ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయం ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్న నేపథ్యంలో.. కొన్ని వెసులుబాట్లను కల్పిస్తున్నాయి ప్రభుత్వ, బ్యాంకింగ్ వర్గాలు. ఈ క్రమంలోనే డిజిటల్ పేమెంట్ల
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయం ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్న నేపథ్యంలో.. కొన్ని వెసులుబాట్లను కల్పిస్తున్నాయి ప్రభుత్వ, బ్యాంకింగ్ వర్గాలు. ఈ క్రమంలోనే డిజిటల్ పేమెంట్లను ప్రోత్సహించేలా డెబిట్ కార్డు లావాదేవీల చార్జీలను రద్దు చేయాలని బుధవారం బ్యాంకులకు కేంద్రం సూచించింది. ఈ నేపథ్యంలో నగదు రహిత ఆర్థిక వ్యవస్థ కోసం ప్రభుత్వం తీసుకున్న కొన్ని చర్యలను చూద్దాం.

1. రైతుల కోసం
ప్రస్తుత రబీ సీజన్‌లో రైతుల నగదు అవసరాల దృష్ట్యా మరిన్ని చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే రైతులకు సహకార బ్యాంకుల ద్వారా 21,000 కోట్ల రూపాయలను అందించేలా నాబార్డును సిద్ధం చేసింది. ఈ మేరకు ఇక్కడ ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి శక్తికాంత దాస్ చెప్పారు. చాలా మంది రైతులకు కిసాన్ క్రెడిట్ కార్డులు అందజేశారు. రైతులు తమ ఏటీఎమ్ లేదా డెబిట్‌కార్డుల ద్వారా సైతం డబ్బును డ్రా చేసుకోవచ్చు.

2. బిగ్‌బజార్లలో నగదు
నల్లధనం, నకిలీ కరెన్సీల నిర్మూలనకు 500, 1,000 రూపాయల నోట్లను ఈ నెల 8వ తేదీ రాత్రి కేంద్ర ప్రభుత్వం రద్దు చేస్తున్నట్లు ప్రకటించినది తెలిసిందే. పాత నోట్లను డిసెంబర్ 30లోగా మార్చుకోవచ్చని, బ్యాంకులు, పోస్ట్ఫాసుల్లో వాటిని డిపాజిట్ చేసుకోవాలని తెలిపింది. దీంతో బ్యాంకులు, పోస్ట్ఫాసులతోపాటు ఏటీఎమ్‌ల వద్ద జనం బారులు తీరుతున్నారు. దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి కనిపిస్తుండటంతో పెట్రోల్ బంకులు, బిగ్ బజార్లలో నగదు ఉపసంహరణలకు ప్రభుత్వరంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్‌బిఐ అవకాశమిచ్చింది. అంతేగాక పాత నోట్లతోనే పెట్రోల్, బస్సు, రైలు ప్రయాణాలు, ప్రభుత్వ బకాయిల చెల్లింపులకూ వీలు కల్పించింది మోదీ ప్రభుత్వం.

3. డెబిట్ కార్డు చార్జీల తాత్కాలిక రద్దు
అయితే 2,000 రూపాయల నోట్లు బ్యాంకుల నుంచి వస్తుండటంతో చిల్లర సమస్య తలెత్తగా, వ్యాపారాలు స్తంభించిపోతున్నాయి. దీంతో డిజిటల్ పేమెంట్లకు ప్రజలను ప్రోత్సహించాలని బ్యాంకర్లకు ప్రభుత్వం సూచిస్తోంది. అందులోభాగంగానే డెబిట్ కార్డు చార్జీలను తాత్కాలికంగా రద్దు చేసింది.

4.ఛార్జీల రద్దును ప్రకటించిన బ్యాంకులు
ఐసిఐసిఐ, యాక్సిస్, యెస్ బ్యాంకులు వ్యాపారుల కోసం డెబిట్ కార్డు చార్జీలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించాయి కూడా. నవంబర్ 10 నుంచి డిసెంబర్ 31 వరకు డెబిట్ కార్డుల ద్వారా జరిపే లావాదేవీలకు చార్జీలుండవని స్పష్టం చేశాయ.

5. ఏ ఏటీఎమ్‌లోనైనా ఉచితమే
కాగా, ఇప్పటికే ఖాతాదారులకు ఏ బ్యాంకు ఎటిఎమ్‌లలోనైనా ఉచితంగానే నగదు ఉపసంహరించుకునే అవకాశం బ్యాంకులు కల్పించాయి. అలాగే ఈ-వాలెట్ల ద్వారా నెలసరి లావాదేవీల పరిమితిని 20,000 రూపాయలకు పెంచింది ప్రభుత్వం.

6.రుణ చెల్లింపులకు అదనపు గడువు
రుణాలను చెల్లించేందుకు 60 రోజుల అదనపు గడువునిస్తున్నట్లు ఆర్‌బీఐ ప్రకటించింది. అయితే రూ. కోటి లోపు అప్పులకు మాత్రమే ఈ వెసులుబాటు. బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీ(బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ)ల నుంచి తీసుకున్న వ్యక్తిగత రుణాలు, పంట రుణాలు, గృహ రుణాలు, వ్యవసాయ రుణాల విషయంలో ఈ సడలింపు వర్తిస్తుంది. నవంబరు 1 నుంచి డిసెంబరు 31 లోపు ఈఎంఐలు కట్టాల్సిన వారు నగదు సంక్షోభం కారణంగా ఆ సొమ్మును చెల్లించకపోయినా వారి క్రెడిట్ స్కోర్ దెబ్బతినదని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.

7. వ్యాలెట్ల పరిమితి రూ. 50 వేలకు పెంపు
మొబైల్ వ్యాలెట్లలో ఉంచుకోగల డబ్బు పరిమితులను రిజర్వ్ బ్యాంకు పెంచింది. ఖాతాలో ఉంచుకోగల సొమ్ము రూ. 10 వేల నుంచి రూ. 20 వేలయింది. అదే విధంగా నెలకు వ్యాపారులు వ్యాలెట్ నుంచి బ్యాంకు ఖాతాకు బదలాయించుకోగల(ట్రాన్స్‌ఫర్) పరిమితి రూ. 50 వేలకు పెరిగింది.


Click it and Unblock the Notifications