జర్వ్ బ్యాంక్ గవర్నర్ మారడం, బ్రెగ్జిట్, రూపాయి విలువ దారుణంగా క్షీణించడం, చమురు ధరల పతనానికి తాత్కాలిక బ్రేక్ పడటం, జియో రాక, అమెరికా వడ్డీ రేట్లు పెంచడం, రూ.500, రూ.1000 నోట్లను మా
ఈ ఏడాది నవంబరులో పెద్ద నోట్ల మార్పిడికి సంబంధించి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సంచలనాలకు తావిచ్చింది. దీంతో ఆర్థిక వ్యవస్థపై ఒక మోస్తరు ప్రభావమే పడింది. నగదు కొరత ప్రభావం ఇప్పటికీ దేశమంతా కనిపిస్తోంది. స్థూల దేశీయ ఉత్పత్తుల విలువ 6.9%, 2015లో ఉన్న జీడీపీ 7.2 శాతంతో మొదలుకొని, 206 మధ్యలోకి వచ్చే సరికి స్థూల దేశీయోత్పత్తి 7.9శాతానికి పెరిగింది. స్థూల దేశీయోత్పత్తుల విలువ 7.4%కి పెరిగింది. రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ మారడం, బ్రెగ్జిట్, రూపాయి విలువ దారుణంగా క్షీణించడం, చమురు ధరల పతనానికి తాత్కాలిక బ్రేక్ పడటం, జియో రాక, అమెరికా వడ్డీ రేట్లు పెంచడం, రూ.500, రూ.1000 నోట్లను మార్చడం, విజయ్ మాల్యా దేశం విడిచిపారిపోవడం, డొనాల్డ్ ట్రంప్ ఎన్నిక, టాటా గ్రూపు సీఈవో పదవి నుంచి మిస్త్రీ తొలగింపు, ఎన్ఎస్ఈ సీఈవో పదవి నుంచి చిత్రా రామకృష్ణ వైదొలగడం వంటి ఘటనలు ఈ ఏడాది కాలంలో చోటు చేసుకున్నాయి. కొన్ని ఆర్థిక వ్యవస్థ మంచికి జరిగితే మరికొన్ని ప్రతికూల ప్రభావాన్ని చూపాయి. ఆర్‌బీఐ పనితీరును గాఢంగా ప్రభావితం చేసిన రఘురామ్ రాజన్‌కు రెండో విడత గవర్నర్‌గా అవకాశం ఇవ్వకపోవడం కూడా ఈ ఏడాది విశేషాల్లో ప్రముఖంగా గుర్తుండిపోగలదు. అలాంటి కొన్ని సంఘటనలను మననం చేసుకుందాం.

రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ పదవి నుంచి వైదొలగిన రాజన్
దేశ కేంద్ర బ్యాంకు గవర్నర్ పదవిలో తన వంతు బాధ్యతలు నిర్వర్తించి విమర్శకుల ప్రసంశలు అందుకున్న రాజన్, తన పూర్వాశ్రమంలో ఇష్టమైన వృత్తి అయినటువంటి బోధనా రంగానికే వెళ్లేందుకు నిశ్చయించుకున్నారు. ముక్కుసూటిగా వెళ్లడమే ఆయన నైజం. విమర్శలెన్ని వచ్చినా ఆయన చేయాలనుకున్న దాన్ని అమలుపరచడమే ఆయన ఇజం. మానిటరీ పాలసీకి సంబంధించి ఆర్బీఐ గవర్నర్ ఒక్కరి మీదే వడ్డీ రేట్ల నిర్ణయం భారం కాకుండా ఒక సమిష్టి నిర్ణయమే మేలని కుండబద్దలుకొట్టారు. ఇది రిజర్వ్ బ్యాంక్ స్వయం ప్రతిపత్తిని దెబ్బతీస్తుందని పలువురు ఆర్థిక వేత్తలు, ఆర్బీఐ మాజీ గవర్నర్లు వ్యాఖ్యానించినా వాటిపై ఆయన స్పందించలేదు. కమిటీ ఉండటమే మేలని ప్రభుత్వానికి ఒత్తాసు పలికారు. మొండి బకాయిలపై దీటైన కార్యచరణను ప్రకటించిన క్రమంలో బ్యాంకింగ్ రంగాన్ని సరైన గాడిలో పెడతాడని అందరూ ఆశిస్తున్న తరుణంలో మూడు నెలల ముందే తిరిగి ఆర్‌బీఐ గవర్నర్ పదవిని చేపట్టబోనని సంచలన ప్రకటన చేశారు. ద్రవ్యోల్బణాన్ని అదుపులో పెట్టేందుకే ఆయన పదవీ కాలంలో అత్యధిక ప్రాధాన్యతనిచ్చారు. విదేశీ మారక నిల్వలను స్థిరంగా ఉంచుతూ అవసరమైన సమయంలో ఎక్కువ చేయడంలోనూ కీలక పాత్ర వహించారు. దీంతో రూపాయి విలువ మరింత పడిపోకుండా చాలా కాలం నిలువరించేందుకు తనవైన ప్రయత్నాలన్నీ చేశారు.

