ఆగస్టు 23 నుంచి బంధన్ బ్యాంక్ ప్రారంభం
పదేళ్ల తర్వాత ఒక ప్రైవేట్ బ్యాంకు ఆగస్టు 23 నుంచి కోల్‌కత్తా కేంద్రంగా బ్యాంకింగ్ కార్యకలాపాలు ప్రారంభించనున్నట్టు ప్రకటించింది. సూక్ష్మ రుణాలు అందించే బంధన్ ఫైనాన్సియల్ సర్వీసెస్ బ్యాంకింగ్ సర్వీసులను ప్రారంభించేందుకు రిజర్వ్ బ్యాంక్ తుది అనుమతులను మంజూరు చేసిందని బంధన్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ చంద్ర శేఖర్ ఘోష్ తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బంధన్ ప్రధాన కార్యాలయం ఉన్న కోల్‌కత్తా నుంచే బ్యాంకింగ్ సర్వీసులు అందించనున్నట్లు ఆయన బుధవారం తెలిపారు. దేశవ్యాప్తంగా 500-600 శాఖలతో కార్యకలాపాలు మొదలుపెట్టనున్నట్టు ఆయన చెప్పారు.
ముందుగా తూర్పు, ఈశాన్య భారతంపై ప్రత్యేక దృష్టి సారించాలనుకుంటున్నట్లు ఆయన మీడియా సమావేశంలో చెప్పారు. ప్రస్తుతం 22 రాష్ర్టాల్లో ఉన్న 2,200 కార్యాలయాలు, 17,000 మందికి పైగా ఉద్యోగులు, 66 లక్షల మంది కస్టమర్లు, 10,000 కోట్ల రూపాయల రుణాలు బ్యాంకులో భాగంగా మారనున్నట్టు ఆయన తెలిపారు.

బ్యాంకింగ్ సర్వీసులు అందించేందుకు అదనంగా 2,200 మందిని రిక్రూట్ చేసుకోవాలనుకుంటున్నట్లు ఆయన చెప్పారు. మొత్తం శాఖల్లో 200 శాఖలు మెట్రో నగరాల్లో మిగతావి సెమీ అర్బన్, గ్రామీణ ప్రాంతాల్లో ప్రారంభిస్తామని పేర్కొన్నారు. మొదటి రోజు నుంచే 250 ఎటిఎంలు కార్యకలాపాలు ప్రారంభిస్తాయని తెలిపారు.
లఘు, చిన్న, మధ్యతరహా వ్యాపార సంస్థలకు రుణ సదుపాయాన్ని కల్పించడానికి పెద్దపీట వేస్తామని ఆయన పేర్కొన్నారు. బ్యాంకు ఏర్పాటు కోసం గత ఏడాది ఏప్రిల్‌లో ఆర్‌బిఐ నుంచి ఈ సంస్థకు సూత్రప్రాయ ఆమోదం లభించిన విషయం తెలిసిందే. ఈ సంస్థతో పాటు ఐడిఎఫ్‌సికి కూడా బ్యాంకు లైసెన్స్ లభించింది.


Click it and Unblock the Notifications