న్యూఢిల్లీ: యూబీ హోల్డింగ్స్ ప్రయివేట్ లిమిటెడ్‌లో విజయ్ మాల్యాకు చెందిన షేర్లను విక్రయించడం ద్వారా రూ.1,008 కోట్లు రాబట్టినట్లు ఈడీ తెలిపింది. మాల్యా మనీలాండరింగ్ లావాదేవీలపై ఈడీ దర్యాఫ్తు చేస్తోన్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా యునైటెడ్ బ్రూవరీస్ హోల్డింగ్స్ (యూబీ)లో మాల్యాకు చెందిన 74,04,932ల షేర్లను విక్రయించారు. దీంతో డెబిట్ రికవరీ ట్రైబ్యునల్ రూ.1008 కోట్లు పొందిందని పేర్కొంది.

షేర్ల విక్రయం ద్వారా రూ.1008 కోట్లు రికవరీ
విజయ్ మాల్యాపై చేపట్టిన మనీ లాండరింగ్ దర్యాప్తులో భాగంగా ఈ షేర్ల అటాచ్‌మెంట్ జరిగిందని ఈడీ తెలిపింది. బెంగళూరులోని డీఆర్టీకి ఆ షేర్లను స్వాధీనం చేయాలని యస్ బ్యాంకుకు కర్ణాటక హైకోర్టు గతంలోనే ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఈ నెల మొదట్లో డీఆర్టీకి చెందిన రికవరీ అధికారి యూబీ షేర్లను విక్రయించడం కోసం నోటీసు జారీ చేశారు. వీటి విక్రయం ద్వారా రూ.1008 కోట్లు వచ్చినట్లు ఈడీ బుధవారం తెలిపింది.మాల్యా కేసులో షేర్ల విక్రయం ఇదే మొదటిసారి అని, రానున్న రోజుల్లో మరిన్ని విక్రయిస్తామని తెలిపారు.

పీఎంఎల్ఏ కోర్టు అనుమతి
మాల్యా అక్రమాలకు సంబంధించి తమ ఏజెన్సీ సమర్పించిన ఆధారాలు, చేపట్టిన చర్యలతో పాటు బ్యాంకుల కన్సార్టియంకు కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ రూ.వేల కోట్లు బకాయి పడిందని, ఈ నేపథ్యంలో షేర్ల విక్రయానికి పీఎంఎల్ఏ కోర్టు అనుమతిచ్చిందని ఈడీ తెలిపింది. దర్యాఫ్తు సమయంలో ఈ షేర్లను మాల్యా విక్రయించకుండా పీఎంఎల్ఏ కింద ఈడీ ఈ షేర్లను అటాచ్ చేసింది. ఇప్పుడు ఇదే కోర్టు అనుమతితో విక్రయించారు. కాగా, యస్ బ్యాంకు నుంచి తీసుకున్న రుణాలకు గాను కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్.. యూబీకి చెందిన షేర్లను హామీగా ఉంచిందని ఈడీ పేర్కొంది. ఈ రుణానికి సంబంధించిన అధిక భాగం చెల్లింపులు ఇదివరకే జరిగాయి.

బ్యాంకులపై మాల్యా నిప్పులు
కాగా, యూబీలోని తన షేర్ల విక్రయం అనంతరం విజయ్ మాల్యా తీవ్రంగా స్పందించాడు. పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల నుంచి దోచుకొని పారిపోయాడని తనపై నిందలు వేసేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారని మాల్యా ధ్వజమెత్తాడు. బ్యాంకులు గతంలో రికవరీ చేశాయని, ఇప్పుడు కూడా అలాగే రికవరీ చేశాయన్నాడు. తన సెటిల్మెంట్‌లో భాగంగానే ఇవి జరుగుతున్నాయని చెప్పాడు. తన పట్ల దారుణంగా వ్యవహరిస్తున్నారని అభిప్రాయపడ్డాడు.ఇస్తే ఎంత, ఇవ్వకపోతే ఎంత మేం తీసుకోవాల్సింది తీసుకుంటామన్నట్లుగా బ్యాంకులు వ్యవహరిస్తున్నాయని, తనను లెక్కలోకి తీసుకోవడం లేదన్నారు.


Click it and Unblock the Notifications