పాన్-ఆధార్ లింక్, మార్చి 31 వరకే సమయం: పాన్‌కార్డ్ రద్దయ్యే ప్రమాదం
న్యూఢిల్లీ: పాన్ కార్డును ఆధార్ కార్డుతో అనుసంధానం చేసుకోవడానికి మరో నాలుగు రోజుల సమయం మాత్రమే ఉంది. ఆదివారం నాటికి ఈ అనుసంధానం పూర్తి చేసుకోవాలి. అనుసంధానం కాని వారి ఇన్‌కం ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయడం సాధ్యంకాదని సంబంధిత అధికారులు తెలిపారు. అంతేకాదు, వారి పాన్‌కార్డు కూడా రద్దయ్యే ప్రమాదముంది.

లింకింగ్ కోసం ఇచ్చే వివరాల్లో తేడా ఉండవద్దు
ఇప్పటికే ఐటీ డిపార్టుమెంట్ పాన్‌కార్డుకు ఆధార్ నెంబర్‌ను తప్పనిసరి చేస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. సెక్షన్ 139ఏఏ(2)కింద చట్టబద్ధం చేసింది. పాన్ కార్డు, ఆధార్ అనుసంధానం ఎంతో సులువు. ఐటీ వెబ్‌సైట్, ఎన్ఎస్‌డీఎల్, యూటీఐఐటీఎస్ఎల్‌ల ద్వారా అనుసంధానం చేసుకోవచ్చు. మనం ఇచ్చే వివరాల్లో ఏమాత్రం తేడా ఉండవద్దు. తేడా ఉంటే లింక్ కాదు.

పేర్లు వేర్వేరుగా ఉంటే
ఒకవేళ మీ ఆధార్ కార్డు, పాన్‌కార్డుల్లో మీ పేర్లు వేర్వేరుగా ఉంటే అనుసంధానం ఫెయిల్ అవుతుంది. అప్పుడు మీ కార్డుల్లో పేరును మార్చుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ చిన్న చిన్న తప్పులు ఉంటే కనుక వెరిఫికేషన్ తర్వాత ఇన్‌కం ట్యాక్స్ డిపార్టుమెంట్ ఓకే చేస్తుంది. మీ మొబైల్‌కు వన్ టైమ్ పాస్ వర్డ్ వస్తుంది. దీంతో వెరిఫై చేసుకుంటారు. అలాగే, ఎస్సెమ్మెస్ ద్వారా కూడా లింక్ చేసుకోవచ్చు. 567678 లేదా 56161 కు ఎస్సెమ్మెస్ చేయాలి. UIDPAN<12 digit Aadhaar><10 digit PAN> ఈ ఫార్మాట్లో పంపించాలి.

ఇప్పటికే ఎన్నోసార్లు పొడిగింపులు
ఆధార్ కార్డు, పాన్ కార్డ్ లింక్ చేసుకోవడానికి ఆదాయపన్ను శాఖ ఇప్పటికే ఎన్నో పొడిగింపులు ఇచ్చింది. ఇప్పుడు ఇది చివరి డెడ్ లైన్. మార్చి 31వ తేదీ (ఆదివారం) లోపు కచ్చితంగా అనుసంధానం చేసుకోవాలి. ఆధార్ - పాన్ లింకింగ్ చేసుకోవాలని సూప్రీం కోర్టు కూడా గత ఏడాది సెప్టెంబర్ నెలలో తీర్పు చెప్పింది.


Click it and Unblock the Notifications