కావేరి జలాల పంపిణీ కారణంగా తలెత్తిన వివాదం కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో పలు ప్రాంతాలను రెండు, మూడు రోజులు అట్టుడికేలా చేసింది. రెండు రాష్ట్రాల్లో ఆందోళనకారుల దాడులు, ఆందోళనలే కాకుండా హింసాత్మక చర్యలకు ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. రోడ్డు, రైలు, విమాన తదితర రవాణా వ్యవస్థలు బెంగుళూరు నగరంలో స్తంభించాయి. ఈ హింసాత్మక పరిణామాలు సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియాగా పేరున్న బెంగుళూరుకు మచ్చ తెచ్చేలా ఉన్నాయని అసోచామ్ అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో ప్రభావితమైన కొన్ని ముఖ్యమైన అంశాలను చూద్దాం.

1.స్టార్టప్‌లతో మొదలుకొని
స్టార్టప్‌లతో పాటు, ఐటీ కంపెనీలు వివిధ వ్యాపారాలు నెలకొని ఉన్న ఇండియన్ సిలికాన్ వ్యాలీ బంద్ కారణంగా రూ. 25 వేల కోట్ల వరకూ నష్టపోయిందని అసోచామ్ ప్రకటించింది. రోడ్డు,రైలు,వాయు రవాణా వ్యవస్థ స్తంభించడం వంటి కారణాల వల్ల ఉద్యోగులు ఇళ్లకే పరిమితమయ్యారు. వ్యాపారస్థులు ఇబ్బందులు పడ్డారు. చాలా స్టార్టప్‌లు ఆర్డర్లను క్యాన్సిల్ చేశాయి. తయారీ కంపెనీలు ఉత్పత్తులను నిలిపేశాయి. శుక్రవారం నుంచి మంగళవారం వరకూ బెంగళూరు నగరంలో పరిస్థితులు అంత ప్రశాంతంగా లేనందున జనం ఇబ్బందులు పడ్డారు.

2.టయోటా కిర్లోస్కర్
బిదడి ఇండస్ట్రియల్ ఏరియాలో ఫ్యాక్టరీ ఉన్న టయోటా కిర్లోస్కర్ ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీగా ఉంది. సోమవారం తొందరగానే కంపెనీని మూసివేసిన కిర్లోస్కర్ మంగళవారం మొత్తం తెరుచుకోలేదు. బంద్ ప్రభావం సత్వరమే పడటమే కాకుండా ప్రత్యక్షంగా ఉంటుందని భావిస్తున్నారు. తయారీ కంపెనీలకు ఉత్పత్తి నష్టాలు ఉంటాయి.

3. బిగ్ బాస్కెట్
ఆన్‌లైన్, హోం డెలివరీ గ్రాసరీ సంస్థ బిగ్ బాస్కెట్ బెంగుళూరులో బాగా విస్తరించి ఉంది. బెంగుళూరు-మైసూరు రోడ్డులో సేకరణ కేంద్రాల నుంచి సరుకులను తీసుకుని పోవడానికి రెండు రోజులు ఇబ్బందులు ఎదుర్కొంది బిగ్ బాస్కెట్ యాజమాన్యం. రెండు రోజుల్లో రూ.4 కోట్లు నష్టపోయింది. ఇప్పటికే 20,000 ఆర్డర్లు పెండింగ్‌లో ఉండిపోయాయని, వీటిని అందించడానికి మూడు రోజుల సమయం పడుతుందని కంపెనీ సీఈఓ హరి మేనన్ వాపోయారు. బుధవారం నుంచి పనిచేసినా పాత ఆర్డర్లను కస్టమర్లకు చేర్చేందుకు మరో 3 రోజుల సమయం పడుతుందని మీనన్ చెప్పారు.