విజయ్ మాల్యా వ్యవహారం
ప్రభుత్వరంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్‌బిఐ నేతృత్వంలోని 17 బ్యాంకుల కూటమికి మాల్యా సారథ్యంలోని కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ 9,000 కోట్ల రూపాయలకుపైగా బకాయిపడింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఐడిబిఐ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, అలహాబాద్ బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ తదితర ప్రభుత్వ, ప్రైవేట్‌రంగ బ్యాంకుల నుంచి కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ 6,000 కోట్ల రూపాయల రుణాలను తీసుకోగా, ఏళ్లు గడిచిపోవడంతో దానిపై వడ్డీలు, జరిమానాలతో ప్రస్తుతం ఆ మొత్తం విలువ 9,000 కోట్ల రూపాయలను దాటిపోయంది. ఈ నేపథ్యంలో మొండి బకాయిలను చెల్లించాలని మాల్యాపై బ్యాంకర్లు ఒత్తిడి తీసుకురాగా, మార్చి 3న మాల్యా దేశం విడిచి పారిపోయాడు. ఈ క్రమంలో ఆయన్ను ఉద్దేశపూర్వక రుణ ఎగవేతదారుగా కూడా పలు బ్యాంకులు ప్రకటించాయి. ఈ సంవత్సరం దేశీయ బ్యాంకింగ్ రంగాన్ని లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా వ్యవహారం కుదిపేసింది. ఈ వ్యవహారం కోర్టుల్లోకీ చేరగా, బకాయిల వసూళ్లలో భాగంగా మాల్యా స్థిర, చరాస్తుల అమ్మకానికి బ్యాంకులు దిగుతున్నాయి. అయతే మాల్యా ఇండ్లు, కార్లు, వ్యక్తిగత విమానం ఇలా అన్నింటినీ బ్యాంకులు, ఆదాయ, వాణిజ్య, సేవా పన్ను శాఖలు వేలం వేస్తున్నప్పటికీ స్పందన కొరవడింది. మాల్యా కేసును సిబిఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డిపార్ట్‌మెంట్లూ దర్యాప్తు చేస్తుండగా, స్వదేశానికి తీసుకురావాలనే ప్రయత్నాలు ఫలించడం లేదు. మాల్యా వ్యవహారాన్ని కేంద్రం తీవ్రంగానే పరిగణించింది. బ్యాంకుల మొండి బకాయిల సమస్యనూ పరిష్కరించేందుకు నడుం బిగించింది. మొత్తానికి ఈ ఏడాది మాల్యా వ్యవహారం వ్యాపార, పారిశ్రామిక రంగాలనూ ప్రభావితం చేసింది.

