గ్రాట్యుటీ రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షలకు పెంచిన కేంద్రం
ఇంతవరకు ప్రభుత్వ, ప్రైవేటు రంగంలో పనిచేసే ఉద్యోగుల పన్నురహిత గ్రాట్యుటీ పరిమితి రూ.10 లక్షల వరకు ఉండేది. ఈ పరిమితిని రూ.20 లక్షలకు పెంచాలన్న ప్రతిపాదనను క్యాబినెట్ ఆమోదించింది.
ఇంతవరకు ప్రభుత్వ, ప్రైవేటు రంగంలో పనిచేసే ఉద్యోగుల పన్నురహిత గ్రాట్యుటీ పరిమితి రూ.10 లక్షల వరకు ఉండేది. ఈ పరిమితిని రూ.20 లక్షలకు పెంచాలన్న ప్రతిపాదనను క్యాబినెట్ ఆమోదించింది. ఉద్యోగ విరమణ తర్వాత ఉద్యోగికి ఆర్థిక, సామాజిక భద్రతను కల్పించడంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ఇంతకుముందు ఎక్కువ మొత్తానికి అర్హత సాధించినా చెల్లించే గ్రాట్యుటీ మొత్తం రూ.10 లక్షలకు మించేది కాదు. ఇకపై అది రూ.20 లక్షల వరకూ ఉండనుంది. ఈ నేపథ్యంలో గ్రాట్యుటీ చట్ట సవరణ గురించి ముఖ్య విషయాలు తెలుసుకుందాం.

5 ఏళ్ల పాటు కంపెనీలో పనిచేయాలి
1) ఒక కంపెనీలో దీర్ఘకాలం పాటు పనిచేసినందుకు ఉద్యోగి యాజమాన్యం నుంచి అందుకునే ప్రయోజనం గ్రాట్యుటీ. గ్రాట్యుటీ చట్టం కింద వచ్చే కంపెనీలు ఒక ఉద్యోగి 5 ఏళ్ల కంటే ఎక్కువ కాలం పనిచేస్తే ఈ గ్రాట్యుటీ రూపంలో చెల్లింపులను అందుకుంటారు.

రూ.20 లక్షల వరకూ
2) గ్రాట్యుటీ సవరణ బిల్లు మూలంగా వ్యవస్థీకృత రంగంలో పనిచేసే వారు ఇకపై రూ.20 లక్షల వరకూ అందుకునే గ్రాట్యుటీ మొత్తానికి పన్ను ఉండదు.

ఎలాంటి సంస్థలకు గ్రాట్యుటీ చట్టం
3) 10 లేదా అంతకంటే ఎక్కువ మంది ఉద్యోగులు పనిచేసే సంస్థలకు గ్రాట్యుటీ చట్టం వర్తిస్తుంది.

సామాజిక భద్రత కోణంలో
4) ఉద్యోగులు, కార్మికులకు పదవీ విరమణ తర్వాత సామాజిక భధ్రత కల్పించే క్రమంలో ఈ చట్టాన్ని రూపొందించారు. కాబట్టి ఏదైనా శరీర భాగాలకు అనారోగ్యం సోకినా లేదా అంగవికలురైనా ఆర్థిక రక్షణ ఉంటుంది.

ప్రభుత్వ ప్రకటన
5) ప్రస్తుతం పెరుగుతున్న ద్రవ్యోల్బణం, వేతన పెరుగుదలను దృష్టిలో ఉంచుకుని ప్రైవేటు రంగ ఉద్యోగులకు సైతం గ్రాట్యుటీ చట్టం సవరణలకు అనుగుణంగా మార్పులను చేపట్టాల్సి ఉంటుందని ప్రభుత్వం ప్రకటించింది.

ఏడాది మధ్యలో ఉద్యోగం మానేస్తే
6) గ్రాట్యుటీ సొమ్ము చెల్లింపు చేయాలన్నప్పుడు కంపెనీలు ఉద్యోగి చివరి నెల వేతనాన్ని ఒక ఆధారంగా తీసుకుంటారు. ఉద్యోగి చివరి ఏడాది పనిచేసినప్పుడు 6 నెలల కంటే ఎక్కువ వ్యవధి ఉంటే దాన్ని ఒక సంవత్సరంగా పరిగణిస్తారు. అదే ఉద్యోగి చివరి ఏడాది పనిచేసింది 6 నెలల కంటే తక్కువ అయితే అది ఒక సంవత్సరం తక్కువ అయినట్లు చూస్తారు. ఉదాహరణకు ఒక ఉద్యోగి సర్వీస్ పీరియడ్ 5 సంవత్సరాల 5 నెలలు అయితే గ్రాట్యుటీని 5 ఏళ్లు మాత్రమే చెల్లిస్తారు.

యాజమాన్యం ఎక్కువ మొత్తాన్ని చెల్లించొచ్చు
7) ఉద్యోగం చేసిన సంస్థ ఈ (ప్రభుత్వ)ఫార్ములా కింద లెక్కించి వచ్చే దాన్ని మాత్రమే కాకుండా ఇంకా ఎక్కువ మొత్తాన్ని సైతం చెల్లించవచ్చు.

ప్రైవేటు సంఘటిత రంగానికి సైతం
8) 7వ వేతన సవరణ సంఘం సూచనల మేరకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గ్రాట్యుటీ పరిమితిని రూ.20 లక్షల వరకూ పెంచిన నేపథ్యంలో ప్రయివేటు సంఘటిత రంగాన్ని సైతం దీని పరిధిలోకి తీసుకొచ్చారు.

సవరణల అమలు గతేడాది నుంచే
9) కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి సవరణలను జులై,2016 నాడు నోటిఫై చేశారు. అమలు మాత్రం జనవరి1, 2016 నుంచి వర్తించేటట్లు చూశారు.

అదనపు డీఏ
10) అలాగే పెరిగిన ధరలకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు 1% అదనపు డీఏను ప్రకటించింది. ఈ నిర్ణయంతో 49.26లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతోపాటు 61.17లక్షలమంది పింఛనుదారులకు లబ్ధి చేకూరనున్నది. కేంద్ర ప్రభుత్వ ఖజానాపై ఏడాదికి పెంచిన కరువు భత్యం (డీఏ) ద్వారా రూ.3,068 కోట్లు, కరువు ఉపశమనం (డీఆర్) ద్వారా రూ.2045 కోట్ల భారం పడనున్నది.


Click it and Unblock the Notifications