యూపీఏ-2 భూసేకరణ చట్టం,2013ని తీసుకొచ్చింది. అందులో కొన్ని ముఖ్య విషయాలను ఇక్కడ చూద్దాం.
ప్రజాప్రయోజనాల కోసం చేసే భూసేకరణలో దశాబ్దాల తరబడి రైతులకు అన్యాయం జరుగుతోంది. పరిహారం పేరుతో వారికి చెల్లించే డబ్బు మార్కెట్ ధర కంటే ఎంతో తక్కువగా ఉండేది. ఆ స్వల్ప పరిహారం చెల్లింపులో కూడా విపరీత జాప్యం చేసేవారు. భూముల కొనుగోలుదార్లు నానాటికీ అభివృద్ది చెందుతుంటే, భూములు కోల్పోయిన వారు పేదరికంలోకి వెళ్లే విధంగా భూసేకరణ విధానం కొనసాగుతున్నది. ఈ నేపథ్యంలో యూపీఏ-2 భూసేకరణ చట్టం,2013ని తీసుకొచ్చింది. అందులో కొన్ని ముఖ్య విషయాలను ఇక్కడ చూద్దాం.

1. ఆహార భద్రత:
ఇప్పటి వరకూ సారవంతమైన భూములను వివిధ కారణాలు, ఒత్తిళ్ల వల్ల ఇతర అవసరాల కోసం యథేచ్చగా సేకరిస్తూ వచ్చారు. అయితే నూతన చట్టం వ్యవసాయ భూమిని సేకరించేటప్పుడు ఆహార భద్రతకు భంగం కలగకుండా చూడాలని నిర్దేశిస్తోంది. కొత్త భూసేకరణ చట్టం ప్రకారం ఎలాంటి పరిస్థితుల్లోనూ రెండు మూడు పంటలు పండే సారవంతమైన భూములను, నీటి పారుదల సదుపాయం ఉండే భూములను సేకరించరాదు. దీనివల్ల సారవంతమైన భూములను ఇతర వాణిజ్య అవసరాలకు సేకరించడానికి వీలు పడదు.

2. బాధితుల అంగీకారం:
1894 చట్టం ప్రకారం భూసేకరణలో భాదితుల అంగీకారానికి చోటు లేదు. కానీ తాజా చట్టంలో ప్రైవేటు కంపెనీల కోసం భూసేకరణ చేసేటప్పుడు 80 శౄతం వరకూ, పబ్లిక్ ప్రైవేటు ప్రాజెక్టులకు నిర్వాసితుల్లో 70 శాతం మంది అంగీకారం తప్పనిసరి. దీనివల్ల భూమిని బలవంతంగా సేకరించడం ఎట్టిపరిస్థితుల్లోనూ జరగదు.

3.నష్టపరిహారం:
1894 చట్టంలో నష్టపరిహారంగా మార్కెట్ విలువనే ప్రాతిపదికగా తీసుకోవాలని సూచించారు. అయితే నూతన చట్టం ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో నాలుగు రెట్లు, పట్టణ ప్రాంతాల్లో రెండు రెట్లు ఎక్కువ పరిహారం చెల్లించాలి. దీనివల్ల సంబంధిత భూయజమానులకు సరైన న్యాయం జరుగుతుంది.

4. మార్కెట్ విలువ:
1894 చట్టం ప్రకారం ప్రస్తుత భూమి నిరుపయోగమైనది అని తేలితే , ముందుగా ఊహించని వినియోగం ఆధారంగా భూమి మార్కెట్ విలువను ఖరారు చేసేవారు. నూతన భూసేకరణ చట్టం ప్రకారం భూసేకరణ సమయంలో సంబంధిత భూమికి సంబంధించి మార్కెట్ విలువను నిర్ణయించడానికి బేసిక్ ధరకు మూడు రెట్లు లేదా గత మూడు సంవత్సరాలలో జరిగిన భూ లావాదేవీల్లో అత్యధిక విక్రయ ధర ఆధారంగా వీటిలో ఏది ఎక్కువైతే దానిని పరిణనలోకి తీసకోవాలి. దీనివల్ల భూయజమానులకు న్యాయం జరుగుతుంది.