తరలిన విదేశీ పెట్టుబడులు
ఈ ఏడాది భారతీయ మార్కెట్ల నుంచి విదేశీ మదుపరులు తమ పెట్టుబడులను గణనీయంగా వెనక్కి తీసుకున్నారు. గత సంవత్సరం దాదాపు 70 వేల కోట్ల రూపాయల వరకు పెట్టుబడులను పెట్టిన విదేశీ పోర్ట్ఫోలియో, సంస్థాగత మదుపరులు (ఎఫ్‌పిఐ-ఎఫ్‌ఐఐ).. ప్రస్తుత సంవత్సరం మాత్రం సుమారు 20 వేల కోట్ల రూపాయల వరకు ఉపసంహరించుకున్నారు. ఈ ఏడాది జనవరి-జూన్‌లో స్టాక్ మార్కెట్లలోకి రూ. 20 వేల కోట్లకు పైగా పెట్టుబడులను తెచ్చిన ఎఫ్‌పిఐలు.. రుణ మార్కెట్ల నుంచి రూ. 12 వేల కోట్లకుపైగా పెట్టుబడులను లాగేసుకున్నారు. అయతే జూలై- సెప్టెంబర్ వ్యవధిలో భారతీయ మార్కెట్ల లోకి 46,000 కోట్ల రూపాయల పెట్టుబడులు తెచ్చిన విదేశీ మదుపరులు.. అక్టోబర్-డిసెంబర్‌లో మాత్రం 72,000 కోట్ల రూపాయల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. మొత్తంగా ఈ సంవత్సరం స్టాక్ మార్కెట్లలోకి వచ్చిన విదేశీ పెట్టుబడుల విలువ 25,000 కోట్ల రూపాయలుగా ఉంటే, రుణ మార్కెట్ల నుంచి పోయన పెట్టుబడుల విలువ రూ. 43,000 కోట్లుగా నమోదైంది. దీంతో దేశీయ మార్కెట్ల నుంచి రూ. 18 వేల కోట్ల విదేశీ పెట్టుబడులు తరలిపోయినట్లైంది. 2014లో దేశంలోకి వచ్చిన విదేశీ పెట్టుబడుల విలువ రెండున్నర లక్షల కోట్ల రూపాయలైతే, 2015లో 67,000 కోట్ల రూపాయలకు పడిపోయాయి. ఇక 2016లో 18,000 కోట్ల రూపాయలు భారతీయ మార్కెట్ల నుంచే విదేశీ మదుపరులు తీసుకెళ్లడం గమనార్హం. ఫలితంగా విదేశీ మదుపరుల్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై ఉన్న ప్రగాఢ విశ్వాసం సన్నగిల్లుతున్నట్లు స్పష్టమవుతోంది. ఈ ఏడాది పాత పెద్ద నోట్ల రద్దు, బ్రెగ్జిట్, అమెరికా అధ్యక్ష ఎన్నికలు వంటివి ప్రధానంగా విదేశీ పెట్టుబడులను ప్రభావితం చేశాయి.

టాటా గ్రూప్ సీఈవోగా మిస్త్రీ తొలగింపు
దేశంలో బిజినెస్ అంటే గుర్తొచ్చే ప్రముఖ కార్పొరేట్ సంస్థలు టాటా, బిర్లా, బజాజ్, మారుతి, రిలయన్స్, అదానీలు. అంతర్జాతీయంగా అత్యంత ప్రతిష్టాకరమైన టాటా గ్రూప్ అంతర్గత కుమ్ములాటలతో మీడియాలోకి ఎక్కడం ఈ ఏడాది విశేషాల్లో మరొకటి. రతన్ టాటా, సైరస్ మిస్త్రీ మధ్య మాటల యుద్ధం తరచూ వార్తల్లో ఉంటూ వచ్చింది. కొత్త సంవత్సరంలోనూ ఈ కార్పొరేట్ అంతర్గత పోరుకు కొనసాగింపు ఉంటుంది. సీఈవో తొలగింపు తర్వాత మిస్త్రీ మద్దతు వర్గం, టాటాల మధ్య లేఖల ఆరోపణలు కాకుండా మాటల తూటాలు పేలుతూనే ఉన్నాయి. మరోవైపు ఇటీవల ఊహించని విధంగా రతన్ టాటా ఆరెస్సెస్ ఛీప్ మోహన్ భగవత్‌ను కలవడం మరో విధంగా అందరిలో ఆసక్తిని రేపుతోంది. ఏది ఏమైనప్పటికీ ఉన్నపళంగా మిస్త్రీని పదవి నుంచి తొలగించి వరుసగా బోర్డు సమావేశాలను ఏర్పరిచి గ్రూపు సంస్థల్లో ఆయన్ను ఏకాకిని చేయడం కార్పొరేట్ వర్గాల్లో పెను సంచలనమైంది.

