జెట్ ఎయిర్‌వేస్‌లో కీలక మలుపు: నేడు నరేష్ గోయల్, అనిత రాజీనామా
న్యూఢిల్లీ: జెట్ ఎయిర్‌వేస్ సంక్షోభం నుంచి బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సంస్థ చైర్మన్ నరేష్ గోయల్ బోర్డు నుంచి తప్పుకున్నారు. ఆయనతో పాటు అతని భార్య అనితా గోయల్ కూడా బోర్డు నుంచి వైదొలిగారు. వారు తప్పుకుంటారని ఉదయం నుంచి ప్రచారం సాగుతోంది.
పాతిక సంవత్సరాల క్రితం 1993లో నరేష్ గోయల్ తన సతీమణి అనితాతో కలిసి జెట్ ఎయిర్‌వేస్‌ను ఏర్పాటు చేశారు. గత కొంతకాలంగా జెట్ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. గోయల్ తప్పుకోవాలని రుణాలు ఇచ్చిన ఎస్బీఐ నేతృత్వంలోని బ్యాంకుల కన్సార్టియం కోరుతోంది. ఈ నేపథ్యంలో గోయల్ రాజీనామా చేసే అవకాశముందని వార్తలు వస్తున్నాయి.
గోయల్ తప్పుకోవడంతో పాటు జెట్ ఎయిర్‌వేస్‌లో తన 51 శాతం వాటాను కూడా తగ్గించుకొనే అవకాశముంది. దాదాపు బిలియన్ డాలర్లకు పైగా అప్పులో కూరుకుపోయిన జెట్ ఎయిర్‌వేస్ ఇప్పుడు రుణాలు, లీజు డబ్బులు కూడా చెల్లించలేని పరిస్థితుల్లో ఉంది. ఇప్పటికే 119 విమానాలకు గాను సగానికి పైగా విమానాలు ఆగిపోయాయి.

ఇటీవలే, ఒకప్పుడు దేశీయ విమాన రంగానికి దిక్సూచిలా ఉన్న జెట్ ఎయిర్‌వేస్ ప్రస్తుతం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. ఇటీవల కాలంలో పైలెట్లు, ఇతర సిబ్బందికి జీతాలు చెల్లించక పోవడంతో వాళ్లు సమ్మెకు దిగారు. దాంతో ఎన్నో విమాన సర్వీసులను రద్దు చేసుకోవాల్సి వచ్చింది. ఇక తాజాగా విమానాల అద్దె చెల్లించక పోవడంతో పలు సంస్థలు జెట్ ఎయిర్‌వేస్‌కు తమ విమానాలను ఇవ్వడం మానేశాయి. దీంతో పలు అంతర్జాతీయ సర్వీసులను రద్దు చేస్తున్నట్లు జెట్ ఎయిర్‌వేస్ ప్రకటించింది.
ఏప్రిల్ 30 వరకు 13 అంతర్జాతీయ సర్వీసులు రద్దు చేశారు. వీటిలో ఎక్కువగా ముంబై, ఢిల్లీ నుంచి విదేశాలకు వెళ్లేవే ఉన్నాయి. అలాగే బెంగళూరు నుంచి ప్రతిరోజు రెండుసార్లు సింగపూర్ నడిపే సర్వీసును కూడా జెట్ ఎయిర్‌వేస్ విరమించుకుంది. ఢిల్లీ, ముంబై నుంచి విదేశాలకు వెళ్లే జెట్ ఎయిర్‌వేస్ విమానాలను పూర్తిగా రద్దు చేస్తున్నట్లు ఆ సంస్థ ప్రకటించింది. పుణె టు సింగపూర్, పుణె టు అబుదాబి విమానాలను రద్దు చేశారు. ముంబై నుంచి మాంచెస్టర్ వెళ్లే సర్వీసులను ఇప్పటికే నిలిపేశారు. ఆర్ధిక సంక్షోభం నేపధ్యంలోనే ఏప్రిల్ నెల చివర వరకు అంతర్జాతీయ సర్వీసులను రద్దు చేస్తున్నట్టు తెలుస్తుంది.


Click it and Unblock the Notifications