ఢిల్లీ: దేశ ఆర్థిక వ్యవస్థ కృంగిపోకుండా స్థిరంగా ఉండేందుకు ఆర్బీఐ చర్యలకు ఉపక్రమించింది. ఇందులో భాగంగానే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మోడీ ప్రభుత్వానికి మధ్యంతర డివిడెండ్ మొత్తం రూ.28వేల కోట్లు ఇవ్వనుంది. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సెంట్రల్ బోర్టు మీటింగ్‌లో పాల్గొన్న అనంతరం ఆర్బీఐ ఈ ప్రకటన చేయడం విశేషం.
అయితే ఇలా మధ్యంతర డివిడెండ్‌ను ప్రభుత్వానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బదిలీ చేయడం ఇది వరుసగా రెండో సారి. 2017-18 ఆర్థిక సంవత్సరానికి ప్రకటించిన రూ.50వేల కోట్లకు అదనంగా మరో రూ.28వేల కోట్లు ఆర్బీఐ కేంద్రప్రభుత్వానికి ఇస్తోంది. 2018 మార్చి 27 రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కేంద్ర ప్రభుత్వానికి రూ. 10వేల కోట్లు మధ్యంతర డివిడెండ్‌గా ఇచ్చింది.
"ఆడిట్ సమీక్ష జరిగిన తర్వాత ఆర్థిక వ్యవస్థపై క్షుణ్ణంగా అధ్యయనం చేసిన పిమ్మట, ఆర్బీఐ బోర్డు భారత ప్రభుత్వానికి మధ్యంతర డివిడెండ్‌గా రూ. 28 వేల కోట్లు బదిలీ చేసేందుకు నిర్ణయించింది. డిసెంబర్ 31, 2018 నాటికి ముగిసిన అర్థ సంవత్సరానికి గాను ఈ డబ్బులు బదిలీ చేయడం జరుగుతుంది" అని రిజర్వ్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా పేర్కొంది. 2017-18వ ఆర్థిక సంవత్సరంలో ఆర్బీఐ కేంద్ర ప్రభుత్వానికి రూ. 30,663 కోట్లు మధ్యంతర డివిడెండ్ రూపంలో బదిలీ చేసింది.

ఇక సోమవారం బోర్డు సమావేశం తర్వాత గత నాలుగేళ్లలో తాము తీసుకున్న విధానాలు, తీసుకొచ్చిన సంస్కరణలు గురించి జైట్లీ చెప్పారు. సంస్కరణలు తీసుకొచ్చిన తర్వాత ఆర్థిక వ్యవస్థను ఎలా గాడిలో పెట్టగలిగారనేదానిపై వివరించారు. ఇదిలా ఉంటే ఆర్బీఐ చట్టం 1934లోని సెక్షన్ 47 అనుసరించి సెంట్రల్ బ్యాంక్ తనకు వచ్చిన అధిక లాభాల నుంచి కేంద్ర ప్రభుత్వానికి డివిడెండ్ రూపంలో లాభాలనుంచి కొంత చెల్లిస్తుంది.
బడ్జెట్ డాక్యుమెంట్ల ప్రకారం ఆర్బీఐకి రూ. 82,911.56 కోట్లు అధిక లాభం వస్తుందని అంచనా వేసింది ప్రభుత్వం. అదికూడా 2019-20 ఆర్థిక సంవత్సరానికి వివిధ జాతీయ బ్యాంకులు ఇతర ఆర్థిక సంస్థల నుంచి ఆర్బీఐకి ఈ లాభాలు వస్తాయని అంచనా వేసింది. ఇక బడ్జెట్ కేటాయింపుల్లో రైతులకు ఇచ్చిన బెనిఫిట్స్ వల్ల ఖజానాపై 20వేల కోట్ల రూపాయల భారం పడుతుండటంతో... ఈ ఆర్థిక సంవత్సరంలో జీడీపీపై 3.4శాతం ఆర్థిక లోటు కనిపించే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications