పెద్ద నోట్ల రద్దు తర్వాత వ్యాలెట్లకు బాగా డిమాండ్ పెరిగింది.ఈ కోవలోనే మర్చంట్లతో ఒప్పందాలు కుదుర్చుకోవడం ద్వారా దేశం నలుమూలలకు విస్తరిస్తుంది.ఈ మొబైల్ వ్యాలెట్లలో పాపులర్ అయిన పేటీఎమ్
డిజిటల్ చెల్లింపులు, ఈ-కామర్స్ సంస్థ పేటీఎమ్‌కు అనుకోని చిక్కులు వచ్చి పడ్డాయి. ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన పేపాల్ విజయ్ శేఖర్ శర్మ నేతృత్వంలోని పేటీఎమ్ సంస్థపై లోగో, ట్రేడ్‌మార్క్ కాపీ కొట్టారనే ఆరోపణలు చేస్తోంది. నోయిడా నుంచి పనిచేస్తున్న పేటీఎం కంపెనీ గత జులైలో కొత్త ట్రేడ్‌మార్క్‌ను నమోదు చేయించింది. అంతేకాకుండా మార్కెట్లో ప్రకటనలు కూడా ఇస్తోంది. పేటీఎం కొత్త ట్రేడ్‌మార్క్‌ను తెచ్చినప్పటి నుంచి పేపాల్ అభ్యంతరం వ్యక్తం చేస్తూనే ఉంది. ఈ క్రమంలో ఇటీవల భారత్‌లోని ట్రేడ్‌మార్క్ కార్యాలయంలో పేటీఎమ్‌పై కేసు వేయడంతో ఈ విషయం చర్చనీయాంశమైంది. ఈ క్రమంలో ఈ రెండు సంస్థల మధ్య ట్రేడ్‌మార్క్‌కు సంబంధించిన గొడవేంటో చూద్దాం.

రంగులు, లోగో ఒకేలా ఉన్నాయి
పేటీఎం ట్రేడ్‌మార్క్ ఇంచుమించుగా తమ ట్రేడ్‌మార్క్‌ను పోలి ఉందని పేపాల్ ఆరోపిస్తోంది. ఈ రెండు సంస్థల ట్రేడ్‌మార్క్ (లోగో)లోనూ మొదటి మూడు అక్షరాలు ముదురు నీలిరంగులోను, తరవాత అక్షరాలు లేత నీలిరంగులో ఉంటాయి. మరోవైపు రెండు సంస్థల పేర్లు ‘PAY'తోనే మొదలవుతాయి. దీని వల్ల తమ వినియోగదారులు గందరగోళానికి గురవుతున్నారని పేపాల్ ఆరోపిస్తోంది.

2007 నుంచి వాడుతున్నాం
కాలిఫోర్నియాకు చెందిన పే పాల్ ట్రేడ్ మార్క్ ఉల్లంఘనల కింద పేటీఎమ్‌పై కేసు నమోదు చేసింది. సుమారు14 పేజీల పత్రంలో పేటీఎంపై ఫిర్యాదు చేసింది. 1999 ఇండియన్ ట్రేడ్ మార్క్ చట్టం అయిదు రకాల లోగోలను రిజిస్టర్ చేసినట్టు తెలిపింది. వీటిల్లో ఏదో ఒకటి వాడుకునే హక్కు తమకు ఉందని వాదిస్తోంది. 2007 నుంచి తాము దీన్ని వాడుతున్నట్టు పేర్కింది. తమ లోగోను అక్రమంగా వాడుకోవడం ద్వారా తమ ఖాతాదారుల్లో, ప్రజల్లో అయోమయం సృష్టిస్తోందని అమెరికన్ పేమెంట్ చెల్లింపుల సంస్థ ఆరోపించింది.

ట్రేడ్‌మార్క్ దరఖాస్తు తిరస్కరణ
ఈ గందరగోళం, మోసంకారణంగా తమ బ్రాండ్ ఈక్విటీ తగ్గిపోయే అవకాశ ఉందని పేపాల్ ఆందోళన వ్యక్తం చేసింది. అలాగే ఈ ఏడాది ఆగస్టులో వన్ 97 పేరుతో దాఖలైన పేటీఎం ట్రేడ్మార్క్ దరఖాస్తును వ్యతిరేకిస్తున్నట్టు తెలిపింది. రిజిస్టర్ ఆఫ్ ట్రేడ్‌మార్క్స్ దగ్గర నవంబర్ 18న పేపాల్ తన అభ్యంతరాలను వ్యక్తం చేసింది.

100 కోట్ల కస్టమర్లు
పెద్ద నోట్ల రద్దు తర్వాత అతి పెద్ద లబ్దిదారుగా అవతరించిన పే టీఎం గత నెలలో తన వినియోగదార్ల సంఖ్యను భారీగా పెంచుకుంది. దేశంలో చిన్న చెల్లింపులు బ్యాంకుగా రిజర్వ్ బ్యాంక్ లైసెన్స్ ఉన్న పేటీఎమ్ 14 మిలియన్ కొత్త వినియోగదారులను సాధించింది. సుమారు 10కోట్ల యూజర్లతో దూసుకుపోతోంది. డిజిటల్ చెల్లింపులపై ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహం నేపథ్యంలో పేటీఎమ్ చురుగ్గా కదులుతోంది. నగదు రహిత భారతంకోసం భారీ ప్రచారాన్ని నిర్వహిస్తూ తన సేవలను విస్తరిస్తోంది.

