భవిష్యత్తులో బంగారం ధర ఎలా ఉండబోతుంది?
ప్రపంచ వ్యాప్తంగా గత 20 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా వరుసగా 10 రోజుల పాటు బంగారం ధర పతనమవడం చూశాం. అదే విధంగా ఐదేళ్ల కనిష్టానికి పడిపోయి ఔన్సు బంగారం ధర 1092 డాలర్లకు చేరింది. మనదేశంలో కూడా పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర నాలుగేళ్ల కనిష్టానికి రూ. 24,785కి పడిపోయింది.
ఈ క్రమంలో బంగారం మార్కెట్లో ఏం జరుగుతోంది? భవిష్యత్తులో బంగారం ధర తగ్గుతుందా? లేదా పెరుగుతుందా? బంగారంలో పెట్టుబడికి ఇది సరైన సమయమేనా? తెలుసుకుందాం. గతంలో సాధారణంగా బంగారం ధరలు కొన్ని సంవత్సరాల పాటు పెరగడం లేదా తగ్గడం జరుగుతుంటుంది.
1987లో ఔన్స్ బంగారం ధర 484 డాలర్లు ఉండగా, మళ్లీ ఆ ధర దాదాపు 18 ఏళ్ల తర్వాత 2005లో వచ్చింది. 1999వ సంవత్సరంలో 252 డాలర్లకు బంగారం ధర పడిపోయింది. ఆ తర్వాతి కాలంలో బంగారం ధర పెట్టుబడి సాధనంగా మారడంతో, గోల్డ్ ఎక్సేంజ్ ట్రెడేడ్ ఫండ్ల రూపంలోనూ అలాగే బంగారంలోనూ భారత్, చైనా నుంచి పెట్టుబడులు పెరిగాయి.

ఇటీవల కాలంలో బంగారం ధర మరింతగా పతనం అవడానికి గల ముఖ్య కారణం గ్రీసు దేశం సంక్షోభం నుంచి తప్పించుకోవడమే. ఇకి చైనా వృద్ధి రేటులో మందగమనం తద్వారా అక్కడ నుంచి ఆశించిన మేరకు కొనుగోళ్లు లేకపోవడం కారణమని చెప్పవచ్చు.
భవిష్యత్తులో బంగారం ధర ఎలా ఉండబోతుంది?
ఆర్ధిక మాంద్యాన్ని అధిగమించడానికి, ప్రపంచ వ్యాప్తంగా పలు కేంద్ర బ్యాంకులు ఉద్దీపన పథకాలు ప్రవేశపెట్టాయి. వడ్డీ రేట్లను పెరగకుండా చూశాయి. అయితే ఇప్పుడు అమెరికా ఆర్ధిక వ్యవస్ధ తిరిగి వృద్ధి పథంలోకి చేరడం, డాలరు మరింతగా బలపడటం, ఆ దేశంలో వడ్డీ రేట్లు పెరగవచ్చనే సూచనలు బంగారం ధరలు మరింతగా పెరిగే అవకాశం ఉంది.
ఒకవేళ డాలరు విలువ బలపడితే, బంగారం ధర మరింతగా తగ్గే అవకాశం ఉంది. డాలరుతో పోలిస్తే రూపాయి విలువ మరింతగా బలహీనపడితే, దిగుమతి సుంకంలో మార్పులు చేస్తే, దాని ప్రభావం బంగారంపై పడే అవకాశం ఉంది.
బంగారం ఎప్పుడు కొనుగోలు చేస్తే మంచిది?
* శుభ కార్యాలకు, కుటుంబ అవసరాలకు బంగారం, నగలు అవసరమైన మేరకు దశలవారీగా కొనుగోలు చేస్తే మంచిది.
* నేరుగా బంగారాన్ని కొనుగోలు చేయాలనుకునే వారు ఆభరణాలు, కడ్డీలు, నాణేల రూపంలో కొనుగోలు చేస్తే బాగుంటుంది.
* బంగారాన్ని స్వల్ప కాలానికి కొనుగోలు చేయాలనుకునే వారికి గోల్డ్ ఫ్యూచర్స్ అందుబాటులో ఉన్నాయి.
* బంగారంలో దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టాలనుకునేవారు గోల్డ్ ఎక్సేంజ్ ట్రేడెడ్ఫండ్లను ఎంచుకోవచ్చు.


Click it and Unblock the Notifications