ఈ రోజు స్టాక్ మార్కెట్లు ప్రారంభమైన వెంటనే చాలా మంది ఇన్వెస్టర్ల పోర్ట్‌ఫోలియోలు ఖచ్చితంగా నష్టాల్లో ఉండి ఉంటాయి. అందులో ఎలాంటి సందేహం లేదు. అయితే కొంత మంది ఔత్సాహికులు దీన్ని మరో స్టైల్‌లో చెప్పారు. మా పోర్ట్‌ఫోలియో.. లాభాల్లో ఉన్న నష్టాల్లో ఉన్నా మాకు బాధలేదు. కానీ మన దేశ జెండామాత్రం రెపరెపలాడుతుంటే నష్టం పెద్దగా బాధించలేకపోయింది అని. ఒక రకంగా ఇది నిజం. ఎందుకంటే కంట్రీ ఫస్ట్.. దేశం తర్వాతే ఏదైనా అనే మాట చిన్నప్పటి నుంచి మనం విన్నాం. ఇంతకీ చాలా మందికి అర్థం కాని లాజిక్ ఏంటంటే.. ముష్కరులు మనపై దాడిచేసినా, మన టెర్రరిస్టులపై విరుచుకుపడినా స్టాక్ మార్కెట్ ఎందుకు రియాక్ట్ అవుతుంది అని.

ఈ రోజు ఏమైంది
స్టాక్ మార్కెట్ ఈ ఉదయం ప్రారంభంలోనే భారీ నష్టాలను మూటగట్టుకుంది. సెన్సెక్స్ సుమారు 300 పాయింట్లకుపైగా నష్టపోయింది. గత రెండు నెలల్లో ఎప్పుడూ లేనంతగా ప్రారంభంలోనే ఒడిదుకులు ఎదుర్కొంది.

ఎందుకిలా
సాధారణంగా స్టాక్ మార్కెట్లకు, కరెన్సీ మార్కెట్లకు జియో పొలిటకల్ టెన్షన్స్ పెద్దగా నచ్చవు. ఎందుకంటే ఇవి ఒక్కోసారి కాస్ట్‌లీగా మారతాయి. అవతలివాళ్లు తిరిగి దాడి చేసినా.. లేకపోతే మనమే ఒక అడుగు ముందుకు వేసినా ఖర్చు భారీగానే ఉంటుంది. అనుకున్న దానికంటే ఎక్కువ మూల్యం చెల్లించుకోవాల్సి రావొచ్చు. ఒక్కోసారి ఆఫ్టర్ ఎఫెక్ట్స్ కూడా ఎక్కువే ఉంటాయి. అందుకే చాలా మంది పెద్ద ఇన్వెస్టర్లు, విదేశీ ఫండ్ మేనేజర్లు ఇలాంటి తరుణంలో సేఫ్ బెట్స్ కోసం చూస్తారు.

ఇదీ ఓ అవకాశమే
ఒక్కోసారి ఇలాంటి యుద్ధ మేఘాలు కూడా మార్కెట్లో ఇన్వెస్టర్లకు మంచి పెట్టుబడి అవకాశాన్ని కల్పిస్తాయి. ప్రపంచ మార్కెట్ దిగ్గజం వారెన్ బఫెట్ రెండో ప్రపంచ యుద్ధం సమయంలో మార్కెట్లో భారీగా పెట్టుబడులు కుమ్మరించి ఆ తర్వాత మంచి లాభాలను చవిచూశారు. యుద్ధం జరగబోతోంది అనే వార్త ముందే తెలిస్తే.. మరిన్ని ఎక్కువ నిధులను నేను పోగుచేసుకుంటా అనే విషయాన్ని బఫెట్ పదే పదే గతంలో చెప్పేవారు. ఎందుకంటే.. ఇలాంటివన్నీ తాత్కాలికమైన అంశాలే. మార్కెట్లు మళ్లీ నాలుగైదు రోజుల తర్వాత కోలుకుని యధావిధిగా ఫండమెంటల్స్ ఆధారంగానే నడుస్తాయి. అందుకే ఇలాంటి సమయాల్లో భారీగా స్టాక్స్ పడిపోతే వాటిల్లో మంచి వాటిని ఏరిపెట్టుకోవడం మంచిదని నిపుణులు సలహా ఇస్తూ ఉంటారు.

చరిత్ర ఏం చెబ్తోంది
జనవరి 2,2016న ఆరుగురు ముష్కరులు పఠాన్‌కోట్ ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ బేస్ క్యాంప్‌పై దాడి చేశారు. మూడు రోజులు అక్కడే నక్కి విధ్వంసం సృష్టించారు. ఈ సమయంలో సెన్సెక్స్ 1300 పాయింట్లు కోల్పోయింది.
సెప్టెంబర్ 2016లో యురీ ఎటాక్ నేపధ్యంలో సెన్సెక్స్ కేవలం 70 పాయింట్లు కోల్పోయింది.
ఇక 2016 సెప్టెంబర్ నెలలోనే భారత్ పాక్ పై సర్జికల్ స్ట్రైక్స్ చేసింది. ఆ సమయంలో సెన్సెక్స్ 465 పాయింట్లు కోల్పోయింది.
పై మూడు సందర్భాల్లో మార్కెట్లు నెగిటివ్‌గా రియాక్ట్ అయ్యాయి. అయితే ఇదే సమయంలో మళ్లీ అంతే వేగంగా కోలుకున్నాయి. అందుకే ఇలాంటి అవకాశాలు వచ్చినప్పుడు స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టాలని, అయితే స్మాల్ - మిడ్ క్యాప్స్ కాకుండా క్వాలిటీ స్టాక్స్ వైపే వెళ్లాలని నిపుణులు సూచిస్తున్నారు.


Click it and Unblock the Notifications