ఫర్వాలేదనిపించిన ఐటీ, ఫార్మా రంగాలు
ఉదయం నుంచీ స్వల్ప హెచ్చుతగ్గుల మధ్య కదిలినప్పటికీ చివర్లో ప్రభుత్వ బ్యాంకులు, లోహ రంగాలలో పెరిగిన భారీ అమ్మకాలతో మార్కెట్లు డీలాపడ్డాయి
చివర్లో అమ్మకాలు ఊపందుకోవడంతో వరుసగా రెండో రోజూ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. ఉదయం నుంచీ స్వల్ప హెచ్చుతగ్గుల మధ్య కదిలినప్పటికీ చివర్లో ప్రభుత్వ బ్యాంకులు, లోహ రంగాలలో పెరిగిన భారీ అమ్మకాలతో మార్కెట్లు డీలాపడ్డాయి. ట్రేడింగ్ ముగిసేసరికి సెన్సెక్స్ 152 పాయింట్లు క్షీణించి 33,219 వద్ద స్థిరపడింది. ఒక దశలో 33,157 వద్ద కనిష్టాన్ని తాకింది. ఇక ఇంట్రాడేలో 10,285 వరకూ జారిన నిఫ్టీ 47 పాయింట్లు కోల్పోయి 10,303 వద్ద ముగిసింది.
ఐటీ, ఫార్మా ఫర్వాలేదనిపించి..
ఎన్‌ఎస్‌ఈలో ఐటీ 0.7 శాతం, ఫార్మా 0.3 శాతం చొప్పున బలపడగా.. పీఎస్‌యూ బ్యాంక్స్ 2 శాతం పతనమైంది. ఈ బాటలో మెటల్, రియల్టీ, ఆటో 1.4-0.7 శాతం మధ్య నీరసించాయి.

పెద్ద కంపెనీల షేర్లు ఇలా...
నిఫ్టీ దిగ్గజాలలో భారతీ, వేదాంతా, టాటా మోటార్స్, యస్‌బ్యాంక్, లుపిన్, ఐసీఐసీఐ, ఆర్‌ఐఎల్, హెచ్‌పీసీఎల్, హీరోమోటో, స్టేట్‌బ్యాంక్ 3.6-1.5 శాతం మధ్య తిరోగమించాయి. అయితే టెక్ మహీంద్రా, యాక్సిస్, ఏషియన్ పెయింట్స్, సిప్లా, సన్ ఫార్మా, ఇన్‌ఫ్రాటెల్, ఎంఅండ్ఎం, అరబిందో, ఇండస్‌ఇండ్, టీసీఎస్ 4-1 శాతం మధ్య జంప్‌చేశాయి.
చిన్న షేర్లు బలహీనం
మార్కెట్ల బాటలో చిన్న షేర్లలోనూ అమ్మకాలు పెరిగాయి. బీఎస్‌ఈలో మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ ఇండెక్సులు దాదాపు 1 శాతం చొప్పున వెనకడుగు వేశాయి. ట్రేడైన మొత్తం షేర్లలో 1744 నష్టపోగా.. 1015 మాత్రమే లాభపడ్డాయి.
ఎఫ్‌పీఐల కొనుగోళ్లు
ఇటీవల కొనుగోళ్ల యూటర్న్ తీసుకున్న విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) మంగళవారం రూ. 461 కోట్లకుపైగా ఇన్వెస్ట్ చేశారు. సోమవారం సైతం రూ. 576 కోట్లకుపైగా విలువైన స్టాక్స్ కొనుగోలు చేసిన విషయం విదితమే. కాగా.. మరోవైపు సోమవారం దాదాపు రూ. 264 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించిన దేశీ ఫండ్స్(డీఐఐలు) మంగళవారం ఏకంగా రూ. 2,046 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి.


Click it and Unblock the Notifications