4. ఫ్రెష్ మెను
ఆన్‌లైన్ ఫుడ్ పోర్టల్ ఫ్రెష్ మెను తన సొంత కేంద్రీకృత కిచెన్లలో ఆహారాన్ని తయారు చేస్తుంది. సోమవారం సాయంత్రం నుంచి అది తన వినియోగదారులకు డెలివరీలను అందించలేకపోయింది. మంగళవారం ఉదయం తాము కంపెనీని తెరవలేకపోయామని సంస్థ వ్యవస్థాపకురాలు రష్మి దాగా చెప్పారు. సోమ, మంగళ వారం రెండు రోజుల్లో వేల ఆర్డర్లు కోల్పోయినట్లు తెలుస్తోంది.

5. అసోచామ్ ఆందోళన
రవాణా వ్యవస్థలు స్తంభించడంతో పాటు కార్యాలయాలు పనిచేయకపోవడంతో దాదాపు రూ. 22 వేల కోట్ల నుంచి రూ. 25 వేల కోట్ల వరకూ నష్టం సంభవించి ఉండవచ్చని అసోచామ్ వెల్లడించింది. రాష్ట్ర రాజధాని బెంగుళూరుతో పాటు కర్ణాటకలోని ఇతర ప్రాంతాల్లో హింస చెలరేగడంతో బెంగుళూరు ఇమేజీ దెబ్బతింది. ఇది ఫార్చూన్ 500 కంపెనీల్లో ఎన్నో ప్రధాన సంస్థలకు నిలయం. లా అండ్ ఆర్డర్‌ను గాడిలో పెట్టాలని అసోచామ్ సెక్రటరీ జనరల్ డీ ఎస్ రావత్ రెండు రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు.

6. మూతపడ్డ విప్రో, టీసీఎస్, ఇన్ఫోసిస్
విప్రో కేంద్ర కార్యాలయం మంగళవారం మొత్తం మూతపడింది. ఇంకా బెంగుళూరు ప్రధాన కేంద్రంగా కలిగిన టీసీఎస్, ఇన్ఫోసిస్, ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ కార్యాలయాలు రెండో రోజు మంగళవారం కూడా మూతపడ్డాయి. తయారీ రంగ కంపెనీలకు సంబంధించి పలు పారిశ్రామిక ఉత్పత్తులతో పాటు సరుకు రవాణా, షాపింగ్ మాళ్లు, సినిమా థియేటర్లు, హోటళ్లు, రెస్టారెంట్లు వంటి పలు ముఖ్య వ్యాపారాలు నిలిచిపోయాయి. ముఖ్యంగా ఐటీ, ఐటీఈఎస్ రంగాల్లో ఉద్యోగులు కార్యాలయాలకు రాలేని కారణంగా ఎక్కువ నష్టం సంభవించిందని అసోచామ్ అభిప్రాయపడింది.

7. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్
బెంగుళూరు నగరం నుంచి బయటకు వెళ్లాల్సిన ఫ్లిప్‌కార్ట్ ప్యాకేజీలు ప్రభావితమయ్యాయి. మిగిలిన చోట్ల అంత సమస్య లేదు. బుధవారం ఉదయం నుంచి పరిస్థితులు దాదాపుగా చక్కబడ్డాయి. " అయితే మంగళవారం మాత్రం రోజంతా ఎలాంటి డెలివరీ కార్యకలాపాలను చేపట్టలేదు. పరిస్థితులు చక్కబడిన జరిగిన ఆలస్యం గురించి కస్టమర్లకు వివరిస్తాం. అని" సప్లై చైన్ ఆపరేషన్స్ విభాగాధిపతి నీరజ్ అగర్వాల్ తెలిపారు. అమెజాన్‌కు మాత్రం బెంగుళూరు, మైసూరు, మండ్యా నగరాల్లో ప్రభావం పడింది. రాజధాని నగరంతో పోలిస్తే మిగిలిన ప్రాంతాల్లో ప్రభావం స్వల్పమని అమెజాన్ ప్రతినిధులు అభిప్రాయపడ్డారు.


Click it and Unblock the Notifications