6 శాతం వద్దే రెపో రేటు
ప్రస్తుత నిర్ణయం తర్వాత రెపో రేటు 6%, రివర్స్ రెపో రేటు 5.75% , బ్యాంకు రేటును 6.25%గా నిర్ణయించారు.
ఆర్‌బీఐ గవర్నర్ అధ్యక్షతన రెండు రోజుల పాటు సమావేశమైన పరపతి విధాన కమిటీ రేట్ల కోతకు మొగ్గుచూపలేదు. రెపో రేటును యథాతథంగా ఉంచడంతో బ్యాంకుల వడ్డీ రేట్లలో మార్పు ఉండకపోవచ్చు. ప్రస్తుత నిర్ణయం తర్వాత రెపో రేటు 6%, రివర్స్ రెపో రేటు 5.75% , బ్యాంకు రేటును 6.25%గా నిర్ణయించారు. మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ రేటును సైతం 6.25% వద్దే ఉంచారు. ద్రవ్యోల్బణం అధిక స్థాయిలో ఉండటంతో ఆర్బీఐ రేట్ల కోతకు ఇష్టపడలేదు.

రేట్లపై తటస్థ దృక్పథం కొనసాగుతుందని ద్రవ్య పరపతి విధాన కమిటీ అభిప్రాయపడింది. కుటుంబాల మీద ఆర్‌బీఐ నిర్వహించిన సర్వేలో''ఇటీవలి మూడు నెలలకు గాను, వచ్చే సంవత్సరానికి గాను ద్రవ్యోల్బణం ఇంకా పెరుగుతుందనే తెలిసింది. అక్టోబర్ నెలలో వ్యవసాయ, పారిశ్రామిక పరికరాలు, వస్తువుల ఖర్చులు పెరిగాయి. ''అని తేలింది.
చాలా మంది విశ్లేషకులు ఇకపై ఆర్బీఐ వడ్డీ రేట్లు పెంచుతుందని భావించారు. వడ్డీ రేట్ల తగ్గింపు ఇంతకు మించి ఉండదని అంచనా వేశారు. నిజానికి ఆర్‌బీఐ ఒకవేళ వడ్డీ రేట్లు తగ్గించాలంటే ఇది చివరి అవకాశమని చాలా మంది అనుకున్నారు.
దేశీయంగా చూస్తే స్థూల విలువ జోడింపు(జీవీఏ) 2017-18 రెండో త్రైమాసికంలో కాస్త పెరిగింది. సీపీఐ ద్రవ్యోల్బణ లక్ష్యం సమీప భవిష్యత్తులో 4శాతానికి కాస్త అటుఇటుగా ఉంటుందని మానిటరీ పాలసీ తన సమీక్షలో తెలిపింది. అయితే ఇది వృద్దిని పెంచే దిశగా తోడ్పాటునిస్తుందని అభిప్రాయపడింది.
రెపో రేటు అంటే:
మనం బ్యాంకుల వద్ద రుణాలు తీసుకుంటాం. అలాగే బ్యాంకులు రిజర్వ్ బ్యాంక్ వద్ద స్వల్ప కాలం నుంచి మధ్య కాలానికి రుణాలు తీసుకుంటాయి. తక్కువ కాలపరిమితి వ్యవధిలో వాణిజ్య బ్యాంకులు ఆర్బీఐ వద్ద తీసుకునే రుణాలకు ఆర్‌బీఐ తీసుకునే వడ్డీ రేటును రెపో రేటుగా వ్యవహరిస్తారు. ఈ రెపో రేటు, రివర్స్ రెపోరేటును రెండు నెలలకొకసారి ద్రవ్య పరపతి విధాన కమిటీ నిర్ణయిస్తుంది.


Click it and Unblock the Notifications