రిలయన్స్ జియో
ఈ ఏడాది టెలికాం రంగంలో జరిగిన అద్భుతంగా జియో రాకను చెప్పుకోవాలి. ఉచిత డేటా ఆఫర్‌తో పాటు వాయిస్ కాల్స్‌కు ఎలాంటి రుసుములు లేకుండా చేయడం ఇక్కడ ప్రకంపనలు సృష్టించేలా చేసింది. స్వల్పకాలంలోనే కస్టమర్ల విషయంలో 5 కోట్ల మైలు రాయిని దాటేసింది. ఇప్పటికీ కొత్త వినియోగదారులు జమవుతూనే ఉన్నారు. మొదట సెప్టెంబరు 5న వాణిజ్య కార్యకలాపాలను మొదలెట్టిన జియో డిసెంబరు 31 వరకూ ఉచితంగా సేవలందించనున్నట్లు ప్రకటించింది. ఒకపక్క స్మార్ట్‌ఫోన్ల విస్తృతి జరుగుతుండటం, మరో వైపు డిజిటల్ లావాదేవీల పెంపుకు ప్రభుత్వ యత్నాలు, 4జీ దిశగా వేగంగా టెలికాం రంగం అడుగులు వేస్తుండటం వీటన్నింటి నేపథ్యంలో రిలయన్స్ జియో రాక ప్రాధాన్యం సంతరించుకుంది. జియో ప్రవేశంతో ప్రత్యర్థి సంస్థలన్నీ నాణ్యత విషయంలో కాస్త ఆసక్తి చూపుతున్నట్లు కనిపిస్తోంది. ఈ మధ్యే మార్చి 31 వరకూ ఏ విధంగా సేవలు పొడిగించడానికి ముందుకెళుతున్నారో వివరణ ఇవ్వాల్సిందిగా ట్రాయ్ రిలయన్స్ జియోను ఆదేశించిన సంగతి తెలిసిందే.

2017లో జీఎస్‌టీ అమలయ్యేనా?
ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న వస్తు సేవల పన్నుకు (జీఎస్‌టీ) ఆగస్ట్ 8న మోక్షం లభించింది. వివిధ రకాల రాష్ట్రాల పన్నులు, కేంద్రం పన్నుల స్థానంలో జీఎస్టీ అమల్లోకి రావడం ద్వారా యావత్‌దేశం ఒకే మార్కెట్‌గా అవతరించనుంది. 2017లో ఇది అమల్లోకి రావచ్చని భావిస్తున్నా... నోట్ల రద్దు నేపథ్యంలో ఇది మరింత డోలాయమానంలో పడింది. జీఎస్‌టీ కౌన్సిల్‌లో రాష్ట్రాల మధ్య సమన్వయం కోసం ఏర్పాటు చేస్తున్న సమావేశాల్లో కీలక అంశాలపై ఏకాభిప్రాయం కుదిరినా ఇంకా చిన్న చిన్న అంశాలపై కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు పేచి పెడుతూనే ఉండటం స్వల్ప ఆందోళనలకు తావిస్తోంది. జీఎస్‌టీ అమలు తర్వాత మొదటి రెండేళ్లు ప్రతికూల ప్రభావం ఉంటుందన్న ఆర్థిక వేత్తల అంచనాల నేపథ్యంలో వచ్చే సంవత్సరం ప్రభుత్వం కచ్చితంగా జీఎస్‌టీ అమలు దిశగా ముందుకు కదులుతుందో లేదో వేచి చూడాలి.

