నితిన్ గడ్కరీ.. కేంద్ర మంత్రి. ఆయన ఈ మధ్య నాగ్‌పూర్‌లో జరిగిన మేయర్ ఇన్నోవేషన్ అవార్డ్స్ కార్యక్రమంలో పాల్గొన్నారు. అక్కడ వాళ్లను ఉద్దేశిస్తూ ఓ ప్రసంగం చేశారు. అయితే ఇది సాధారణమే అయినా ఆయన చెప్పిన మాటలు మాత్రం అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తాయి. ఇన్నోవేషన్ ప్రాధాన్యత, అంతరించిపోతున్న బయోఫ్యూయల్స్‌ను ఎలా కాపాడుకోవాలి అని చెప్పే క్రమంలో వినూత్నమైన ఐడియాను వెల్లడించారు
''ఎయిర్‌పోర్టుల్లో మూత్రాన్ని సేకరించి భద్రపర్చాలని నేను చెప్పాను. మనం ఇంకా యూరియాను విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. మనం గనుక యూరిన్‌ను సేవ్ చేసి అందులోని యూరియాను తయారు చేసుకున్నట్టైతే మన సమస్యలు చాలా వరకూ తీరిపోతాయి. అమూల్యమైన మూత్రం వేస్ట్ అయిపోతోంది. ఇలా చేస్తే చాలా కలిసొస్తుంది'' - నితిన్ గడ్కరీ

నా మాటలు పట్టించుకోరు.. నా ఐడియాలు గ్రేట్
మనిషి మూత్రంలో అమ్మోనియం సల్ఫేట్, నైట్రోజెన్ ఉంటుంది. ఇది యూరియా తయారీకి ఉపయోగపడ్తుంది అనే విషయాన్ని పదే పదే చెప్పారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తన ఐడియాలు వింతగా ఉన్నా వాటి వల్ల ప్రయోజనం ఉంటుందని, కానీ ఎవ్వరూ పట్టించుకోకపోవడం బాధేస్తుందన్నారు. ఎవరూ తన మాటలను లక్ష్యపెట్టరని, పైపెచ్చు కామెంట్ కూడా చేస్తుంటారని అసహనాన్ని వ్యక్తం చేశారు.
''మున్సిపల్ కార్పొరేషన్‌లు కూడా సహకరించవు. ఉద్యోగులంతా ఎద్దుల్లా అటూ ఇటూ చూడకుండా కళ్లకు గంతలు కట్టుకుని పోతూనే ఉంటారు. అది కూడా ప్రధాన సమస్యగా ఉంది. మొదట ఆలోచనలు మార్చుకోవాలి. కొత్తదనాన్ని ప్రోత్సహించాలి. అప్పుడే మన ఉనికి ఉంటుంది'' - అంటూ హితవు కూడా చెప్పారు నితిన్ గడ్కరీ.
నేనూ ఓ సారి..
కొన్నేళ్ల క్రితం గడ్కరీ చెప్పిన మాటలను ఈ సందర్భంగా మరోసారి గుర్తుచేసుకోవాలి. ఢిల్లీలోని బంగళాలో ఉన్నప్పుడు తన మూత్రాన్ని తానే భద్రపరుచుని దాన్ని ఎరువు కింద వాడానని చెప్పి విమర్శల పాలయ్యారు గడ్కరీ. తాజాగా కేంద్ర మంత్రి హోదాలో ఆయన చేసిన ఈ ఆలోచనలు మళ్లీ ఏం దుమారం లేపుతాయో చూడాలి.


Click it and Unblock the Notifications