పెద్ద నోట్ల రద్దు పూర్తై సుమారు రెండున్నరేళ్ల సమయం గడుస్తున్నా ఇప్పటికీ దాని వల్ల ప్రయోజనం ఏంటో అంతుచిక్కడం లేదు. సాక్షాత్తూ ఆర్బీఐ కూడా పదే పదే ఈ విషయాన్ని చెబ్తూనే ఉంది. తాజాగా సమాచార హక్కు చట్టం కింద ఓ వ్యక్తి అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్తూ రిజర్వ్ బ్యాంక్ మరో అపహాస్య ప్రకటన చేసింది. డీమానిటైజేషన్ టైంలో పెట్రోల్ బంకుల దగ్గరకు ఎన్ని రూ.500/1000 నోట్లు వచ్చాయో తమ దగ్గర లెక్కలేదంటూ తేల్చిచెప్పింది. దీంతో భారతీయ రిజర్వ్ బ్యాంక్ పనితీరుపై మరోసారి దుమారం రేగింది. అసలు ఇలాంటి లెక్కలూ లేకుండా డీమానిటైజేషన్ వల్ల ఎంత ప్రయోజనం చేకూరిందో చెప్పలేని స్థితికి వచ్చింది ఆర్బీఐ.

నవంబర్ 8,2016
భారత ప్రధాని నరేంద్ర మోడీ 2016లో చేసిన పెద్ద నోట్ల రద్దు ప్రకటన దేశం యావత్తునూ నిర్ఘాంతపోయేలా చేసింది. తక్షణం 500/1000 నోట్లు రద్దు కాబోతున్నట్టు అప్పట్లో ఆయన చేసిన ప్రకటన సంచలనాన్ని క్రియేట్ చేసింది. అయితే బ్యాంకులు, పెట్రోల్ పంపులు వీటిని తీసుకోవచ్చు అనే వెసులుబాటును అప్పట్లో మోడీ సర్కార్ కల్పించింది. దీంతో పెట్రోల్ బంకులు సహా మరో 23 ఆవశ్యక కేంద్రాల్లో పెద్ద నోట్లను అప్పట్లో తీసుకున్నారు.
అందులో భాగంగా ప్రభుత్వ ఆస్పత్రులు, రైల్వే టికెటింగ్ కౌంటర్లు, ప్రభుత్వ ట్రాన్స్‌పోర్ట్, ఎయిర్‌పోర్ట్స్, మిల్క్ బూత్స్, మెట్రో రైల్ టికెట్స్, మందుల షాపులు, రైల్వే క్యాటరింగ్, ఎలక్ట్రిసిటీ, వాటర్ బిల్స్, హైవే టోల్ వంటివి ఉన్నాయి.

డిసెంబర్ 2 వరకూ సాగింది
అప్పట్లో తీవ్ర విమర్శలను ఎదుర్కొన్న ప్రభుత్వం రెండు, మూడుసార్లు కొన్నివెసులుబాట్లను కల్పించింది. మొదట నవంబర్ 25,2016 వరకూ ఆ తర్వాత డిసెంబర్ 15,2016 వరకూ పాత నోట్లను కొన్ని సర్వీసులకు తీసుకుంది. అయితే డిసెంబర్ 2,2016న ఎయిర్‌పోర్ట్స్, పెట్రోల్ పంపుల దగ్గర కూడా పాత నోట్లు చెల్లవని తేల్చిచెప్పింది. ఎందుకంటే అప్పట్లో పెద్ద ఎత్తున పాత కరెన్సీ పెట్రోల్ బంకుల దగ్గరే చేతులు మారి వైట్ అయింది.
కానీ ఆర్బీఐ మాత్రం ఈ కీలకమైన సమాచారం తమ దగ్గర లేదని చేతులెత్తేసింది. ఎందుకంటే ఇవన్నీ బ్యాంకుకు చేరవేసిన సమయంలో బ్యాంకులు ఈ సమాచారాన్ని ప్రత్యేకంగా క్రోడీకరించలేదని చెప్పి చేతులు దులిపేసుకుంది. వాస్తవానికి డీమానిటైజేషన్ ప్రక్రియ మొత్తం సరైన నిర్వాహణ లేక అపహాస్యం పాలైంది. ఎందుకంటే బ్యాంకింగ్ వ్యవస్థలో ఉన్న 99.3 శాతం పెద్ద నోట్లన్నీ తిరిగి బ్యాంకుల్లోకి వివిధ రూపాల్లోకి వచ్చి చేరాయి. అయితే ఇది నల్లధనాన్ని వెలికి తీసే ప్రక్రియ కాదని, లాకర్లలో మూలుగుతున్న సొమ్మంతా బ్యాంకింగ్ వ్యవస్థలోకి వచ్చేందుకు చేపట్టిన ప్రయత్నమని కేంద్రం తర్వాత అనేక మార్లు సర్దిచెప్పే ప్రయత్నం చేసింది.
మొత్తానికి తాజా ఉదంతంతో మన బ్యాంకింగ్ వ్యవస్థలు ఎంత పటిష్టంగా ఉన్నాయో, కీలకమైన సంధర్భాల్లో ఎంత అద్భుతంగా పనిచేశాయో ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు.


Click it and Unblock the Notifications