ఇకపై రాత్రి 8 దాటితే ఏటీఎం మెషిన్‌లో నో మనీ
ముంబై: ఇకపై అర్ధరాత్రి డబ్బులు అవసరం పడి ఏటీఎంకి వెళితే మీకు నిరాశే ఎదురుకావచ్చు. ఏటీఎంలలో జరుగుతున్న అక్రమాలు, దొంగతనాలు అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సరికొత్త నిబంధనలను త్వరలోనే అమల్లోకి తీసుకురానుంది.
ఈ నిబంధనల్లో భాగంగా రాత్రి 8 గంటలు దాటాక దేశంలోని ప్రధాన నగరాలలోని ఏటీఎంలలో నగదును నింపవద్దంటూ కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదన చేసింది. అయితే గ్రామీణ ప్రాంతాల్లోనైతే సాయంత్రం 5 దాటాక, నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో మధ్యాహ్నం మూడు గంటల లోపే నగదు భర్తీ ప్రక్రియను పూర్తి చేయాలంటోంది.
ఇక ఏటీఎంలలో ప్రైవేటు క్యాష్ ట్రాన్స్‌పోర్టేషన్ ఏజెన్సీలు బ్యాంకుల నుంచి మధ్యాహ్నంలోగా నగదును తీసుకెళ్ళి భర్తీ చేయాలని కేంద్రం ఈ నిబంధనల్లో పేర్కొంది. అంతే కాదు నగదును రవాణా చేసేందుకు సీసీటీవీ, జీపీఎస్ టెక్నాలజీని అమర్చిన అత్యంత భద్రమైన వ్యాన్లను మాత్రమే వాడాలని కేంద్రం పేర్కొంది.

వ్యాన్‌లో రెండు కంపార్ట్‌మెంట్లను ఏర్పాటు చేయాలని, అందులో ఒకదానిలో నగదును, మరొకదానిలో భద్రతా సిబ్బంది కూర్చునేందుకు వీలుగా ఏర్పాట్లు చేయాలని పేర్కొంది. నగదు ఉన్న కంపార్ట్‌మెంట్‌కు కేవలం ఒకే ద్వారం ఉండాలని, అది కూడా వ్యాన్‌లోపలున్నవారు మాత్రమే తెరిచే విధంగా డిజైన్ చేయాల్సి ఉంటుంది.
అలాగే ఒక ట్రిప్పులో రూ.5 కోట్లకు మించి నగదును తీసుకుపోరాదని కేంద్రం ప్రతిపాదించింది. అలాగే కాపలాగా ఆయుధాలతో కూడిన ఇద్దరు సెక్యూరిటీ గార్డులు ఉండాలని కేంద్రం పేర్కొంది. భద్రతాపరంగా తీసుకున్న ఈ నిర్ణయాలు బాగానే ఉన్నా అత్యవసర సమయాల్లో నగదు తీసుకోవడం కష్టమవుతుందని మరికొంతమంది నిపుణులు అంటున్నారు.
ప్రస్తుతం మన దేశంలో ఒక రోజులో దేశంలోని 8000 ప్రైవేట్ వ్యాన్లు బ్యాంకుల నుంచి కరెన్సీ చెస్ట్‌లకు, ఏటీఎంలకు రూ.15,000 కోట్ల నగదును రవాణా చేస్తున్నాయి. అంతేకాదు ఈ ప్రైవేట్ సంస్థలు బ్యాంకుల తరపున రాత్రిపూట రూ.5000 కోట్ల నగదును ప్రైవేట్ వాల్ట్‌లలో భద్రపరుస్తున్నాయి.


Click it and Unblock the Notifications