ఆరు రోజుల లాభాలు ఆవిరి! సెన్సెక్స్ 400 పాయింట్స్ డౌన్
ఆరు రోజుల వరుస లాభాలకు బ్రేక్ పడింది. స్టాక్ మార్కెట్ సూచీలు వీకెండ్
రోజున దిగాలుగా ముగిశాయి. నిఫ్టీ మళ్లీ 11 వేల పాయింట్ల మార్కు దిగువన,
సెన్సెక్స్ 37 వేల పాయింట్ల దిగువన క్లోజైంది. మిడ్ సెషన్ తర్వాత వచ్చిన
అమ్మకాల ఒత్తిడి మార్కెట్లను కుంగదీసింది. మెటల్స్, బ్యాంకింగ్, ఆటో
రంగ షేర్లలో అమ్మకాలు సూచీలను నష్టాల్లోకి తోశాయి. ఉదయం నష్టాల్లో 11,023 పాయింట్ల దగ్గర ప్రారంభమైన నిఫ్టీ ఒక దశలో 11041 పాయింట్ల గరిష్ట స్థాయి వరకూ వెళ్లింది. మిడ్ సెషన్ వరకూ అటూఇటూగా సాగి
మధ్యాహ్నం తర్వాత వేగం పుంజుకుంది. 10925 పాయింటల్ కనిష్ట స్థాయికి దిగొచ్చి చివరకు 126 పాయింట్ల నష్టంతో 10943 దగ్గర క్లోజైంది. సెన్సెక్స్ 425 పాయింట్లు, బ్యాంక్ నిఫ్టీ 93 పాయింట్లు కోల్పోయాయి.
ఒక్క రియాల్టీ మినహా అన్ని రంగాల షేర్లలోనూ సెల్లింగ్ ప్రెషర్
నమోదైంది. ఆటో, ఎఫ్ఎంసిజి, మీడియా, మెటల్, పీఎస్‌యూ బ్యాంక్, ఫార్మా
కౌంటర్లలోని షేర్లను ఇన్వెస్టర్లు, ట్రేడర్లు తెగనమ్మారు. ఆరు రోజుల లాభాల్లో సగానికిపైగా ఈ ఒక్కరోజే ఎగిరిపోయాయి. మిడ్, స్మాల్ క్యాప్ ఇండెక్స్‌లు రెండు ఒకటిన్నర శాతానికిపైగా నష్టపోయాయి.
టాప్ గెయినర్స్, లూజర్స్
ఇన్ఫ్రాటెల్, కొటక్ మహీంద్రా, భారతి ఎయిర్టెల్, హెచ్ సి ఎల్ టెక్, పీఎల్
షేర్లు టాప్ గెయినర్స్‌గా నిలిచాయి. టాటా మోటార్స్, ఐబీ హౌసింగ్, వేదాంతా, ఐషర్ మోటార్స్, గ్రాసిం స్టాక్స్ టాప్ లూజర్స్ జాబితాలో చేరాయి.
టాటా మోటార్స్ ఠపీ
టాటా మోటార్స్ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా రూ.26 వేల కోట్ల నికర నష్టాన్ని ప్రకటించడం అందరినీ ఆశ్చర్యపరిచింది. దీంతో ఈ స్టాక్ ఈ రోజు సుమారు 20 శాతం కోల్పోయి రూ.142 స్థాయికి పడిపోయింది. చివరకు 18 శాతం నష్టంతో రూ.151.30 దగ్గర ముగిసింది. రీసెర్చ్ ఏజన్సీలన్నీ అధిక శాతం టాటా మోటార్స్‌కు హోల్డ్ రేటింగ్ ఇస్తూ రూ.150/160 వరకూ టార్గెట్స్ ఇచ్చాయి.
మెటల్స్ కరిగాయి
అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్‌కు తగ్గట్టు సప్లై లేకపోవడంతో స్టీల్ ధరలు పెరగడం చూస్తున్నాం. అయితే దేశీయంగా సరఫరా పెరగడంతో ఇక్కడ రేట్లు అంతంతమాత్రంగా ఉన్నాయి. ఈ నేపధ్యంలో సెయిల్ 8 శాతం, వేదంతా 6 శాతం, జిందాల్ స్టీల్స్, టాటా స్టీల్ 5 శాతం కోల్పోయాయి.

ప్రభుత్వ బ్యాంకుల బేజారు
ఈ వారం ప్రారంభం నుంచి ఇండెక్స్‌లు జోరుమీదున్నా బ్యాంక్ నిఫ్టీ మాత్రం పెద్దగా పార్టిసిపేట్ చేసిన దాఖలాలు లేవు. అయితే ఈ రోజు ప్రధాన సూచీలైన నిఫ్టీ పడిపోవడంతో పీఎస్‌యూ బ్యాంక్ స్టాక్స్ కూడా గ్రౌండ్
కోల్పోయాయి. బ్యాంక్ ఆఫ్ ఇండియా, పీఎన్‌బీ, ఓరియంటల్ బ్యాంక్, సిండికెట్ బ్యాంక్ 6 శాతం నష్టపోయాయి.
అడాగ్ షేర్లకు ఊరట
వరుస నష్టాలతో కూలిపోతున్న అనిల్ అంబానీ షేర్లకు ఈ రోజు కొద్దిగా
ఊపిరిపీల్చుకున్నాయి. ఎల్ అండ్ టి ఫైనాన్స్ సంస్థ తమ మ్యూచువల్ ఫండ్ దగ్గర షేర్లను పెద్ద ఎత్తున అమ్మేసిన తర్వాత ఈ గ్రూప్ స్టాక్స్ మరింత
పతనమవుతాయని అందరూ భావించారు. అయితే కొద్దిగా ఓవర్ సోల్డ్ జోన్‌లో ఉన్న నేపధ్యంలో రిలయన్స్ క్యాపిటల్ 12 శాతం, రిలయన్స్
పవర్ 10 శాతం లాభపడ్డాయి. రిలయన్స్ హోం ఫైనాన్స్, రిలయన్స్ ఇన్ఫ్రా కూడా ఐదు శాతానికిపైగానే తేరుకున్నాయి. రిలయన్స్ నిప్పాన్, రిలయన్స్ కమ్యూనికేషన్స్ కూడా ఐదు శాతం వరకూ లాభపడ్డాయి.
వచ్చేవారం
ఈ వారం ఫాల్స్ బ్రేకవుట్ రావడంతో మార్కెట్లు నిలబడలేకపోయాయి. వచ్చే వారం బలహీన ట్రెండ్ ఉండొచ్చనేది నిపుణుల విశ్లేషణ. మరింత మార్కెట్ సమాచారం, విశ్లేషణ కోసం ఈ వేదికను చూస్తూ ఉండండి.


Click it and Unblock the Notifications