మాకు విజయ్ మాల్యా వాడేసిన కార్లు కావాలి ! వీళ్ల వేదన చూడండి
విజయ్ మాల్యా.. పెద్దగా పరిచయం అక్కర్లేని వ్యక్తి. ఒకప్పుడు పన్నెండు మంది భామలతో కింగ్‌ఫిషర్ క్యాలెండర్లను ఏడాదికి ఒక్కటి చొప్పున లాంఛ్ చేస్తూ.. విలాసాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన వ్యక్తి పరిస్థితి ఇప్పుడు దారుణమైపోయింది. లండన్‌లో ఎక్కడో దాక్కుని కాలం వెళ్లదీస్తున్న అతనిపై బ్యాంకులు ఇంకా కారాలుమిరాయాలు నూరుతూనే ఉన్నాయి. ఎందుకంటే అతగాడు కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ పేరుపై రుణాలు తీసుకుని వాటిని ఎగ్గొట్టి ఎంచక్కా విదేశాలకు పారిపోయిన సంగతి మనలో చాలా మందికి తెలుసు. సుమారు రూ.10 వేలకు కోట్లకు పైగా రుణాలను తీసుకున్న మాల్యా నుంచి ఎంతో కొంత మొత్తాన్ని రాబట్టుకోవాలని బ్యాంకులన్నీ కలిసి నానా తంటాలు పడ్తున్నాయి.

తాజాగా బ్యాంకుల కన్సార్టియం మాల్యా దగ్గర విదేశాల్లో ఉన్న కార్లు, విలాసవంతమైన పడవలు, పెయింటింగ్స్ కోసం ప్రయత్నాలను ముమ్మరం చేశాయి. అవి ఎవరి పేరు మీద రిజిస్టర్ అయి ఉన్నాయి అనే విషయాలను ఆరాతీస్తున్నట్టు శుక్రవారం లండన్‌లో జరుగుతున్న కోర్ట్ ఫైలింగ్స్‌ను పరిశీలిస్తే అర్థమైంది. ప్రస్తుతం లండన్‌లో ఉన్న మాల్యాపై జరుగుతున్న విచారణ ముగిసిన తర్వాత ఆయన్ని తిరిగి ఇండియా బలవంతంగా పంపించే అంశంపై ఓ క్లారిటీ వస్తుంది.
అయితే మాల్యా మాత్రం తన దగ్గరున్న వస్తువులేవీ తనవి కావని, అవన్నీ ట్రస్ట్ ఆస్తులంటూ బుకాయిస్తారు. బ్యాంకులు, బ్యాంకులు అపాయింట్ చేసిన విదేశీ లాయర్లు మాత్రం అవన్నీ కాకమ్మ కబుర్లన్నీ, సదరు ట్రస్ట్‌లన్నీ మాల్యా సహా అతని ముగ్గురు పిల్లల ప్రయోజనాలే లక్ష్యంగా పనిచేస్తున్నాయని వాదిస్తున్నారు.
ఇంతకీ మాల్యా దగ్గర ఏమేం ఉన్నాయ్
ఇండియన్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారుల లెక్కల మేరకు విజయ్ మాల్యా దగ్గర 27 కార్లు ఉన్నాయి. వాటిల్లో ప్రధానంగా మినీ మోక్ అనే 1960 మోడల్ లగ్జరీ వింటేజ్ కార్ సహా టాప్ మోటల్ ఇంపోర్టెడ్ కార్లు కూడా ఉంది.
వీటికి తోడు 95 మీటర్ల పొడువైన ఇండియన్ ఎంప్రెస్, 50 మీటర్ల పొడవైన ఫోర్స్ ఇండియా అనే విలాసవంతమైన పడవలు (సూపర్ యాచ్) ఉన్నాయి. అయితే ఇండియన్ ఎంబసి దక్షిణ ఇంగ్లండ్‌లోని ఓ కోర్ట్ స్వాధీనం చేసుకుంది. దీన్ని గతంలో ఆయన సుమారు రూ.300 కోట్లకు మాల్టీస్ అనే సంస్థకు అమ్మారు.
పియానో పెయింట్‌పై ఆశలు
ఇండియన్ ఎంప్రెస్ యాచ్‌పై ఎల్టన్ జాయ్ పియానో గీసిన హై వేల్యూ ఆర్ట్ వర్క్ ఉంది. ఇది కూడా వందల కోట్లు విలువ చేస్తుందని బ్యాంకులు భావిస్తున్నాయి. అయితే దీన్ని ఆయన ఎవరికైనా అమ్మేశారా.. లేక అప్పులోళ్లు ఎవరైనా పట్టుకెళ్లారా అనే దాన్ని పరిశీలిస్తున్నారు. ఎందుకంటే మాల్యా తెలివిగా విలువైన వస్తువులు, ఆస్తులన్నింటినీ తనపేరుపై లేకుండా ట్రస్ట్‌లు, ఇతర సంస్థల పేర్లపై బదలాయించారు. ఇప్పుడు మన దేశంలో బ్యాంకుల కన్సార్టియం వాటి గుట్టు తెలుసుకునే ప్రయత్నాల్లో ఉంది.
ఎలా రాబట్టాలి
విదేశాల్లో ఉన్న ఆస్తులను ఎలా అయినా రాబట్టేందుకు మన దేశ బ్యాంకుల కన్సార్టియం ఖరీదైన లాయర్లను ఇంగ్లండ్‌లో నియమించింది. మాల్యాపై సాధ్యమైనన్ని ఎక్కువ లిటిగేషన్లు దాఖలు చేయాలని ఓపెన్ లైసెన్స్‌లు ఇచ్చాయి. దీనిపై మాల్యా స్పందిస్తూ.. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసే హక్కు బ్యాంకులకు ఎవరిచ్చారంటూ హాస్యాస్పదమైన ట్వీట్ చేశారు.
మరి బ్యాంకులు మాల్యా వాడేసిన కార్లు, లగ్జరీ పడవలను, పెయింట్లను ఎలా రాబట్టుకుంటాయో, ఒక వేళ అమ్మినా ఎంత ధర వస్తుందో వేచి చూడాలి. ఎందుకంటే వాళ్లు ఇచ్చిన రూ.10 వేల కోట్లలో కనీసం పదోవంతైనా వస్తుందో లేదో అనే అనుమానమే ఉంది.


Click it and Unblock the Notifications