జీఎస్టీ పన్ను రేట్లను మార్చిన ఆర్థిక మంత్రి
మొత్తం 133 వస్తువులకు సంబంధించి పన్ను రేట్లను మార్చాల్సిందిగా కోరగా అందులో 66 వస్తువులకు సంబంధించి అరుణ్ జైట్లీ ఆదివారం నిర్ణయం తీసుకున్నారు. మారిన పన్ను రేట్ల విషయాలు ఇలా ఉన్నాయి.
జీఎస్టీ పన్ను అమలు గడువు సమీపిస్తున్న నేపథ్యంలో కేంద్రం అన్ని రకాల చర్యలకు సిద్దమవుతోంది. జీఎస్టీ పన్ను రేట్లు మార్చాల్సిందిగా వస్తున్న విజ్ఞప్తులను స్వీకరించిన కేంద్రం తగు విధంగా స్పందిస్తోంది. మొత్తం 133 వస్తువులకు సంబంధించి పన్ను రేట్లను మార్చాల్సిందిగా కోరగా అందులో 66 వస్తువులకు సంబంధించి అరుణ్ జైట్లీ ఆదివారం నిర్ణయం తీసుకున్నారు. మారిన పన్ను రేట్ల విషయాలు ఇలా ఉన్నాయి.

ప్యాకేజ్‌డ్ ఫుడ్స్ జీఎస్టీ 18 నుంచి 12 శాతానికి
జీడిపప్పు, అగరబత్తి, ఇన్సులిన్ వంటి ఉత్పత్తులపై పన్ను రేట్లను 12 శాతం నుంచి 5 శాతానికి తగ్గించారు. ప్యాకేజ్‌డ్ ఫుడ్స్(పండ్లు, కూరగాయలు, ఊరగాయలు) విషయంలో పన్ను రేట్లను 18 శాతం నుంచి 12 శాతానికి మార్చారు. అదే విధంగా పిల్లల ఎక్సర్‌సైజ్ బుక్స్ మీద సైతం పన్ను రేటును 12శాతంగానే నిర్ణయించారు.

28 నుంచి 18 శాతానికి
ప్లాస్టిక్ టార్పాలిన్, స్కూల్ బ్యాగులు, ప్రీ-క్యాస్ట్ కాంక్రీట్ పైపులు, ట్రాక్టరుకు సంబంధించిన పరికరాలు, కంప్యూటర్ ప్రింటర్లు, బాల్ బేరింగులు వంటి వాటిపై జీఎస్‌టీని 28 నుంచి 18 శాతానికి తగ్గించారు.

సినిమా టిక్కెట్ల విషయంలో
జీఎస్టీ చర్చ మొదటి నుంచి మూవీ ఇండస్ట్రీ, థియేటర్ల యాజమాన్యాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఎక్కువ పన్ను వల్ల సినీ పరిశ్రమకు కలిగే ఇబ్బందిని గురించి చెబుతున్నాయి. అయితే ప్రభుత్వం దీనిపై మనసు మార్చుకుంది. రూ.100 కంటే ఎక్కువ విలువ ఉండే టిక్కెట్లపై జీఎస్‌టీని 28% వద్దే ఉంచుతూ, రూ.100 లోపు విలువ కలిగిన టిక్కెట్లపై మాత్రం జీఎస్టీని 18 శాతానికి మార్చారు.

జీఎస్టీ పన్ను పరిధిలో లేనివి
ప్రభుత్వం ఇదివరకే కనీస అవసరాలైన వస్తువులను జీఎస్టీ పన్ను లేకుండా చేసింది.
కొన్ని ఆహార పదార్థాలు, గోదుమ పిండి, పప్పు దినుసులు, తృణ ధాన్యాలు, మైదా, శెనగ పిండి, పాలు, కూరగాయలు, తాజా పండ్లు, ఉడికించిన బియ్యం, సాధారణ ఉప్పు, పశువుల దాణా, సేంద్రీయ ఆహార పదార్థాలు, ముడి సిల్క్, ముడి ఉన్ని, జనపనార వస్తువులు చేతివృత్తుల ద్వారా తయారవుతున్న వ్యవసాయ సామాగ్రి వంటి వాటిని పన్ను లేకుండా చేశారు.


Click it and Unblock the Notifications