ఎలాంటి జీవిత బీమా పాలసీ తీసుకోవాలి?
కంపెనీలు అందించే పాలసీలు తాత్కాలిక రక్షణగా మాత్రమే నిలుస్తాయి. ప్రతి ఉద్యోగం చేసే వ్యక్తి, తనపై ఆధారపడదగిన వారుంటే జీవిత బీమా తీసుకుంటే మంచిది. జీవిత బీమాలో ఏ రకమైన పాలసీలు ఉంటే ఏ విధంగా
ఇప్పుడున్న జీవన శైలికి ఎప్పుడు ఏ రోగమొస్తుందో, ఎప్పుడు ఏం జరిగినా కుటుంబానికి ఎలాంటి ఇబ్బందులు వస్తాయో చెప్పడం కష్టం. అందుకే కంపెనీలు తమ ఉద్యోగులకు కనీసం గ్రూప్ ఆరోగ్య బీమా పాలసీ లేదా టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీలను అందిస్తున్నాయి. అయితే కంపెనీలు అందించే పాలసీలు తాత్కాలిక రక్షణగా మాత్రమే నిలుస్తాయి. ప్రతి ఉద్యోగం చేసే వ్యక్తి, తనపై ఆధారపడదగిన వారుంటే జీవిత బీమా తీసుకుంటే మంచిది. జీవిత బీమాలో ఏ రకమైన పాలసీలు ఉంటే ఏ విధంగా పనికొస్తాయో, ఎవరు ఎలాంటి పాలసీ తీసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం.

టర్మ్ ఇన్సూరెన్స్
టర్మ్ ఇన్సూరెన్స్‌ను ఒక జీవిత కాలంలో నిర్ణీత కాలపరిమితికి తీసుకోవచ్చు. ఆ సమయంలో కలిగే శాశ్వత వైకల్యానికి, అకస్మాత్తు మరణానికి ఈ పాలసీ రక్షణ కల్పిస్తుంది. నామినీలకు లేదా ఆధారపడ్డవారికి ఈ ప్రయోజనాలు చెల్లిస్తారు.
అయితే పాలసీదారు పాలసీ టర్మ్ మొత్తం జీవించి ఉన్నట్లయితే ఎటువంటి ప్రయోజనం చెల్లించరు.

హోల్ లైఫ్ ఇన్సూరెన్స్
టర్మ్ పాలసీలా కాకుండా మొత్తం జీవిత కాలానికి రక్షణ కల్పించేదే హోల్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ. పాలసీ దారు లేనప్పుడు కుటుంబానికి ఆర్థిక రక్షణ కల్పించడంలో ఈ పాలసీ కచ్చితమైన భరోసానిస్తుంది. మీ వారసులకు, తర్వాతి తరం వారికి ఒక మంచి ఆర్థిక రక్షణగా ఈ పాలసీ ఉపయోగపడుతుందనడంలో సందేహం లేదు.

ఎండోమెంట్ పాలసీ
పొదుపు, బీమా రక్షణ కలగలిసిన బీమా పాలసీయే ఎండోమెంట్ పాలసీ. పాలసీదారుకు శాశ్వత వైకల్యం లేదా మరణం సంభవిస్తే బీమా హామీ మొత్తాన్ని లబ్దిదారులకు చెల్లిస్తారు.
మొత్తం పాలసీ కాలం పాలసీదారు జీవిస్తే పాలసీ మెచ్యూరిటీ ప్రయోజనాలను చివర్లో చెల్లిస్తారు.

మనీ బ్యాక్ లేదా క్యాష్ బ్యాక్ ప్లాన్లు
నిర్ణీత కాలవ్యవధుల్లో సర్వైవల్ బెనిఫిట్స్‌ను చెల్లించడం మనీ బ్యాక్ పాలసీ ఉద్దేశం. ఉదాహరణకు పాలసీ కాలపరిమితి 20 ఏళ్లు ఉంటే ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి కొంత మొత్తాన్ని పాలసీదారుకు చెల్లిస్తారు. సర్వైవల్ బెనిఫిట్స్ కాకుండా జీవితానికి సంపూర్ణంగా బీమా హామీ మొత్తంతో రక్షణ ఉంటుంది. ఒకవేళ పాలసీదారకు అనుకోకుండా ఏమైనా జరిగినా బీమా హామీ మొత్తం వల్ల కుటుంబ ఆర్థిక ఇబ్బందులు తగ్గే వీలుంది.

పిల్లల పాలసీలు
ప్రస్తుతం జీవితం ఎక్కువ అనిశ్చితో కూడుకున్నది. తల్లిదండ్రులకు అకాల మరణం ప్రాప్తిస్తే పిల్లల జీవితానికి భరోసా ఉండాలని పిల్లల పాలసీలను రూపొందించారు. మీరు సంపాదించే దశలో ఆర్థికంగా ఎంత బాగా ఉన్నప్పటికీ అదే స్థాయి జీవన శైలిని పిల్లలు కొనసాగించాలంటే వారికి ఒక ఆర్థిక రక్షణ అవసరం. జీవితంలోని వివిధ దశల్లో పిల్లలకు సంబంధించిన ఖర్చులు వేర్వేరుగా ఉంటాయి. బీమా కంపెనీలు అందించే అలాంటి మంచి పాలసీల్లో ఒకటి ఎంచుకుని పిల్లల ఆర్థిక భవిష్యత్తుకు బాటలు వేయాలి.

యాన్యుటీ ప్లాన్లు
ఒక వయసు వరకూ ఉద్యోగం చేసి పదవీ విరమణ చేసేవారికి ఆ తర్వాతి నుంచి నెలవారీ వేతన ఆదాయం ఉండదు. అంటే ఒక్కోసారి క్రమమైన ఆదాయం ఉండదు. కానీ నెలవారీ ఖర్చులు మాత్రం తప్పవు. పీఎఫ్, గ్రాట్యుటీ లాంటి వాటివి మాత్రం పెద్ద మొత్తంలో అందే వీలుంది. పదవీ విరమణ తర్వాతి రోజుల్లో ఇంతకుముందు మాదిరి క్రమమైన ఆదాయం అందుకోవడం అందరికీ వీలు కాదు. అలాంటి వారి కోసమే బీమా సంస్థలు అందించే ఒకరకమైన పాలసీలు యాన్యుటీలు. వీటి ద్వారా నెలవారీ ఆదాయాన్ని పొందే విధంగా సౌలభ్యం ఉంటుంది.


Click it and Unblock the Notifications