* జపాన్ ఉద్దీపన ప్యాకేజీ, అమెరికా ఉద్యోగ గణాంకాలే కారణం
సోమవారం రోజు మార్కెట్లు 11 నెలల గరిష్ట స్థాయికి వెళ్లాయి. అమెరికాలో ఉద్యోగ నియామకాలు జోరందుకోవడం.. బ్రెగ్జిట్ నేపథ్యంలో అమెరికా ఫెడరల్ బ్యాంకు ఇప్పట్లో వడ్డీరేట్లను మళ్లీ పెంచకపోవచ్చన్న అంచనాలు పెట్టుబడిదారుల్లో విశ్వాసాన్ని పెంచడమే ఇందుకు కారణం.
సెన్సెక్స్ 500 పాయింట్లు(1.84%) పెరిగి 27,626 పాయింట్ల వద్ద ముగియగా, నిఫ్టీ 145 పాయింట్లు(1.74%) పైకి ఎగసి 8467.90 పాయింట్ల వద్ద ముగిసింది. ఆగస్టు 20,2015 తర్వాత రెండు సూచీలకు అత్యధిక స్థాయిలు ఇవే.
ఆసియా నుంచి యూరప్ వరకూ మార్కెట్లలో ర్యాలీ కొనసాగింది. పెద్దల సభలో విజయం తర్వాత జపాన్ ప్రధాని షింజో అబే బ్యాంక్ జపాన్‌కు ఉద్దీపన ప్రకటిస్తారన్న అంచనాలు జపాన్ మార్కెట్లను ఉరకలెత్తించాయి. అమెరికా ఉద్యోగ గణాంకాలు సానుకూలంగా వెలువడటంతో అమెరికా మార్కెట్లు కళకళలాడాయి.
సెన్సెక్స్ ట్రేడ్‌లో టాటామోటార్స్ 4 శాతం పైకి ఎగసి అత్యధికంగా లాభపడింది. రెండు సూచీల్లో తర్వాత అత్యధిక లాభపడిన షేర్లలో ఐసీఐసీఐ బ్యాంకు, వేదాంత, కోల్ ఇండియా, టాటా స్టీల్ ఉన్నాయి.