పేపాల్ వాదన చెల్లదు
టెక్ కార్ప్ లీగల్ సంస్థకు చెందిన పేటెంట్,ట్రేడ్‌మార్క్ న్యాయవాది వాదన ఇలా ఉంది. ఆర్థిక సేవల కంపెనీల్లో పే అనే పదాన్ని ఏ ఒక్కరూ తమకు చెందినదానిగా చెప్పుకోలేరు. న్యాయస్థానంలో పేపాల్ వాదన నెగ్గే అవకాశాలు తక్కువ. పేపాల్, పేటీఎమ్, పేయూ లాంటి పదాలను చూడగానే కస్టమర్లు వీటి మధ్య వ్యత్యాసాన్ని సులభంగానే గుర్తించగలరు. పేపాల్ అంతర్జాతీయ చెల్లింపుల రంగంలో ఒక అనారోగ్యకర వాతావరణాన్ని
సృష్టించగలదని దేశ న్యాయ నిపుణులు భావిస్తున్నారు.

ఆన్‌లైన్ మోసగాళ్లపై సీబీఐ కేసు నమోదు
మరోవైపు కొంతమంది ఆన్‌లైన్ మోసగాళ్లు తమను చీట్ చేశారని డిజిటల్ వాలెట్ కంపెనీ పేటీఎం వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మ సీబీఐకి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు 48 మంది కస్టమర్లు తమను రూ 6.15 లక్షల మేర మోసం చేశారని ఆరోపించారు. దీనిపై సీబీఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన సంగతి తెలిసిందే. మార్కెట్ వర్గాల ప్రకారం పేటీఎమ్ రెవెన్యూ 200% పెరగ్గా, నష్టాలు సైతం నాలుగింతలు పెరిగాయి.

అనుకోని అడ్డంకి
పెద్ద నోట్ల రద్దు తర్వాత వ్యాలెట్లకు బాగా డిమాండ్ పెరిగింది. ఈ కోవలోనే మర్చంట్లతో ఒప్పందాలు కుదుర్చుకోవడం ద్వారా దేశం నలుమూలలకు విస్తరిస్తుంది. ఈ మొబైల్ వ్యాలెట్లలో పాపులర్ అయిన పేటీఎమ్‌కు అనుకోని అడ్డంకి ఎదురవబోతోంది. ట్రేడ్ మార్క్ ఉల్లంఘన ఆరోపణలతో అమెరికన్ పేమెంట్ దిగ్గజం, ప్రపంచ చెల్లింపుల కంపెనీ పేపాల్ భారత్‌లో ట్రేడ్‌మార్క్ కార్యాలయంలో కేసు దాఖలు చేసింది. తమ లోగోను కాపీ చేసి పేటీఎమ్ అక్రమంగా ఉపయోగిస్తోందని ఆరోపించింది. దీంతో ప్రముఖ డిజిటల్ వాలెట్ కంపెనీ పేటీఎం ట్రేడ్ మార్క్ ఉల్లంఘన ఆరోపణల్లో ఐటీసీ, మెక్ డోవెల్ లాంటి భారతీయ కంపెనీల సరసన చేరింది.

పేపాల్ గురించి
ఆన్‌లైన్ నగదు లావాదేవీలు, చెల్లింపులు జరిపే అంతర్జాతీయ ఈ-కామర్స్ సంస్థ పేపాల్. ప్రస్తుతం దీనిని ఈబే కొనుగోలు చేసి దాని అనుబంధ సంస్థగా కొనసాగిస్తోంది. 1998 జూన్‌లో అమెరికాలో పేపాల్‌ను స్థాపించారు. దీని ప్రధాన కార్యాలయం సాన్‌జోస్,కాలిఫోర్నియాలో ఉంది. దీని వ్యవస్థాపకులు కెన్ హోరీ, మాక్స్‌లెవ్‌కిన్, ఎలోన్ మస్క్, లూక్ నోసెక్,పీటెర్ థీల్.
అమెరికాలో ఈ సంస్థ అలెక్సా ర్యాంకింగ్ 25గా ఉండగా, ప్రపంచవ్యాప్తంగా దీని ర్యాంకు 60గా ఉంది.

పేటీఎమ్
దేశీయంగా అబివృద్ది పరిచిన చెల్లింపుల, ఈ-కామర్స్ సంస్థ పేటీఎమ్. ఇప్పటి వరకూ 30 మిలియన్ల మంది ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోగా; డెస్క్‌టాప్, మొబైల్‌లో కలిపి 10 కోట్ల మంది పేటీఎమ్‌ను వాడుతున్నారు. పేటీఎమ్ ఇటీవలే కస్టమర్ కేర్ నంబరును సైతం అందుబాటులోకి తీసుకొచ్చింది. అంతేకాకుండా తెలుగు సహా పది ప్రాంతీయ భాషల వినియోగదారులకు మరింత చేరువయ్యేందుకు ఆయా భాషల్లో యూజర్ ఇంటర్‌ఫేస్‌ను పేటీఎమ్ ప్రవేశపెట్టింది. పేటీఎం ఆండ్రాయిడ్ యూజర్ ఇంటర్‌ఫేస్ తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం సహా పది ప్రాంతీయ భాషల్లో అందుబాటులో ఉంటుందని, దీంతో దేశంలోని 10 కోట్ల స్మార్ట్ ఫోన్ యూజర్లకు మరింత చేరువ అయ్యేందుకు వీలు కలుగుతుందని ఆ సంస్థ పేర్కొంది. పేటీఎమ్ అలెక్సా ర్యాంకింగ్ భారత్‌లో 14 ఉండగా, ప్రపంచవ్యాప్తంగా 295గా ఉంది.


Click it and Unblock the Notifications