వడ్డీరేట్లలో మార్పు: చిన్న మొత్తాల పొదుపులపై కోత, పెరిగిన పీఎఫ్
న్యూఢిల్లీ: ఉద్యోగుల భవిష్యనిధి(పీఎఫ్) వడ్డీ శాతాన్ని పెంచుతూ కేంద్ర ప్రభుత్వం మంగళవారం కీలక నిర్ణయం తీసుకుంది. 2015-16 సంవత్సరానికి 8.8శాతంగా ఖరారు చేసింది. గతేడాది 8.75 శాతంగా ఉండగా 8.90 శాతం పెంచాలని ఉద్యోగ సంఘాల నుంచి పెద్ద ఎత్తున డిమాండ్‌లు వచ్చాయి. దీంతో 0.05 శాతాన్ని కేంద్ర ప్రభుత్వం పెంచింది.
మరోవైపు చిన్న మొత్తాల పొదుపులపై వడ్డీరేటును మార్కెట్ రేట్లకు అనుసంధానం చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. అంతేకాదు పోస్టాఫీసు స్వల్పకాల పథకాలపై పావుశాతం వడ్డీ రేటు తగ్గించింది. తద్వారా 1, 2, 3 సంవత్సరాల టర్మ్ డిపాజిట్లు, కిసాన్ వికాస్ పత్ర (కేవీపీ), అలాగే ఐదేళ్ల రికరింగ్ డిపాజిట్లపై అదనంగా పావుశాతం(0.25%) వడ్డీ వస్తోంది.
ఈ మేరక ప్రయోజనాన్ని ఏప్రిల్ 1వ తేదీ నుంచి తొలగిస్తున్నట్లు ఆర్ధిక శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. ఇదిలా ఉంటే మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ (ఎంఐఎస్), పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్), సీనియర్ సిటిజన్, బాలికలకు సంబంధించిన పథకాల విషయంలో వడ్డీరేట్లను మార్చక పోవడం విశేషం.

ముఖ్యాంశాలు:
* సుకన్య సమృద్ధి యోజన, సీనియన్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్, మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్‌లకు సంబంధించిన వడ్డీరేట్ల విషయంలో మార్పులేదు. ప్రభుత్వ బాండ్లతో పోలిస్తే 0.75 శాతం, 1 శాతం, 0.25 శాతం వడ్డీరేట్లు అధికంగా ఉన్నాయి. సామాజిక భద్రతా పరమైన లక్ష్యాలతో ఈ పథకాలు ముడివడి ఉండడమే దీనికి కారణం.
* దీంతో పాటు దీర్ఘకాలిక పథకాలతో పాటు ఐదేళ్ల టర్మ్ డిపాజిట్లు, అదే కాలాలకు సంబంధించిన నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్స్, పీపీఎఫ్‌లకు ఇచ్చే వడ్డీరేట్లలో కూడా ఎలాంటి మార్పులు చేయలేదు.
* ఇకపై ప్రతి మూడు నెలలకు ఒకసారి ఈ వడ్డీ రేట్లను సమీక్షిస్తారు. ఒక త్రైమాసికంలో వడ్డీరేటును అంతకుముందు నెల 15వ తేదీన నిర్ణయిస్తారు.
* కాగా, పస్తుతం పీపీఎఫ్ డిపాజిట్లపై వడ్డీరేటు 8.7 శాతం ఇస్తుండగా, సుకన్యా సమృద్ధి యోజన రేటు 9.2 శాతంగా ఉంది. మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ రేటు 8.4 శాతంగా ఉంది.
* ఐదేళ్ల రికరింగ్ డిపాజిట్లపై ప్రస్తుతం 8.4 శాతం వార్షిక వడ్డీ అందుతోంది. కిసాన్ వికాస పత్ర విషయంలో డిపాజిట్ 100 నెలలకు (ఎనిమిదేళ్ల 4 నెలలు) అసలు రెట్టింపు అవుతోంది.
* చిన్న పొదుపు మొత్తాలపై రేటు అధికంగా ఉండడం వల్ల ఆర్‌బీఐ నుంచి అందిన రేటు తగ్గింపు ప్రయోజనాల్ని బ్యాంకులు వినియోగదారులకు బదలాయించడం లేదు.
* వీటితో పాటు కొన్ని వాస్తవ, అత్యవసర అవసరాలు తలెత్తితే పీపీఎఫ్ అకౌంట్ల ప్రీ మెచ్యూర్ క్లోజర్‌కూ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. తీవ్ర అనారోగ్యం, పిల్లల ఉన్నత విద్య వంటివి ఇందులో ఉన్నాయి.


Click it and Unblock the Notifications