హమ్మయ్య ట్రంప్ ప్రకంపనల నుంచి మార్కెట్లు కోలుకున్నాయని ఊపిరి పీల్చుకునే సరికి మళ్లీ శుక్రవారం భారీగా నష్టాలను మూటగట్టుకున్నాయి. ట్రంప్ తీసుకునే నిర్ణయాలు ద్రవ్యోల్బణాన్ని పెంచుతాయని తద్వారా అమెరికాలో వడ్డీ రేట్లు పెరుగుతాయని పెట్టుబడిదారులు భయపడుతున్నారు. ఎన్ఎస్ఈ సూచీ 8300 దిగువకు పడిపోయింది.
అమెరికాలో ఎక్కువ వడ్డీ రేట్లు ఉంటే అభివృద్ది చెందుతున్న మార్కెట్లు అంతర్జాతీయ పెట్టుబడిదారులకు అంత ఆసక్తిగా ఉండవు. దీంతో పెట్టుబడిదారులు తమ పెట్టుబడిదారులు వర్తమాన మార్కెట్ల నుంచి భారీగా వెనక్కు తీసుకుంటున్నారు. ఈ పరిణామాలతో బీఎస్ఈ సెన్సెక్స్ 699(2.54%) పాయింట్లు కోల్పోయి 26,818.82 వద్ద ముగియగా, నిఫ్టీ 229.45 పాయింట్లు(2.69%) దిగజారి 8296.30 వద్ద క్లోజయింది.
బీఎస్ఈలో అన్ని రంగాలు ఎరుపెక్కాయి. ఆటో రంగం 4.53%, వినియోగదారు వస్తువుల 4.19%; స‌్థిరాస్తి రంగం 4.00%, ఎఫ్ఎమ్‌సీజీ 3.24% నష్టపోయాయి. సెన్సెక్స్‌లో బాగా నష్టపోయిన వాటిలో ఎమ్ అండ్ ఎమ్(6.02%), అదానీ పోర్ట్స్(5.86%), ఐసీఐసీఐ బ్యాంకు(5.32%), హీరో మోటోకార్ప్(5.18%), ఏసియన్ పెయింట్స్(5.02%) ఉండగా; సన్‌ఫార్మా(3.3%), హెచ్‌డీఎఫ్‌సీ(0.3%) లాభాలను గడించాయి.