స్నాప్‌డీల్ కొనుగోలు వ్యవహారం కొలిక్కి వచ్చిందా?
స్నాప్‌డీల్ ఫ్లిప్‌కార్ట్‌లో విలీనం అయ్యేందుకు యోచిస్తోంది. ఈ ఒప్పందానికి సంబంధించి తుది దశ చర్చలు సాగుతుండగా ఆ రెండు సంస్థలు అదికారంగా స్పందించలేదు. రెండు సంస్థల విలీనం గురించి పలు ఆసక్తికర
అమెజాన్ నుంచి వచ్చే పోటీని ఎదుర్కొనేందుకు దేశీయ ఈ-కామర్స్ సంస్థలు విపరీతంగా శ్రమిస్తున్నాయి. అయినప్పటికీ అమెజాన్.కామ్ చేసే వ్యాపారంలో పోటీ పడే విషయంలో దూకుడుగా వెళ్లలేకపోయాయి. ఈ క్రమంలో టాప్-3 సంస్థల్లో ఒకటైన స్నాప్‌డీల్ ఫ్లిప్‌కార్ట్‌లో విలీనం అయ్యేందుకు యోచిస్తోంది. ఈ ఒప్పందానికి సంబంధించి తుది దశ చర్చలు సాగుతుండగా ఆ రెండు సంస్థలు అదికారంగా స్పందించలేదు. రెండు సంస్థల విలీనం గురించి పలు ఆసక్తికర విషయాలు మీ కోసం...

1. కొలిక్కి వచ్చిందట
ఎన్నో రోజులుగా ఇ-కామర్స్ వర్గాల్లో ఆసక్తి రేపుతోన్న స్నాప్‌డీల్, ఫ్లిప్‌కార్ట్ విలీన అంశం ఎట్టకేలకు కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. అనేక నెలల చర్చోపచర్చల మధ్య ఇ- కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ ఆఫర్‌కు స్నాప్‌డీల్ అంగీకారం తెలిపింది.

2. జాస్పర్ ఇన్ఫోటెక్ బోర్డు ఓకే
బహుళజాతి కంపెనీ అమెజాన్‌కు అతిపెద్ద పోటీనివ్వాలని దేశీయ ఈ-కామర్స్ సంస్థ ప్రధాన లక్ష్యంగా నిర్దేశించుకుంది. క్రితం వారం ఫ్లిప్‌కార్ట్ సవరించి ప్రతిపాదించిన 900 మిలియన్ డాలర్ల (రూ.5,792 కోట్లు) నుంచి 950 మిలియన్ డాలర్ల (రూ.6,114 కోట్లు) ఆఫర్‌కు స్నాప్‌డీల్ మాతృసంస్థ జాస్పర్ ఇన్ఫోటెక్ బోర్డు అంగీకరించినట్లు సంబంధిత వర్గాలు రాయిటర్స్‌కు తెలిపాయి.

3. స్నాప్‌డీల్ బ్రాండు పేరు కొనసాగే అవకాశం
ఇక ఈ ఒప్పందాన్ని స్నాప్‌డీల్ వాటాదారులు ఆమోదించాల్సి ఉంది. అనంతరం స్నాప్‌డీల్‌ను ఫ్లిప్‌కార్ట్ స్వాధీనం చేసుకోనుంది. కాగా ప్రాథమిక దశలో స్నాప్‌డీల్ బ్రాండు పేరును ఫ్లిప్‌కార్ట్ అలానే కొనసాగించనుంది. కాగా ఈ ఒప్పందంపై ఫ్లిప్‌కార్ట్, స్నాప్‌డీల్ కంపెనీలు అధికారికంగా ప్రకటన చేయలేదు.

4. ఆఫర్ విలువను పెంచిన తర్వాతే స్నాప్‌డీల్ సంసిద్దత
నిధుల కొరతతో ఇబ్బంది పడుతున్న స్నాప్‌డీల్‌ను కొనేందుకు ఫ్లిప్‌కార్ట్ ముందు 1 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.6450 కోట్ల) వరకూ ఇవ్వడానికి తొలుత సిద్దపడింది. కాగా స్నాప్‌డీల్ విలువ మదింపు ప్రక్రియ అనంతరం 800-850 మిలియన్ డాలర్ల దాకా (సుమారు రూ. 5,500 కోట్లు) ఇచ్చేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. అయితే స్నాప్‌డీల్ దీన్ని తిరస్కరించడంతో అనంతరం ఫ్లిప్‌కార్ట్ తన ఆఫర్ విలువను పెంచి 950 మిలియన్ డాలర్లకు చేర్చింది. దీంతో ఇరు సంస్థలు ఒక అంగీకారానికి వచ్చాయి.

5. బోర్డు సభ్యుల సమావేశాలు
విలీన ఒప్పందంపై సంతకాలు చేయడానికి స్నాప్‌డీల్, ఫ్లిప్‌కార్ట్ బోర్డు సభ్యులు ఈ వారంలోనే సమావేశం కాబోతున్నారని తెలుస్తోంది. మూడు దశల్లో ఒప్పందాన్ని పూర్తి చేయబోతు న్నారని సమాచారం. ఇందుకోసం ముందు స్నాప్‌డీల్, తన ఇన్వెస్టర్లు నెక్సస్, కలారీ క్యాపిటల్ నుంచి సాఫ్ట్‌బ్యాంకు వాటాను కొనుగోలు చేస్తుంది. అనంతరం ఆ క్యాపిటల్‌ను సాఫ్ట్‌బ్యాంకు ఫ్లిప్‌కార్ట్‌లో పెడుతోంది. తుది దశలో ఫ్లిప్‌కార్ట్, స్నాప్‌డీల్ విలీనం కాబోతున్నాయి.

6. ఒప్పంద ప్రక్రియ-గడువు
విక్రయ నిబంధనల పత్రంపై సంతకం చేసిన అనంతరం మూడు నెలల్లోపు ఈ ఒప్పంద ప్రక్రియను ముగించాలని ఆ కంపెనీలు భావిస్తున్నాయి. ఈ రెండింటి విలీన సంస్థలో సాఫ్ట్‌బ్యాంకు 20 శాతం వాటాను కలిగి ఉంటుంది. ప్రాథమిక దశలో స్నాప్‌డీల్ బ్రాండ్‌ను, వ్యాపారాలను ఫ్లిప్‌కార్ట్ యథాతథం గానే కొనసాగించనుంది. పరిస్థితులు, పరిణామాలను బట్టి స్నాప్‌డీల్ వ్యాపారాలను ఫ్లిప్‌కార్ట్ వేదికపైకి తీసుకురానున్నారని తెలుస్తోంది.

7. సాఫ్ట్‌బ్యాంక్ కీలకం
మరోవైపు స్నాప్‌డీల్‌కు చెందిన డిజిటల్ పేమెంట్స్ సంస్థ ఫ్రీఛార్జ్‌ను కూడా ఆ సంస్థ విక్రయించే ప్రక్రియలో ఉంది. దీని కొనుగోలుకు యాక్సిస్ బ్యాంకు ఆసక్తి చూపుతోందని తెలుస్తోంది. ఇందుకోసం 60 మిలియన్ డాలర్లు ఆఫర్ చేసినట్లు సమాచారం. ఫ్లిప్‌కార్ట్, స్నాప్‌డీల్ విక్రయ ఒప్పందంలో ముందు నుంచి కూడా సాఫ్ట్ బ్యాంకు కీలకంగా వ్యవహరించింది.


Click it and Unblock the Notifications