నగదు రహిత లావాదేవీలకు ఆధారే ఆధారంగా ముందుకు సాగుతున్న కేంద్రం
పెద్ద నోట్ల రద్దు తర్వాత కేంద్రం నగదు రహిత లావాదేవీలను పెంచేందుకు తీవ్రంగా కృషి చేస్తోంది. తాజాగా ఈ దిశగా మరో చర్యకు సిద్దమవుతోంది. దీంతో ఇంకా కార్డుల వాడకం కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో లే
పెద్ద నోట్ల రద్దు తర్వాత కేంద్రం నగదు రహిత లావాదేవీలను పెంచేందుకు తీవ్రంగా కృషి చేస్తోంది. తాజాగా ఈ దిశగా మరో చర్యకు సిద్దమవుతోంది. దీంతో ఇంకా కార్డుల వాడకం కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో లేని దేశాన్ని నగదు రహితంగా మార్చేందుకు ప్రయత్నిస్తున్న ప్రభుత్వం ముమ్మర కసరత్తు చేస్తోంది.
కేవలం ఆధార్ నంబర్ ధారంగా లావాదేవీలు జరిగే దిశగా అడుగులు వేస్తోంది. ప్రభుత్వం ప్రస్తుతం ఆధార్.. ఫోన్.. వేలి ముద్ర ఆధారంగా ఒక నెట్‌వర్క్‌ను అభివృద్ధి చేస్తోంది. దీంతో మీరు ఆధార్ నంబరును చెప్పి.. మీ వేలి ముద్రను ఫోన్ ద్వారా స్కాన్ చేసి మీ ఖాతాలోని డబ్బును ఇతరుల ఖాతాలకు పంపవచ్చు. ఈ దిశగా సాఫ్ట్‌వేర్‌ను, ఫోన్లను అభివృద్ధి చేసేందుకు రంగం సిద్ధమవుతోంది. దీనికి సంబంధించి నీతి ఆయోగ్ ఒక పథకం రూపొందిస్తోంది. ఈ అంశంపై నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత మాట్లాడుతూ.. ''ఇకపైౖ దేశంలో ఉత్పత్తి చేసే ఫోన్లన్నీ వేలి ముద్రల (ఫింగర్‌ప్రింట్) స్కానర్‌ను లేదా కనుపాప (ఐరిస్) స్కానర్‌ను కలిగి ఉండేలా చూడాలని మొబైల్ తయారీదారులను కోరుతున్నాం. ఈ ఫోన్లు అందుబాటులోకి వస్తే ఆధార్ ఆధారిత లావాదేవీలు జరిపేందుకు వీలుంటుంది. అప్పుడు కార్డు అవసరం కూడా తగ్గిపోతుంది.'' అని వివరించారు. ప్రభుత్వం నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించేందుకు అన్ని మార్గాలను అన్వేషిస్తోందని కాంత్ చెప్పారు. అదే దిశలో యూఎస్ఎస్‌డీ(*99#) చెల్లింపు విధానాలు, ఈ-వ్యాలెట్లు, యూపీఐ(యునిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్), పీవోఎస్ చెల్లింపులకు కార్డు వాడకాన్ని ప్రోత్సహించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోందని తెలిపారు.
దీంతో మన 12 అంకెల ఆధార్ సంఖ్యే నగదు రహిత లావాదేవీలకు అత్యంత కీలకం కానుంది. బ్యాంకులు, ఇతరత్రా ఆర్థిక వ్యవహారాలకు ప్రస్తుతం ఆధార్ నంబరు తప్పనిసరి. అన్ని బ్యాంకు ఖాతాలూ ఆధార్ సంఖ్యతో అనుసంధానించబడతాయి. ఆ దిశగా ఈపీఎఫ్‌వో సైతం అన్ని యూఏఎన్ పీఎఫ్ చందాదార్లను బ్యాంకు ఖాతాలతో పాటు ఆధార్ అనుసంధానం పూర్తిచేసేందుకు ఒక నిర్దేశిత గడువును నిర్ణయించుకొని ముందుకెళుతోంది. చాలా రాష్ట్ర ప్రభుత్వాలు ఉపకార వేతనాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ఆధార్ అనుసంధానించి లోపాలను తగ్గిస్తున్నాయి. దీంతో ఆన్‌లైన్ ఆధారిత లావాదేవీల నిర్వహణ సులభమవుతుందని అధికారులు భావిస్తున్నారు. ఈ విధానానికి సంబంధించి కసరత్తు చేస్తున్న నీతి ఆయోగ్ త్వరలోనే పక్కా ప్రణాళికను ప్రభుత్వం ముందు ఉంచే వీలుంది. ఇదే అంశంపై విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ) డైరెక్టర్ జనరల్ అజయ్ పాండే మాట్లాడుతూ.. ''ఆధార్ ఆధారిత లావాదేవీలు నగదు, పిన్ రహితం అవుతాయి. స్మార్ట్ ఫోన్లు వాడేవారు తమ ఆధార్ నంబరు, వేలి ముద్రలను ఆధారం చేసుకుని లావాదేవీలు నిర్వహించవచ్చు.'' అని వివరించారు.
నగదు రహిత లావాదేవీలను విజయవంతంగా అమలు చేసేందుకు ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రుల కమిటీలో నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ కూడా ఉన్నారు. ఈ కమిటీ ఏడాది పాటు అధ్యయనం చేసి దేశంలో నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించేందుకు ఏం చేయాలో సవివర నివేదిక ఇస్తుంది. ఈ నేపథ్యంలో అమితాబ్ కాంత ఆధార్ ఆధారిత లావాదేవీల గురించి వెల్లడించడం ప్రాధాన్యం సంతరించుకుంది. మరోవైపు వ్యాపారులందరినీ ఈ-చెల్లింపులు, నగదు రహిత లావాదేవీలవైపు మళ్లించేందుకు కేంద్రం రూ.100 కోట్లు కేటాయించింది.


Click it and Unblock the Notifications
