2000 రూపాయల నోటులో ప్రత్యేకతలు ఇవేనా?
కొత్త నోట్లు నవంబరు 10 నుంచి ప్రజలకు అందుబాటులో ఉండబోతున్న నేపథ్యంలో ఈ నోటు గురించి మరిన్ని ప్రత్యేక లక్షణాలను తెలుసుకోవాలంటే ఇది చదవండి.
రిజర్వ్ బ్యాంక్ ఉర్జిత్ పటేల్ సంతకంతో ఉండే సరికొత్త రూ. 2000 నోటును ప్రవేశపెట్టనుంది. అందులో ముద్రించే సంవత్సరం 2016గా ఉండనుంది. నోటు వెనుకవైపు మంగళయాన్ చిత్రం ఉంటుంది. ఇంతకు ముందు ఉన్న వేయి నోట్ల కంటే ఇది కొంచెం చిన్నగా ఉంటుంది. కొత్త నోట్లు నవంబరు 10 నుంచి ప్రజలకు అందుబాటులో ఉండబోతున్న నేపథ్యంలో ఈ నోటు గురించి మరిన్ని ప్రత్యేక లక్షణాలను తెలుసుకోవాలంటే ఇది చదవండి.

దేవనాగరి లిపిలో 2000
కొత్త నోటులో 2000 నంబరు కుడివైపు కింద ఉంటుంది. దేవనాగరి లిపిలో నోటుకు ఎడమవైపు 2000 అనిఉంటుంది. మహాత్మా గాంధీ బొమ్మ ఇంతకు ముందు నోట్లలో లాగా కాకుండా మధ్యలో ఉంటుంది. ఎడమవైపు కింద సైతం 2000 అని రాసి ఉంటుంది. అయితే 45డిగ్రీలు వంచి చూస్తే ఇది కనబడే విధంగా రూపొందించారు.

సూక్ష్మ అక్షరాలు
అతి చిన్న అక్షరాలు ‘RBI' , ‘2000" అని నోటుకు ఎడమవైపున ఉంటుంది. భారత్ అని హిందీలో సెక్యూరిటీ త్రెడ్ మీద ఉంటుంది. ఆర్‌బీఐ, 2000 గులాబీ రంగులో ఉండనున్నాయి.

దారం(త్రెడ్) రంగు మారింది
నోటుపై ముద్రించే త్రెడ్ రంగు ముదురు ఆకుపచ్చ నుంచి నీలం రంగుకు మారింది. గ్యారెంటీ క్లాజ్, ఆర్‌బీఐ గవర్నర్ సంతకం, ఆర్‌బీఐ చిహ్నం వంటివి కుడివైపు ఉంటాయి. కుడివైపు కిందన ₹2000 అని ఉంటుంది.

అశోక స్తూపం
మహాత్మాగాంధీ బొమ్మకు కుడివైపున అశోక స్తూపం ఉండనుంది. ఎలక్ట్రోటైప్(2000) వాటర్‌మార్క్ ఎడమ నుంచి కుడికి ఉంటుంది. నంబరు ప్యానెల్ సంఖ్యలో కుడి నుంచి ఎడమకు సైజు పెరుగుతూ పోతుంది. ఇలా సైజు పెరుగుతుండటం పాత నోట్లలో చూడలేం. పాత నోట్లలో ఉండే నంబరు ప్యానెల్ సంఖ్యలో అన్నీ అంకెలు ఒకే సైజులో ఉంటాయి.

నోటుకు వెనుకవైపు
ముద్రణా సంవత్సరం ఎడమవైపు ఉంటుంది. స్వచ్చ భారత్ లోగో, నినాదం ఉంటాయి. మునుపు నోట్లలో నోటుకు వెనుకవైపు దాని విలువ వివిధ భాషల్లో ఎడమవైపు ఉండేది. దీని స్థానం 2000 నోటులో మారుతుంది. నూతన ఫీచర్ మంగళయాన్ బొమ్మ ఉంటుంది.

చూపు లేని వారి కోసం
మహాత్మాగాంధీ బొమ్మ, అశోక చక్రం కాస్త ఒత్తుగా ఉండనున్నాయి. బ్లీడింగ్ లైన్లు, ఐడెంటిటీ మార్కు వంటివి సైతం చేతితో తాకితే ఒక అనుభూతి కలిగేలా ఉంటాయి. కుడివైపు 2000 రాత కొద్దిగా ఎక్కువ మందంతో ఉంటుంది. పూర్వపు వేయి నోటులో ఇది డైమండ్ లాగా ఉంటుండగా కొత్త 2వేల నోటులో ఇది దీర్ఘచతురస్రంలా ఉండే అవకాశం ఉంది. ఇంకా కోణీయ రేఖలు కుడి, ఎడమవైపు ఉంటాయి.

ఆర్‌బీఐ చెప్పిన ప్రత్యేకతలు
ముద్రణా సంవత్సరం ఎడమవైపు ఉండటం
స్వచ్చభారత్ లోగో, నినాదం
భాషలన్నీ మధ్యలో ఉండటం
మంగళయాన్ చిత్రం
2000 అంకె దేవనాగరి లిపిలో

శక్తికాంతదాస్ వెల్లడించిన విషయాలు
ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. మార్స్ మిషన్‌ను సెలబ్రేట్ చేసుకునేందుకు మంగళయాన్ చిత్రం ఈ నోటులో ఉంటుంది. కొత్త 500 సిరీస్ నోట్లను మహాత్మాగాందీ సిరీస్ బ్యాంకు నోట్లుగా వ్యవహరిస్తారు. ఇందులో ఢిల్లీ ఎర్రకోట బొమ్మ ఉంటుంది.


Click it and Unblock the Notifications