రూ.12 లక్షల కోట్లతో సాగరమాల ప్రాజెక్టులు
కేంద్ర ప్రభుత్వం చేపట్టిన సాగరమాల ప్రాజెక్టు కింద ఆంధ్రప్రదేశ్‌లో 8500 కోట్ల రూపాయలతో వివిధ ప్రాజెక్టులు చేపట్టనున్నట్లు కేంద్ర ఉపరితల రవాణా, నౌకాయాన శాఖ మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. ఇందులో భాగంగా ప్రస్తుతం విశాఖ, కాకినాడ, మచిలీపట్నం నౌకాశ్రయాల ప్రతిపాదనలకు కేంద్రం ఆమోదం తెలిపింది. విశాఖపట్నంలోని విసిటిపిఎల్‌లో నిర్మించిన కంటైనర్ ఫ్రీట్ స్టోరేజి సౌకర్యాన్ని, విశాఖ పోర్టు ట్రస్టు నిర్మిస్తున్న 10 మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్‌ను, విశాఖ పోర్టులోని రెండు బెర్త్‌లను గడ్కరీ ప్రారంభించారు. మరో రెండు బెర్త్‌ల నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రూ. 12 లక్షల కోట్లతో కేంద్రం సాగరమాల ప్రాజెక్టులను చేపడుతోందన్నారు. ఇందులో రహదారుల నిర్మాణం వంటి సౌకర్యాలను మెరుగుపరిచేందుకు రూ. 4 లక్షల కోట్లను ఖర్చుపెడతామన్నారు. మిగిలిన 8 లక్షల కోట్ల రూపాయలతో దేశంలోని వివిధ పోర్టుల ఆధునీకరణ సహా 27 పారిశ్రామిక క్లస్టర్లను అభివృద్ధి చేయనున్నట్లు చెప్పారు. సాగరమాల ప్రాజెక్టు కింద కాకినాడ దగ్గర 3000 కోట్ల రూపాయలతో ఎల్ అండ్ జి టెర్మినల్‌ను, మిగిలిన నిధులతో విశాఖలో అదనపు ఆయిల్ జెట్టీ, మరో స్టాక్ యార్డు నిర్మాణం, కాకినాడ వద్ద కోస్టల్ ఫుడ్ ఎక్స్‌పోర్టు బెర్త్ వంటి ప్రతిపాదనలు ఉన్నాయన్నారు. వాడ్రేవు, మచిలీపట్నం వద్ద కొత్తగా ఓడరేవులను అభివృద్ధి చేస్తున్నట్లు వెల్లడించారు సాగరమాల ప్రాజెక్టు అమలును పర్యవేక్షించేందుకు ఒక సంస్థను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. దేశంలో విశాఖ పోర్టు చాలా కీలకమైనదని, దీనిని దృష్టిలో ఉంచుకుని దాదాపు 2000 కోట్ల రూపాయలతో ఆధునీకరిస్తున్నామన్నారు.

బకింగ్‌హామ్ కాలువ ఆధునీకరణలో ముందడుగు
వివిధ రాష్ట్రాల మధ్య జల రవాణాను అభివృద్ది చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లుగా గడ్కరీ చెప్పారు. ఇటీవల గంగా నది ద్వారా బంగ్లాదేశ్‌కు కారును రవాణా చేసినప్పుడు రూ. 5000 మేరకు కారు ధర తగ్గిందని తెలిపారు. దీనిని దృష్టిలో ఉంచుకుని అంతర్రాష్ట్ర జల రవాణాలో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లోని బకింగ్‌హామ్ కాలువ ఆధునికీకరణ చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఈ విషయమై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో చర్చించనున్నట్లు తెలిపారు. మూడు నెలల్లో దానికి సంబంధించిన పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకుంటామని, ఇందుకు 2000 కోట్ల రూపాయలు ఖర్చు చేసేందుకు సిద్ధమన్నారు. దేశంలోని వివిధ పోర్టులు, నౌకాయాన సంస్థల ద్వారా 6000 కోట్ల రూపాయల మేరకు లాభం ఆర్జించామని తెలిపారు.


Click it and Unblock the Notifications