లంచ్ బాక్స్ విషయంలో నో టెన్షన్: హైదరాబాద్‌లోను 'డబ్బావాలా'
హైదరాబాద్: ముంబైలో డబ్బావాలాల సేవల గురించి అందరికీ తెలిసిందే. కార్యాలయాల్లో పని చేసే ఉద్యోగులకు, స్కూళ్లకు వెళ్లే పిల్లలకు వారు లంచ్ బాక్సులు అందిస్తుంటారు. నెలకు ఇంత మొత్తం అని తీసుకుంటారు. ఇలాంటి డబ్బావాలా సేవలు ఇప్పుడు హైదరాబాదులో కూడా అందుబాటులోకి వచ్చాయి.
ప్రతి రోజు స్కూళ్లకు వెళ్లే పిల్లలకు, ఆఫీసులకు వెళ్లే పెద్దవారికి లేచి వంట చేసి, వారికి లంచ్ బాక్స్ కట్టేందుకు ఇల్లాలు వేకువజామునే లేస్తుంది. అయినప్పటికీ అప్పుడప్పుడు అందదు. దీంతో పిల్లలకు స్కూల్, పెద్దలకు ఆఫీస్ ఆలస్యమయ్యే సందర్భాలు ఉంటాయి.
ఇప్పుడు హైదరాబాదులో అలాంటి టెన్షన్ అవసరంలేదని చెబుతున్నారు. పుడ్ డెలివరీ యాప్స్ ఉన్నప్పటికీ చాలామంది ఇంటి భోజనం ఇష్టపడతారు. వారి కోసం శుభవార్త. ముంబై తరహాలో హైదరాబాద్‌లో డబ్బావాలా పేరుతో సేవలు అందుబాటులోకి వచ్చాయి.

నేరుగా మీ ఇంటి నుంచే లంచ్‌బాక్సును మీ ఆఫీసు, కాలేజీ, స్కూలు వంటి పని ప్రదేశాలకు తెచ్చిస్తామంటున్నారని చెబుతున్నారు డబ్బావాలా నిర్వాహకులు. మనోజ్, మహేష్, మహదేవ్ అనే ముగ్గురు మిత్రులు కలిసి ఈ లంచ్‌బాక్స్ సర్వీసును ప్రారంభించారు.
గాజులరామారం నుంచి నానక్‌రాంగూడ, కూకట్‌పల్లి నుంచి రెహెజా మైండ్‌స్పేస్ ఈ రెండు మార్గాల్లో ప్రస్తుతం డబ్బావాలా సర్వీస్ అందిస్తోంది. ఇప్పటి వరకు పదిహేడు మంది కస్టమర్లకు వాళ్ల ఇళ్ల నుంచి లంచ్ బాక్సులు వారి ఆఫీస్‌లకు చేరవేస్తోంది. మధ్యా హ్నం పన్నెండు గంటల నుంచి మధ్యాహ్నం ఒకటి గంటలోపే క్యారియర్‌ను సంబంధిత ప్రదేశానికి చేర్చే లక్ష్యంతో పని చేస్తున్నట్లు తెలిపారు.
ఇంటి నుంచి లంచ్‌బాక్స్ చేర్చాల్సిన ప్రదేశానికి మధ్య దూరం ఆధారంగా చార్జీ వేస్తున్నట్లు తెలిపారు. కిలో మీటర్ నుంచి నాలుగు కిలో మీటర్ల దూరం ఉంటే నెలకు రూ.600, తొమ్మిది కిలో మీటర్ల వరకు ఉంటే రూ.800, అంతకుమించి ఉంటే రూ.1000 వసూలు చేస్తున్నట్లు చెబుతున్నారు. డబ్బావాలా సేవల కోసం 8317513265, 97004 25729కు ఫోన్ చేయవచ్చునని చెబుతున్నారు.


Click it and Unblock the Notifications