్ అనే వ్యక్తి కోర్టుకెక్కాడు. ఈ అంశాన్ని లోతుగా విచారించిన శాన్‌ఫ్రాన్‌సిస్కో ఫెడరల్ కోర్టు బేయర్‌కు వ్యతిరేకంగా తీర్పునిచ్చింది.
రౌండప్ వాడితే క్యాన్సర్ వస్తుందా
రౌండప్ అనే పురుగుల మందును పొలానికి వాడుతూ వచ్చానని, ఈ ప్రోడక్ట్ డిజైనింగ్ మొదలు అన్నీ లోపాలే ఉన్నాయని ఫిర్యాదుదారు హార్డేమ్యాన్‌ను కోర్టుకు విన్నవించాడు. ఈ క్రిమి సంహాకరం వినియోగం వల్ల క్యాన్సర్ వస్తుందని తెలిసినా బేయర్ మోన్‌శాంటో సంస్థలు నిర్లక్ష్యంగా వ్యవహరించిన వైనాన్ని కక్షిదారు ఆధారాలతో సహా కోర్టులో రుజువు చేయగలిగాడు. దీంతో పరిహారం 5 మిలియన్ డాలర్లు, కఠినమైన చర్యల కింద మరో 75 మిలియన్ల డాలర్లను విధించింది కోర్టు. వైద్య ఖర్చులకు అదనంగా మరో 2 లక్షల డాలర్లను కూడా చెల్లించాలని ఆదేశించింది. జ్యూరీ తీర్పుపై అసంతృప్తి వ్యక్తం చేసిన బేయర్ యాజమాన్యం దీనిపై అప్పీల్‌కు వెళ్తామని ప్రకటించింది. తమ ప్రోడక్ట్స్‌లో అలాంటి కారకాలేవీ లేవని, నిబంధనలకు అనుగుణంగా గ్లైఫోసేట్ ఆధారిత ప్రోడక్ట్స్ తయారు చేస్తున్నామని వెల్లడించింది. ఇది ఎంతమాత్రం క్యాన్సర్ కారకం కాదని ప్రకటనలో తెలిపింది.

మరో 11 వేల కేసులు
బేయర్‌పై ఇదే తరహాలో మొత్తం 11,200 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. గతంలో క్యాలిఫోర్నియాకు చెందిన ఓ స్కూల్ గ్రౌండ్ కీపర్ వ్యవహారంలో కూడా భారీ మొత్తంలో బేయర్ నుంచి పెనాల్టీ ఇప్పించింది కోర్టు. అతను కూడా లింఫోమో క్యాన్సర్ బారిన పడ్డాడు. తాజాగా జరిగింది రెండో వ్యవహారం. ఈ తీర్పు ప్రభావం మిగిలిన కేసులపై ఉండబోదని, ఏ కేస్‌కు ఆ కేస్ ప్రత్యేకమని మరోదానితో పోల్చుకోవడం సరికాదని బేయర్ లీగల్ టీం డిఫెండ్ చేసుకుంటోంది.


Click it and Unblock the Notifications