జెట్ స్పీడులో నగర రియల్ ఎప్టేట్..! మరోసారి టాప్ లో శంకర్ పల్లి..!!
హైదరాబాద్ : హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్లో ఇప్పుడు శంకర్‌పల్లి మండలం పేరు మారుమోగుతోంది. ఓఆర్‌ఆర్, ఐటీ కారిడార్‌కు దగ్గరలో ఉండడం ఈ ప్రాంతానికి బాగా కలిసొచ్చింది. దీంతో అనేక సంస్థలు ఈ ప్రాంతంలో తమ వెంచర్లు ఏర్పాటు చేస్తున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఇప్పుడు శంకర్‌పల్లి మండలం హాట్ టాపిక్‌గా మారింది. గులాబీ ప్రభుత్వం రెండోసారి కొలువుదీరాక హైదరాబాద్ చుట్టు పక్కల ప్రాంతాల్లో భూములు, భవనాలు, ఇళ్ల స్థలాల ధర 20 శాతానికి మించి పెరిగాయి. హైదరాబాద్ రియల్టీ మార్కెట్‌లో హాట్‌కేక్‌లా మారిన 'శంకర్‌పల్లి' మండలంపై వన్ ఇండియా ప్రత్యేక కథనం..!

రెండింతలు పెరిగిన ధరలు..! భారీగా వస్తున్న విల్లాలు..!!
శంకర్‌పల్లి మండల పరిధిలో మాత్రం ధరలు రెండింతలు పెరిగాయి. ఈ ప్రాంతంలోని ఎక్కువ భూములు, స్థలాలను ఇప్పటికే పెద్ద పెద్ద సంస్థలు, బడా బాబులు, రాజకీయ నేతలు కొనుగోలు చేశారు. ఇపుడు ఈ ప్రాంతంలో లావాదేవీలన్నీ రియల్ ఎస్టేట్ కంపెనీల మధ్యే నడుస్తున్నాయి. శంకర్‌పల్లి మండలం మోకిలా గ్రామ పంచాయతీ పరిధిలో అయితే ధరలు మరింత అనుహ్యాంగా పెరిగాయి. ఈ ధరలు చూసి స్థానికులే బెంబేలేత్తుతున్నారు. ధరలు ఇలా అమాంతం పెరగడం మార్కెట్‌కు ఏ మాత్రం మంచిదికాదని రియల్ ఎస్టేట్ వర్గాలు చెబుతున్నాయి.

ఓఆర్‌ఆర్‌కు దగ్గరగా ఉండడం వల్ల ఎన్నో ఉపయోగాలు..! రియల్టర్ల డబుల్ ధమాకా..!!
శంకర్‌పల్లి మండలం, బాహ్య వలయ రహదారి(ఓఆర్‌ఆర్)కి సమీపంలోని రంగారెడ్డి జిల్లా పరిధిలో ఉంది. ఈ ప్రాంతం హైదరాబాద్‌కు పశ్చిమ శివారు ప్రాంతం కూడా. దీంతో రియల్టర్ల చూపంతా ఇప్పుడు ఈ ప్రాంతంపై పడింది. ఐటీ కారిడార్‌కు సమీపంలోనే ఉండడంతో ఐటీ ఉద్యోగులూ ఈ ప్రాంతంపై ఆసక్తి చూపుతున్నారు. రోడ్ల అభివృద్ధితో శంకరపల్లి మండలంలో రవాణా సౌకర్యాలు బాగా మెరుగుపడ్డాయి. రిసార్ట్‌లు, ఫామ్ హౌస్‌లూ ఈ ప్రాంతంలో ఎక్కువే. దీంతో ఈ ప్రాంతంలో అనేక గృహ నిర్మాణ ప్రాజెక్టులు వచ్చేశాయి. మరికొన్ని కంపెనీలు ఈ ప్రాంతంలో భారీ ప్రాజెక్టులు చేపట్టేందుకు ముందుకొస్తున్నాయి.

భవిష్యత్‌పై అంచనాలు..! విస్తరిస్తున్న నగరం..!!
హైదరాబాద్‌తోపాటు నగర శివార్లలోనూ మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందనే భావన పెరిగింది. మెట్రో తొలి దశ ఇప్పటికే పట్టాలెక్కింది. కొత్త మెట్రో రూటు నిర్మాణానికి రంగం సిద్ధమవుతోంది. అదనంగా ప్రాంతీయ వలయ రహదారి (ఆర్‌ఆర్‌ఆర్), ఆకాశ వంతెనలు, మూసీనది సుందరీకరణ.. ఇలా అనేక అభివృద్ధి పనులు ప్రారంభమయ్యే అవకాశముంది. ఈ అంశాలను దృష్టిలో పెట్టుకుని శంకరపల్లి ప్రాంతంలో ప్లాట్లను కొనుగోలు చేయడానికి ఎక్కువ మంది ఆసక్తి చూపుతున్నారు. సుస్థిరమైన ప్రభుత్వం ఉండటంతో మరో ఐదేళ్ల వరకు ఈ ప్రాంత రియల్ ఎస్టేట్ రంగ అభివృద్ధికి ఢోకా ఉండదని రియల్టర్లు భావిస్తున్నారు.

మోకిలా గ్రామం హాట్‌కేక్..! ఆకాశాన్నంటుతున్న ధరలు..!!
శంకర్‌పల్లి మండలం మోకిలా గ్రామ పంచాయతీ పరిధిలో భూముల ధరలు మరింత ఎక్కువగా ఉన్నాయి. ఈ ప్రాంతంలో ఇప్పటికే పెద్దఎత్తున గేటెడ్ కమ్యూనిటీ కాలనీలు వెలిశాయి. హైదరాబాద్ నుంచి శంకర్‌పల్లికి వెళ్ళే ప్రధాన మార్గంలో మెకిల్లా గ్రామం ఉంది. ఔటర్ రింగ్ రోడ్డును దాటగానే కోకాపేట, ఖానాపూర్, మీర్జాగూడ, దొంతనపల్లి గ్రామాలను దాటగానే వస్తుంది. ఈ గ్రామ పరిధిలో ఇప్పటికే సార్క్ అనే సంస్థ పెద్దఎత్తున నిర్మాణాలు చేపట్టింది. పలు నిర్మాణ సంస్థలు ఈ ప్రాంతాల్లో వెస్టెండ్ గ్రిల్స్, సుబిషి వాటర్‌ఫోర్డ్ లగ్జరీ హోమ్స్, రిలయన్స్ గ్రీన్ విలేజ్ పేర్లతో పెద్ద ఎత్తున నిర్మాణాలు చేపట్టాయి.


Click it and Unblock the Notifications