అమెజాన్‌ను దాటేసిన ఫ్లిప్‌కార్ట్
భారతదేశంలోకి అమెజాన్ అడుగిడినప్పటి నుంచి ఈ-కామర్స్‌లో నువ్వా నేనా అన్నట్లు పోటీ నెలకొంది. ఈ సారి పండగ అమ్మకాల్లో అందరి అనుమానాలను పక్కకు నెట్టి ఫ్లిప్‌కార్ట్ అమ్మకాల్లో దూసుకెళ్లింది.
ప్రపంచ ఈ-కామర్స్ దిగ్గజంగా పేరున్న అమెజాన్ కంటే తానే ఎక్కువగా విక్రయాలు నిర్వహించినట్లుగా ఫ్లిప్‌కార్ట్ ప్రకటించుకుంది. గురువారంతో ముగిసిన బిగ్ బిలియన్ డేస్ ఫెస్టివల్ అమ్మకాల్లో 15.5 మిలియన్ యూనిట్లను విక్రయించి దేశీయ ఆన్‌లైన్ మార్కెట్‌లో మదటి స్థానంలో నిలిచినట్టు వెల్లడించింది.

బిగ్ బిలియన్ డే అమ్మకాలకు స్మార్ట్‌ఫోన్లు, టెలివిజన్ల అ్మకాలు ఎక్కువగా సహకరించినట్టు కంపెనీ ప్రతినిధులు తెలిపారు. ఈ ఈవెంట్ తమకు చాలా ప్రాముఖ్యమైనదని, మరోసారి దేశీయ ఆన్‌లైన్ మార్కెట్లో తామే రారాజుగా నిరూపించుకోవడానికి ఇది ఎంతో సహకరించిందని ఫ్లిప్‌కార్ట్ సీఈవో బిన్నీ బన్సాల్ తెలిపారు. అయితే ఎంతమొత్తానికి ఈ అమ్మకాలు రికార్డు అయ్యాయో వెల్లడించలేదు. గతేడాది కంపెనీ 300 మిలియన్ డాలర్లకు బిగ్ బిలియన్ డే అమ్మకాలు నిర్వహించింది.
మొబైల్, లైఫ్‌స్టైల్, అతిపెద్ద ఉపకరణాలపై ఎక్కువగా తాము దృష్టి పెట్టామని, ఈ సమయంలో వీటిని కొనడానికే వినియోగదారులు ఎక్కువగా ఆసక్తిచూపుతారని గుర్తించినట్టు వెల్లడించారు. ఫ్లిప్‌కార్ట్ సీఈవోగా బన్సాల్ పదవి బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి మార్కెటింగ్, వినియోగదారులకు సేవలందించడం, టెక్నాలజీలల్లో కీలకమైన మార్పులు చోటుచేసుకున్నాయి. దీంతో ఫ్లిప్‌కార్ట్ వెబ్‌సైట్,మొబైల్ వెబ్‌సైట్లలో, యాప్ కొనుగోళ్లలో ఫ్లిప్‌కార్ట్‌కు డిమాండ్ అనూహ్యంగా పెరిగింది. ప్రత్యర్థి అమెజాన్ నిర్వహించిన గ్రేట్ ఇండియన్ సేల్ విక్రయాలు కేవలం 15 మిలియన్ యూనిట్లకే పరిమితమైనట్టు బుధవారమే ఆ కంపెనీ వెల్లడించిన సంగతి తెలిసిందే. ఫ్లిప్‌కార్ట్ అక్టోబర్ 2 నుంచి 6వ తేదీ వరకు ఈ బిగ్ బిలియన్ డేస్ నిర్వహించగా.. అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్ అక్టోబర్ 1 నుంచి 5వ తేదీ వరకు చేపట్టిన సంగతి తెలిసిందే. ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల నుంచి సైతం అమ్మకాలకు డిమాండ్ వెల్లువెత్తడం ఈ-కామర్స్ కంపెనీలకు కలిసొచ్చింది.


Click it and Unblock the Notifications