రిలయన్స్‌ఇండస్ట్రీస్ జూన్‌తో ముగిసిన త్రైమాసికానికి నికర లాభంలో 18.5 శాతం వృద్దితో రూ. 7548 కోట్లను ఆర్జించింది. ఇది కంపెనీకి కొత్త రికార్డుగా చెప్పుకోవచ్చు. గ్రాస్ రిఫైనింగ్ మార్జిన్లు బ్యారెల్‌కు 11.50 డాలర్లకు చేరడం కలిసొచ్చింది. అయితే కంపెనీ రెవెన్యూలు మాత్రం 13.4 శాతం తగ్గి రూ. 71,451కు తగ్గాయి. రెవన్యూ తగ్గినప్పటికీ నికర లాభాలు మాత్రం పెరిగాయి. పన్ను, వడ్డీలను కలపకుండా చూస్తే వచ్చే రాబడి 241 బేసిస్ పాయింట్లు పెరిగింది. అంటే 2.41 శాతం అన్నమాట.
ఫలితాలపై రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ముకేశ్ అంబానీ స్పందిస్తూ పలు విషయాలను వెల్లడించారు." ప్రపంచవ్యాప్త ఆర్థిక పరిస్థితులు అనిశ్చితిలో ఉన్నప్పటికీ ఈ త్రైమాసికంలో మా రాబడుల్లో వృద్దిని సాధించాం. ఇతర ప్రాంతాల్లో రిఫైనరీ మార్జిన్లు తగ్గుముఖం పట్టినప్పటికీ, రిలయన్స్ ముడిచమురుకు సంబంధించి గ్రాస్ రిఫైనరీ మార్జిన్లు సమర్థవంతంగా, ఎక్కువగా ఉన్నాయి. మా రిఫైనింగ్ వ్యాపారం పరిశ్రమలోనే అత్యధిక జీఆర్‌ఎమ్ సాధించింది. మా పెట్రో రసాయనాల వ్యాపారం అధిక పోర్ట్ ఫోలియోను కలిగి ఉంది. వీటన్నింటి వల్ల పెట్రో రసాయనాల్లో అధిక మార్జిన్ సాధ్యమైంది. గతేడాది ఇదే త్రైమాసికంతో పోలిస్తే మేము 20.5% కంటే ఎక్కువ ఎబిటా(పన్ను, వడ్డీలు కలపకుండా వచ్చేది) ఆదాయం సాధించగలిగాము" అని కంపెనీ ప్రకటనలో తెలిపారు.
ఎన్ఎస్ఈలో రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరు ధర 0.61 శాతం పెరిగి రూ. 1012 వద్ద ముగిసింది. శుక్రవారం మార్కెట్ ముగిసిన తర్వాత ఫలితాలు వెలువడిన కారణంగా సోమవారం కంపెనీ షేరు ధర ఎక్కువగానే మొదలయ్యే అవకాశం ఉంది.