ఆ ఆరు రంగాలపై జీఎస్‌టీ ప్రభావం
ఎన్నో చర్చలు, పార్టీల మధ్య ఏకాభిప్రాయం తర్వాత జీఎస్‌టీ బిల్లు రాజ్యసభ ఆమోదం పొందింది. రాజ్యసభలో చేసిన సవరణలకు లోక్‌సభ మళ్లీ ఆమోదం తెలిపిన తర్వాత దీన్ని రాష్ట్ర శాసనసభలకు పంపుతారు. చిదంబరం రాజ్యసభలో లేవనెత్తిన అభ్యంతరాలకు సమాధానమిచ్చిన జైట్లీ తాము రాజ్యాంగానికి లోబడే ఈ బిల్లుకు సంబంధించిన సవరణలను చేపడతామన్నారు. ఈ నేపథ్యంలో పరిశ్రమల వర్గాలు ఏయే రంగాలు ఏ విధంగా ప్రభావితమవుతాయో లెక్కలు వేసుకుంటున్నాయి. ఇక్కడ పలు కీలకం రంగాలపై జీఎస్టీ ప్రభావాన్ని చూద్దాం.
టెలికాం:
ప్రస్తుతం ఉన్న పరోక్ష పన్నులతో పోల్చి చూస్తే జీఎస్‌టీ 18 నుంచి 20 శాతం మధ్య ఉండేలా కనిపిస్తోంది. ప్రస్తుతం టెలికాం రంగానికి పన్ను విధానం కేంద్ర ఆధ్వర్యంలో ఉన్నందున ఏకరీతిగా ఉంది. జీఎస్‌టీ తర్వాత రాష్ట్ర ప్రభుత్వాలు చేసే స్టేట్ జీఎస్‌టీ చట్టాలకు లోబడి టెలికాం ఆపరేటర్లు వ్యవహరించాల్సి ఉన్నందున టెలికాం రంగం కాస్త ఒత్తిడిని ఎదుర్కొనవచ్చు.
ఈ-కామర్స్
ఈకామర్స్‌పై ప్రస్తుతం తక్కువగా పన్నులు ఉంటున్నట్లు కనబడుతోంది. ఇది కాస్త పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ-కామర్స్ కంపెనీలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి వస్తువుల తరలింపు సమయంలో విధించే అంతరాష్ట్ర పన్ను. జీఎస్‌టీలో దీనికి ఒక పరిష్కారం కావాలని వారు ఎదురుచూస్తున్నారు.
ఆటోమొబైల్
ఆటోమొబైల్ రంగానికి మాత్రం జీఎస్టీ వరప్రదాయని లాగే కనిపిస్తోంది. ప్రస్తుతం అంతిమ ఉత్పత్తిపై ఉన్న వివిధ పన్నుల స్థాయి 25-40 శాతం నుంచి ఇవి 18-20 శాతానికి తగ్గవచ్చు. ఎక్సైజ్, వ్యాట్ లేదా సీఎస్‌టీ, ఎంట్రీ ట్యాక్స్, అక్ట్రాయ్ పన్ను అన్నీ పోయి జీఎస్‌టీ ఒకటే అమలుచేస్తే ప్రయోజనమే.
స్థిరాస్తి రంగం
ఈ రంగం దేశ జీడీపీలో 7 నుంచి 8 శాతం ఉంటోంది. ఐటీ తర్వాత రెండో అతిపెద్ద ఉపాధి రంగం ఇదే. ఈ రంగంపై జీఎస్‌టీ బిల్లు ప్రభావం సానుకూలంగానే ఉండేలా కనిపిస్తోంది. ప్రధానంగా స్టాంప్ డ్యూటీ, వ్యాట్, సేవా పన్ను వంటి వాటిని ఆస్తుల కొనుగోలు, అమ్మకాల్లో మనం చూస్తాం. వ్యాట్, సేవా పన్ను స్థానంలో కొంచెం తక్కువగా ఉండేలా జీఎస్‌టీ ఉంటుందని అనుకుంటున్నారు.

బ్యాంకింగ్ రంగం
బ్యాంకింగ్ రంగంపై అధిక ప్రభావం ఉంటుందని అంచనా వేస్తున్నారు. జీఎస్‌టీ వల్ల 18 నుంచి 20 శాతానికి ఈ రంగంపై పన్నులు పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం అన్నీ కలిపినా 15% వరకూ ఉన్నాయి.
ఎఫ్ఎమ్‌సీజీ
జీఎస్‌టీ ప్రభావం ఎఫ్ఎమ్‌సీజీపై సానుకూలమే అని భావిస్తున్నారు. లాజిస్టిక్స్‌పై మొత్తం పన్ను రేటు 25-27 నుంచి 18-20 శాతానికి తగ్గొచ్చు. దీంతో వస్తు రవాణా ఖర్చులు తగ్గుతాయి. ఇది ఎఫ్ఎమ్‌సీజీ రంగానికి ప్రయోజనకరం. వేర్‌హౌసింగ్, సరకు నిల్వకు సంబంధించి పెద్దఎత్తున ఏకీకరణ జరిగే మార్గాలు కనిపిస్తున్నందున ఈ రంగం బలపడుతుంది.


Click it and Unblock the Notifications