ముంబై: 17 బ్యాంకుల నుంచి రుణాలను తీసుకున్న కేసులో నిందితుడిగా ఉన్న విజయ్ మాల్యాకు కొత్త చిక్కులు ఎదురుకానున్నాయి. బ్యాంకులు ఎవరినైనా ఉద్దేశపూర్వక ఎగవేతదారుగా ప్రకటిస్తే ఇక ఆ వ్యక్తి ఏ లిస్టెడ్ కంపెనీ బోర్డులో సభ్యుడిగా ఉండేందుకు వీల్లేదని సెబీ ఇటీవలే ఒక తీర్మానం ఆమోదించింది.
ఈ తీర్మానానికి సంబంధించి నోటిఫికేషన్ విడుదలైతే తన గ్రూపులోని లిస్టెడ్ కంపెనీలతో పాటు ఇతర లిస్టెడ్ కంపెనీల్లోని బోర్డు పదవుల నుంచి మాల్యా తప్పుకోవాల్సి వస్తుంది. యూబీ గ్రూప్, బేయర్ క్రాప్‌సైన్సెస్, సనోఫీ ఇండియా, మంగళూరు కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్, యునైటెడ్ బ్రూవరీస్, యునైటెడ్ బ్రూవరీస్ హోల్డింగ్స్‌లలో సభ్యునిగా ఉన్నారు.
మరోవైపు ఐడీబీఐ బ్యాంకు ఇచ్చిన ఫిర్యాదుతో విజయ్ మాల్యాపై కేసు నమోదు చేసిన ఈడీ దర్యాప్తును వేగవంతం చేసింది. మాల్యాపై కేసు పక్కాగా నమోదు చేసేందుకు గాను 17 బ్యాంకుల నుంచి సమాచారం కోరింది. అదే విధంగా వివిధ కేసులకు సంబంధించి ఇప్పటికే దర్యాప్తు చేస్తున్న సీబీఐ మాల్యా ఆదాయ, సర్వీస్ టాక్స్ శాఖల నుంచి వివరాలు కోరింది.

ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ మాజీ సీఎఫ్‌ఓ రఘునాథన్, యునైటెడ్ బ్రూవరీస్ సీఎఫ్‌ఓ రవి నేడుంగడిలను ఈడీ ప్రశ్నిస్తోంది. సరైన కారణాలు చెప్పకుండా ఈ నెల 18న ముంబైలోని ఇడి అధికారుల ముందు హాజరుకాకపోతే మాల్యా పాస్‌పోర్టు రద్దు చేయించాలని కూడా ఈడీ యోచిస్తున్నట్టు తెలుస్తోంది.
మాల్యాను ఇండియాకు తిరిగి రావాలని సుప్రీంకోర్టు ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేదని అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ చెప్పారు. 'సుప్రీంకోర్టు మాల్యాను వ్యక్తిగతంగా హాజరుకావాలని ఆదేశించలేదు. కేవలం నోటీసులు జారీ చేసింది. సివిల్ కేసుల్లో కోర్టు నోటీసు జారీ చేసినప్పుడు దాన్ని అందుకున్నవారు వ్యక్తిగతంగా కానీ అతని తరఫు లాయర్ కాని కోర్టుకు హాజరుకావచ్చు' అని రోహత్గీ వివరించారు.
తాను ఇండియాకు తిరిగి రావాలా వద్దా అన్న విషయం తన లాయర్లు నిర్ణయిస్తారన్న మాల్యా వ్యాఖ్యలపై రోహత్గీ మాట్లాడుతూ 'లాయర్ల స్పందన ఎలా ఉన్నా, మాల్యా ఇండియాకు తిరిగి రావాలి. పాస్‌పోర్టును అప్పగించాలి. ఈ కేసు విచారణ సమయంలో మేం కోర్టును ఇదే అభ్యర్థించబోతున్నాం' అని చెప్పారు.


Click it and Unblock the Notifications