5. సామాజిక ప్రభావం అంచనా:
1894 చట్టంలో సామాజిక ప్రభావ అంచనా నిబంధనే లేదు. కొత్త భూసేకరణ చట్టంలో ప్రతి సేకరణ విషయంలో సామాజిక ప్రభావం అంచనా తప్పనిసరి అని పేర్కొన్నారు. ఈ నిబంధనతో నిర్దేశిత భూసేకరణ వల్ల సమాజంపై ప్రతికూల ప్రభావం జరుగుతుందని అంచనా వేస్తే సేకరణ చేపట్టరాదు.

6. భూమిని తిరిగి విక్రయిస్తే అనుమతి తప్పనిసరి:
1894 నాటి చట్టంలో భూమి తిరిగి విక్రయించే ప్రస్తావన లేదు. అయితే నూతన చట్టం ప్రకారం భూ యజమాని నుంచి కొనుగోలు చేసిన భూమిని తిరిగి విక్రయించాలంటే ప్రభుత్వ అనుమతి తప్పనిసరి. దీనివల్ల భూవిక్రయాల్లో పారదర్శకత చోటు చేసుకుంటుంది.

7. 100 శాతం తాత్కాలిక పరిహారం
అసౌకర్యానికి గురవడం, గాయపడటం లేదా ఇతరత్రా కలిగిన నష్టాలకు 30 శాతం తాత్కాలిక పరిహారంగా చెల్లించాలని 1894 నాటి చట్టం నిర్దేశిస్తోంది. అయితే కొత్త భూసేకరణ చట్టం ప్రకారం తాత్కాలిక పరిహారం 100 శాతం చెల్లించాల్సి ఉంటుంది. దీనివల్ల భూయజమానులకు గతంలో కంటే మూడు రెట్లు అధిక ప్రయోజనం చేకూరుతుంది.

8. భూ బ్యాంకులో జమ:
భూ సేకరణ జరిగిన తర్వాత భూమిని ఉపయోగించకుండా ఖాళీగా ఉంచితే, ఆ భూమిని తిరిగి సొంతదారుకు అప్పగించడం లేదా రాష్ట్ర భూ బ్యాంకుకు జమ చేసే అధికారాన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు ఇవ్వడం జరిగింది. దీనివల్ల ప్రాజెక్టుల్లో జాప్యానికి తెరపడుతుంది. భూమి సేకరించిన వారు నిర్లిప్తంగ ఉండకుండా వెంటనే ప్రాజెక్టును పట్టాలెక్కించాల్సి ఉంటుంది. దీనివల్ల ప్రాజెక్టు ఫలితాలు సత్వరమే లభిస్తాయి.

9. జీవనోపాధికి పరిహారం:
భూసేకరణ వల్ల జీవనోపాధిని కోల్పోయిన వారికి రూ.3000 చొప్పున మొదటి సంవత్సరం అందించాలి. ఆ తర్వాతి ఏడాది నుంచి 20 సంవత్సరాల పాటు నెలకు రూ.2000 నష్ట పరిహారాన్ని అందించాలి. ఇప్పటి వరకూ ఉన్న చట్టంలో జీవనోపాధికి సంబంధించి పరిహారం అనే ప్రస్తావనే ఉండేది కాదు.

10. పరిశ్రమల ఏర్పాటు కష్టమే
కొత్త భూసేకరణ చట్టం ప్రకారం 80 శాతం ఆమోదం కష్టం. ఏదైనా పరిశ్రమకు భూమిని సేకరిస్తున్నప్పుడు ఆ భూయజమానుల్లో మెజారిటీ ఆమోదాన్ని పొందాలనడం పైకి బాగానే కనిపిస్తున్నప్పటికీ, పరిశ్రమ ఏర్పాటయ్యే ప్రాంతంలోని ప్రజల్లో 80 శాతం ఆమోదం లభించాలి.
80 శాతం మంది సంసిద్దత వ్యక్తం చేస్తేనే సేకరణ చేపట్టాలంటే వాస్తవికంగా ఇది అంత సులువుగా వీలయ్యే పని కాదు. ఇది ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం ప్రాజెక్టుల్లో పాల్గొనే విషయంలో ప్రైవేటు భాగస్వాములకు నిరుత్సాహం కలిగిస్తుంది. అనుమతుల మంజూరు అత్యంత కష్ట సాధ్యం.


Click it and Unblock the Notifications