న్యూఢిల్లీ: 2016లో రూ.500, రూ.1000 చేసిన నోట్ల రద్దు భయంకరమైన ఆలోచనా? ఈ కారణంగా ఆర్థిక వ్యవస్థ మందగించిందని ప్రభుత్వం సొంత సర్వేలో తేలిందా? అంటే అవుననే అంటున్నారు ప్రముఖ ఆర్థిక, రాజకీయ విశ్లేషకులు సల్మాన్ అనీస్ సోజ్. ఈ మేరకు 'ది గ్రేట్ డిసప్పాయింట్‌మెంట్: హౌ నరేంద్ర మోడీ స్వాండర్డ్ ఏ యూనిక్ ఆపర్చునిటీ టు ట్రాన్స్‌ఫార్మ్ ది ఇండియన్ ఎకానమీ' పుస్తకంలో రచయిత సల్మాన్ అనీస్ సంచలన అంశాలు పేర్కొన్నారు.

లోకసభ ఎన్నికల్లో మోడీని భయపెట్టే అంశాల్లో ఇది ఒకటి
దేశంలో నోట్లను రద్దు చేయడం భయంకరమైన ఆలోచనగా ఆ పుస్తకంలో పేర్కొన్నారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం భారత ఆర్థిక వ్యవస్థను ఎలా మార్చింది, వచ్చే ప్రభుత్వం అజెండా ఏ విధంగా ఉండాలనే అంశాలను ప్రస్తావించారు. మోడీనామిక్స్‌గా పరిగణిస్తున్న ఈ అయిదేళ్ల సంస్కరణలను కూడా ఈ పుస్తకంలో విశ్లేషించారు. సామాన్య ప్రజల నుంచి మేధావుల వరకు నోట్ల రద్దును విమర్శించారని, లోకసభ ఎన్నికల్లో ప్రధాని మోడీని భయపెట్టే అంశాల్లో ఇది ఒకటి అని తాను విశ్వసిస్తున్నానని సల్మాన్ పేర్కొన్నారు.

మోడీకి ఇది సెల్ఫ్ గోల్
నోట్ల రద్దు కారణంగా ఆర్థిక వ్యవస్థ మందగించిందని ప్రభుత్వం సొంత సర్వేలు కూడా వెల్లడించాయని ఆ పుస్తకంలో పేర్కొన్నారు. నోట్ల రద్దు మోడీ ప్రభుత్వం సెల్ఫ్ గోల్ అంటున్నారు. అవినీతి, బ్లాక్ మనీ, తీవ్రవాదం, నకిలీ ధనం వంటి ప్రాథమిక లక్ష్యాలకు కూడా నోట్ల రద్దు ఆయుధం కాలేకపోయిందని అభిప్రాయపడ్డారు. అలాగే, నగదును తక్కువగా ఉపయోగించేందుకు కూడా ఈ నోట్ల రద్దు కారణం కాలేకపోయిందని పేర్కొన్నారు.

జీఎస్టీ వల్ల పెరగనున్న ఆర్థిక వృద్ధి రేటు
నోట్ల రద్దు వల్ల తాత్కాలికంగా ప్రభావం పడుతుందని తాను భావించానని, ప్రజలు ఇక్కట్లు ఎదుర్కొన్నారని గుర్తు చేశారు. నోట్ల రద్దు వల్ల తీవ్రవాదం ఎంతోకొంత తగ్గిందని చెప్పడానికి సరైన ఆధారాలు లేవని అభిప్రాయపడ్డారు. నోట్లరద్దు వల్ల అనుకున్న ప్రయోజనాలు నెరవేరలేదని చెప్పారు. నోట్ల రద్దు అనేది భయంకరమైన ఆలోచనగా అభిప్రాయపడ్డారు. నోట్లరద్దును సమర్థించే వారికి ఓ మాట చెప్పదలుచుకున్నానని పేర్కొంటూ.. స్వయంగా ప్రభుత్వ ఆర్థిక సర్వేలోనే నోట్ల రద్దు కారణంగా ఆర్థిక వ్యవస్థ మందగించినట్లుగా తేలిందన్నారు. జీఎస్టీ గురించి మాట్లాడుతూ.. ఇది చాలా ఆలస్యమైందని అభిప్రాయపడ్డారు. జీఎస్టీ వల్ల ఆర్థిక వృద్ధి రేటు 1.5 శాతం పెరుగుతుందని ఆర్థిక విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారన్నారు.


Click it and Unblock the Notifications