2019-20 ఆర్థిక సంవత్సరానికి టీటీడీ భారీ బడ్జెట్ ఇదే..!
తిరుమల: ప్రపంచంలోనే అత్యంత పేరుగాంచిన పుణ్యక్షేత్రం తిరుపతిలోని తిరుమలేశుని ఆలయం. వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్న ఈ ఆలయంకు సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానం 2019-20కి బడ్జెట్ కేటాయింపులు జరిపింది. ఇందులో భాగంగా ఈ ఆర్థిక సంవత్సరానికి రూ. 3,116 కోట్లు బడ్జెట్‌లో కేటాయించింది టీటీడీ బోర్డు. ఇక మొత్తం ఆదాయం మీద రూ.1,231 కోట్లు నగదు రూపంలో కేటాయించినట్లు టీటీడీ ఛైర్మెన్ పుట్టా సుధాకర్ యాదవ్ తెలిపారు.
జాతీయ, ప్రైవేట్ బ్యాంకుల్లో టీటీడీ చేసిన ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వచ్చిన వడ్డీ రూ. 846 కోట్లు అని వెల్లడించారు. ఇక వివిధ రకాల పూజలకు, యజ్ఞాలకు అమ్మిన టికెట్ల నుంచి వచ్చి డబ్బు, వీఐపీలకు ప్రత్యేక టికెట్లు, ఆన్‌లైన్ ద్వారా సేల్ అయిన టికెట్లు మొత్తం కలిపి రూ.292 కోట్లు వచ్చినట్లు సుధాకర్ యాదవ్ తెలిపారు. ఇక లడ్డూ ప్రసాదం ద్వారా వచ్చిన డబ్బు రూ. 270 కోట్లు అని వివరించారు.

ఇక ఏడు కొండలవాడికి మొక్కిన మొక్కులు ఫలించడంతో భక్తులు తమ కేశాలను స్వామివారికి ఇస్తారు. ఆ కేశాలు వేలం వేయడం ద్వారా వచ్చిన డబ్బు రూ. 10 కోట్లు అని సుధాకర్ యాదవ్ తెలిపారు. ఇక పెళ్లిళ్ల కోసం టీటీడీ కళ్యాణమంటపాలను అద్దెకు ఇవ్వడం ద్వారా వచ్చిన డబ్బులు రూ. 105 కోట్లుగా ఉందని చెప్పారు.
ఇక 6వేల మంది సిబ్బంది జీతభత్యాలు దాదాపు రూ. 625 కోట్లుగా ఉందని వెల్లడించిన సుధాకర్ యాదవ్... ఇక ఔట్ సోర్సింగ్ వారిపై రూ. 340 వెచ్చిస్తున్నట్లు స్పష్టం చేశారు. ఇక భక్తులకు మెరుగైన సదుపాయాలు కల్పించేందుకు గాను రూ. 400 కోట్లతో కొత్త నిర్మాణాలు, మరమత్తులు చేస్తున్నామని చెప్పారు. ఇక ఆసియా దేశాల్లో హిందూ ధర్మం గురించి బోధనలు చేసేందుకుగాను రూ. 179 కోట్లు వెచ్చించడం జరుగుతోందని వెల్లడించారు.


Click it and Unblock the Notifications