నగదు రహిత లావాదేవీలకు కేంద్రం మరింత జోష్ ఇస్తుంది.
గ్రామీణ ప్రాంతాల్లోనూ నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం మరిన్ని చర్యలు తీసుకోనుంది. నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించేందుకు ప్రత్యేక రాయితీలు కల్పించనున్నట్లు జీఎస్టీ కౌన్సిల్ ప్రకటించింది. 29వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం ఆర్థిక శాఖ వ్యవహారాలను పర్యవేక్షిస్తున్న కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అధ్యక్షతన శనివారం జరిగింది. అనంతరం సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ఆయన మీడియాకు వివరించారు. రూపే కార్డు, భీమ్ ద్వారా డిజిటల్ లావేదేవీలకు ప్రోత్సాహాలు అమలు చేయనున్నట్టు ప్రకటించారు.

భీమ్ యాప్, రూపే కార్డు ద్వారా డిజిటల్ పేమెంట్లు చెల్లించేవారికి 20 శాతం వరకూ క్యాష్‌బ్యాక్ ఉంటుందని తెలిపారు. క్యాష్ బ్యాక్ పరిమితి రూ.100 వరకూ ఉంటుందన్నారు. ఈ క్యాష్ బ్యాక్ కారణంగా ఏడాదికి కేంద్రం రూ.1000 కోట్ల మేర ఆధాయాన్ని కోల్పోవాల్సి ఉంటుందని తెలిపారు. ఇందుకు సంబంధించి జీఎస్‌టీ కౌన్సిల్ ఒక సాఫ్ట్‌వేర్ రూపొందించాలని నిర్ణయించినట్టు గోయల్ చెప్పారు.
జీఎస్టీ అమలుతో కుదేలవుతున్న సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థలకు (ఎంఎస్ఎంఈ) బాసటగా నిలవనున్నట్లు పీయూష్ గోయల్ ప్రకటించారు. ఎంఎస్ఎంఈకి సంబంధించిన సమస్యలను లోతుగా పరిశీలించేందుకు ఒక కమిటీ ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. అటు విద్యార్థులపై ఆర్థిక భారాన్ని తగ్గిస్తూ జీఎస్టీ కౌన్సిల్ కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర, రాష్ట్ర ఎడ్యుకేషన్ బోర్డులు పరీక్షల నిర్వహణపై ప్రస్తుతం విధిస్తున్న సేవా పన్నును రద్దు చేసినట్లు గోయల్ తెలిపారు.
కాగా స్టోరేజీ వాటర్ హీటర్లపై ప్రస్తుతమున్న 28 శాతం పన్నును 18 శాతానికి తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి గోయల్ ప్రకటించారు. దీని ద్వారా మధ్యతరగతి ప్రజలకు లబ్ధి చేకూరుతుందని చెప్పారు


Click it and Unblock the Notifications