వృద్ది రేటుకేమైంది?
ప్రపంచంలోనే వేగంగా వృద్ది కలిగిన జీడీపీ భారత్ సొంతం. వృద్ధిరేటులో ప్రస్తుతానికి మనదేశానికి ఏదీ సాటిలేదు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు దిక్సూచి భారత్.. గతేడాది దేశ ఆర్థిక వ్యవస్థపై వినిపించిన అభిప్రాయాలివి. భారత జీడీపీ అంచనాలకు విరుద్దంగా తగ్గుముఖం పడుతోంది. పారిశ్రామిక వ్యవస్థలో మందగమనం కనిపిస్తోంది. వృద్ధిరేటు నెమ్మదించింది.. ఇవి ఈ సంవత్సరం వ్యక్తమైన అభిప్రాయాలు. దీనికి కారణం అంతర్జాతీయ పరిణామాలు కావు. అమెరికా, ఐరోపా ఆర్థిక వ్యవస్థల సంక్షోభం అంతకన్నా కాదు. నవంబరు 8న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రకటించిన నోట్ల రద్దు నిర్ణయం. అవును.. నవంబర్ 8న తీసుకున్న పాత పెద్ద నోట్ల రద్దు నిర్ణయం 2016-17 జిడిపి వృద్ధిరేటు అంచనాలనే తారుమారు చేసింది. నల్లధనం, నకిలీ కరెన్సీల నిర్మూలన కోసం రూ. 500, 1,000 రూపాయల నోట్ల రద్దుతో ప్రభుత్వ ఆశయం ఏమాత్రం నెరవేరుతుందో తెలియదుకానీ, దేశ ఆర్థిక వ్యవస్థ మాత్రం కుదేలైంది. ప్రపంచంలో పెరెన్నికగల ఆర్థికవేత్తల అభిప్రాయమిదే. బ్యాంక్ ఆఫ్ అమెరికా, నొమురా, మోర్గాన్ స్టాన్లీ, ఫిచ్, క్రిసిల్ తదితర అగ్రశ్రేణి రేటింగ్ ఏజెన్సీలు భారత జీడీపీ వృద్ధి అంచనాలను నోట్ల రద్దు తర్వాత ఒక్కసారిగా తగ్గించాయి మరి. ఫోర్బ్స్ లాంటి ప్రముఖ మ్యాగజైన్లు నోట్ల రద్దును ప్రతికూల ధోరణితోనే విశ్లేషించాయి. అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీలే కాదు.. సాక్షాత్తూ కేంద్ర ప్రభుత్వ వర్గాలూ ఇదే రకంగా అనుకుంటున్నట్లు అంతర్గతంగా తెలుస్తోంది. నోట్ల రద్దు కారణంగా నెలకొన్న విపత్కర పరిస్థితులు దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపుతున్నాయి. చాలా రంగాలు, పలు రకాల వ్యాపారాల్లో లావాదేవీలు చెప్పుకోదగ్గ విధంగా పడిపోయాయి. ముఖ్యంగా బ్యాంకింగ్ లావాదేవీలు గణనీయంగా దిగజారాయి. కేవలం పాత నోట్ల డిపాజిట్లు, కొత్త నోట్ల సరఫరాకే పరిమితం కావడంతో పారిశ్రామిక రంగాలకు ఆర్థిక చేయూత కరువైంది. ఉత్పాదక సామర్థ్యం క్షీణించగా, మార్కెట్‌లో కొనుగోళ్లూ తగ్గిపోయాయి. నోట్ల రద్దు జరిగి 2 నెలలు కావస్తున్నా దాని ప్రభావం ఇంకా తగ్గలేదు. వచ్చే మార్చి వరకూ పరిస్థితులు ఇలానే ఉండొచ్చన్న అభిప్రాయాలు గట్టిగా వినిపిస్తుండటం దేశ జిడిపి వృద్ధిరేటుకు అవరోధంగా మారింది.

