బీమా తీసుకునేందుకు దేశవ్యాప్తంగా అందరూ మొగ్గుచూపే కంపెనీ ఎల్ఐసీ. మార్కెట్‌లో జీవిత బీమా సంస్థ(ఎల్ఐసీ) వివిధ రకాల పాలసీలను ప్రవేశపెట్టింది. ఏదైనా పాలసీని తీసుకునేముందు కంపెనీ గురించి, పాలసీ రకం గురించి తెలుసుకోవడం ఎంతైనా ముఖ్యం.
ఈ నేపథ్యంలో ఎల్ఐసీ పాలసీదారులు తెలుసుకోవాల్సిన 10 విషయాలను ఇక్కడ చూడండి.

పాలసీ బాండుకు సంబంధించిన భద్రత
మీ పాలసీ ప్రతిపాదనను మీరు, కంపెనీ అంగీకరించిన క్రమంలో బీమా సంస్థ పాలసీ బాండును అందిస్తుంది. పాలసీ ప్రతిపాదన అంగీకారం అయినప్పటి నుంచి రిస్క్ కవరేజీ మొదలవుతుంది. దానికి సంబంధించిన షరతులు, వర్తించే అంశాలు పాలసీ బాండులో పొందుపరచబడి ఉంటాయి. క్లెయిం సెటిల్‌మెంట్ సమయంలో బాండు అవసరం. మీకు పాలసీ హామీగా రుణం కావాలన్నా అది అవసరం.

పాలసీ సంఖ్య
పాలసీకి కేటాయించే ప్రత్యేక సంఖ్య 9 అంకెలతో కూడుకుని ఉంటుంది. పాలసీని గుర్తించేందుకు ఇది ప్రధాన అవసరం. పాలసీ పూర్తయ్యే వరకూ ఇది మారదు. మీరు బీమా కంపెనీని సంప్రదించినప్పుడు ఏదైనా ప్రశ్నలు అడగాలంటే మీ పాలసీ నంబరును తెలపాల్సి ఉంటుంది.

పాలసీ నియమనిబంధనలు
ఒక్కో పాలసీ అవసరాలు ఒక్కో విధంగా ఉంటాయి. దానికి కంపెనీ అందించే ప్రయోజనాలు సైతం మారుతూ ఉంటాయి. పాలసీ పత్రంపై సంతకం చేసేటప్పుడు నియమనిబంధనలను క్షుణ్ణంగా చదివిన తర్వాతే సంతకం చేసి ఉంటే మంచిది.

పాలసీలో మార్పులు
పాలసీ నియమనిబంధనలు చదివిన తర్వాత అది మీకు సరిపోదనుకుంటే మార్పులకు అవకాశం ఉంది. పాలసీ మొదలైన మొదటి ఏడాది కాలంలో కొన్ని అసాధారణ పరిస్థితుల్లో తప్ప పాలసీ మార్పులకు అవకాశం ఉండదు.

పాలసీ బాండు పోతే
పాలసీ బాండు పోగొట్టుకుపోతే పాలసీదారుడి పేరు మీద డూప్లికేట్ పాలసీని జారీ చేస్తారు. కొన్ని నిబంధనలను సంతృప్తి పరిచనట్లయితేనే ఈ పాలసీ మన చేతికి వస్తుంది. ఇండెమ్నిటీ బాండు, డూప్లికేట్ పాలసీ రుసుములు, స్టాంప్‌డ్యూటీ వంటి వాటిని మనమే భరించాలి.

చిరునామా అప్‌డేట్
పాలసీ తీసుకున్న తర్వాత మీరు ఇల్లు మారుతూ ఉన్న సందర్భాల్లో కొత్త చిరునామాను బీమా కంపెనీకి తెలియజేస్తూ ఉండాలి. ఎందుకంటే ప్రీమియం నోటీసులు, డిశ్చార్జి వోచర్లు క్రమంగా బీమా కంపెనీ పంపించాల్సి ఉంటుంది కనుక.

నామినేషన్
పాలసీ బాండులో నామినీ పేరు సరిగా ఉండేటట్లు చూసుకోవాలి. లేకపోతే క్లెయిం సమయంలో ఇబ్బందులు తప్పవు. పాలసీ కాలపరిమితిలో ఎప్పుడైనా నామినీ పేరును మార్చుకునే వీలుంటుంది. ప్రస్తుతం ఎల్ఐసీ పాలసీ పత్రంలో నామినీ పేరును ఆన్‌లైన్‌లో మార్చుకునే సదుపాయం అందుబాటులో ఉంది.

పాలసీ పునరుద్దరణ
ప్రీమియం చెల్లించకపోయినందున పాలసీ రద్దయి ఉంటే పాలసీని పునరుద్దరించుకునే వరకూ మీకు పాలసీ ప్రయోజనాలు అందనట్లే. పాలసీ వాయిడ్ అవుతుంది. పెండింగ్ ప్రీమియంలను వడ్డీతో సహా చెల్లించి, పెనాల్టీలు ఉంటే అవి కూడా చెల్లించి పాలసీలను పునరుద్దరించుకోవచ్చు. ఒకవేళ బీమా సంస్థ మీ ఆరోగ్య పరీక్షల వివరాలు అడిగితే వాటిని సమర్పించాల్సి వస్తుంది.

పాలసీలపై రుణాలు
ఎల్ఐసీ పాలసీలు ఎక్కువ శాతం ఎండోమెంట్ పాలసీలే. వాటిపై రుణం పొందే అవకాశం ఉంటుంది. తీసుకున్న రుణాన్ని వడ్డీతో సహా చెల్లించాలి. అలా కాకుండా వడ్డీని క్రమంగా చెల్లిస్తూ, క్లెయిం చెల్లింపు సమయంలో రుణాన్ని మినహాయించేలా సైతం చేసుకోవచ్చు.

పాలసీ హామీ
ఎల్ఐసీ నుంచి లేదా ఇతర ఆర్థిక సంస్థల నుంచి పాలసీ హామీగా ఉంచి రుణం పొందాలంటే పాలసీ పత్రాన్ని హామీగా ఉంచాలి. రుణం తీర్చిన తర్వాతే మీ పాలసీ పత్రం మీకు తిరిగి వెనక్కిస్తారు.


Click it and Unblock the Notifications