భారత్‌లో అధిక నాణ్యత కలిగిన మానవ వనరులను అందిపుచ్చుకునే దిశగా గూగుల్ అడుగులు వేస్తోంది. వచ్చే మూడేళ్లలో ఆండ్రాయిడ్ ప్రాథమిక అంశాలపై శిక్షణ ఇచ్చేందుకు సమాయత్తమవుతోంది. ప్రభుత్వ, ప్రైవేటు విశ్వవిద్యాలయాలతో పాటు, జాతీయ నైపుణ్యాభివృద్ది కార్పొరేషన్‌కు సంబంధించిన శిక్షణా సంస్థల్లో ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు కంపెనీ తెలిపింది. ఎలాంటి అదనపు రుసుము లేకుండా వ్యక్తిగత శిక్షణను విద్యా ప్రణాళికలో భాగం చేయనున్నట్లు తెలుస్తోంది.
"2018 కల్లా అమెరికాను మించి భారత్‌లో అతి ఎక్కువ మంది డెవలపర్లు ఉండనున్నారు. ఈ సంఖ్య 40 లక్షలు ఉంటుందని అంచనా వేస్తున్నాం. మొబైల్ డెవలపర్లు ప్రస్తుతం 25 శాతం మందే ఉన్నారు." అని గూగుల్ ప్రాడక్ట్ మేనేజ్‌మెంట్ వైస్ ప్రెసిడెంట్ సీజర్ సేన్‌గుప్తా వెల్లడించారు. మొబైల్ యాప్ డెవలప్‌మెంట్‌లో భారత్‌ను ప్రపంచానికి నాయకత్వం వహించేలా చేయడమే తమ లక్ష్యమని ఆయన అన్నారు. ఈ శిక్షణ విద్యార్థులతో పాటు కెరీర్ మధ్యలో ఉన్న డెవలపర్లకు సైతం అందుబాటులో ఉంటుందని కంపెనీ ప్రకటించింది.
ఈ శిక్షణ కార్యక్రమాల కోసం అమైటీ విశ్వవిద్యాలయం, లవ్‌లీ ప్రొఫెషనల్ విశ్వవిద్యాలయం, జీడీ గోయెంకా విశ్వవిద్యాలయం, రాయత్ బహ్రా విశ్వవిద్యాలయాలతో గూగుల్ జట్టుకట్టింది. శిక్షణా సంస్థలైన ఎడ్యేరేకా, కోయింగ్, మనిపాల్ గ్లోబల్, సింప్లీలెర్న్, ఉడాసిటీ, అప్‌గ్రాడ్ వంటి వాటితో సైతం గూగుల్ భాగస్వామ్యం కుదుర్చుకుంది.
సర్టిఫికెట్ ప్రోగ్రామ్
మరో వైపు గూగుల్ ఉద్యోగాలే లక్ష్యంగా ఆండ్రాయిడ్ డెవలపర్ శిక్షణా కార్యక్రమాన్ని సైతం ప్రారంభించింది. కార్యక్రమం పేరు 'అసోషియేట్ ఆండ్రాయిడ్ డెవలపర్ సర్టిఫికేషన్'. అభ్యర్థులు శిక్షణ ముగిసిన తర్వాత ఈ పరీక్ష రాయవచ్చు. దీనిలో ఉత్తీర్ణత సాధించిన వారికి సులువుగా ఉద్యోగాలు లభించే అవకాశం ఉంటుంది. సర్టిఫికేషన్ పరీక్ష ఫీజును రూ. 6500గా నిర్ణయించారు.


Click it and Unblock the Notifications