కరెంటు ఖాతా లోటు
గత రెండేళ్లలో కరెంటు ఖాతా లోటు బాగా తగ్గడం దేశ ఆర్థికానికి లాభించే విషయం. సెప్టెంబరు, 2014లో 10.9 బిలియన్ డాలర్లుగా ఉన్న కరెంటు ఖాతా లోటు సెప్టెంబరు 2016 నాటికి3.4 బిలియన్ డాలర్లకు తగ్గింది. మార్చి, జూన్ త్రైమాసికాల్లో కరెంటు ఖాతా లోటు రెండేళ్ల కనిష్టానికి పడిపోవడం మార్కెట్ వర్గాలకు సంతోషాన్ని కలిగించింది. వచ్చే కొద్ది నెలల పాటు ఇది ఇలానే కొనసాగుతుందని అంచనాలు ఉన్నాయి. ఎగుమతులు మళ్లీ మామూలు స్థితికి వస్తుండటం, వృద్ది ఆశాజనకంగా ఉండటం, దిగుమతులు స్వల్పంగా తగ్గడం వంటి కారణాల నేపథ్యంలో సమీప భవిష్యత్తులో కరెంటు ఖాతా లోటు తక్కువగానే ఉండగలదని ఆర్థిక వేత్తల అభిప్రాయం.

రూపాయి విలువ తగ్గుతోందా?
2016లో రూపాయి మారకపు విలువ డాలర్‌తో పోలిస్తే 2.5 శాతం క్షీణించింది. ఏడాది ప్రారంభం నుంచి రూపాయి ఒడిదుడుకుల్లో కొనసాగుతోంది. ముఖ్యంగా అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రారంభం నుంచి రూపాయి ఒత్తిళ్లను ఎదుర్కొంది. ఫలితాల అనంతరం ట్రంప్ గెలిచాక 68.90 స్థాయికి రూపాయి పడిపోవడం దేశీయ మదుపర్లను ఆందోళనలకు గురిచేసింది. దేశీయ మార్కెట్ల నుంచి విదేశీ మదపర్లు పెట్టుబడులను వెనక్కి తీసుకెళ్లడం కూడా రూపాయిని కలవరానికి గురిచేసింది. ప్రస్తుతం రూపాయి మారకం విలువ 67.92 దరిదాపుల్లో ఉంది.

తగ్గి మళ్లీ పెరిగిన ముడి చమురు
ఏడాది ఆరంభం నుంచి కొంత కాలం పాటు తక్కువ స్థాయిల్లోనే ఉన్న ముడి చమురు చివరకొచ్చే సరికి బాగా పెరిగింది. అయినప్పటికీ 2016లో ముడిచమురు భారీ రాబడులన్ని అందించింది. బంగారం లాగా ముడిచమురు సైతం మూడేళ్ల వరుస పతనాలను చవిచూస్తు వచ్చింది. 2016 జనవరి నెలలో 14 ఏళ్ల కనిష్ట స్థాయికి వెళ్లింది. ఉత్పత్తి పెరుగుదలతో ధరలు క్షీణిస్తుండటంతో ఉత్పత్తిని తగ్గించేందుకు ఒపెక్, ఓపెక్‌యేతర దేశాలు ఒకతాటిపైకి వచ్చాయి. ఉత్పత్తి కోతపై సమిష్టి నిర్ణయానికి రావడం గత 8 సంవత్సరాల్లో ఇదే తొలిసారి. ఈ పరిణామం తర్వాత ముడి చమురు నెమ్మదిగా కోలుకోవడం మొదలైంది. క్రూడ్ ధర వివిధ పరిణామాల నేపథ్యంలో రెండింతలై దాదాపు 57 డాలర్ల పటిష్ట స్థాయిని చేరింది. డిసెంబరు 30వ తేదీన ముడి చమురు ధర 56.68 డాలర్ల వద్ద ఉంది. వచ్చే ఏడాది చమురు ధరలు మరింత పెరగొచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!



Click it and Unblock the Notifications