కుబేర కుటుంబాలను కలిగి ఉన్న దేశాల్లో భారత్ నెం.4
ప్రపంచ వ్యాప్తంగా అత్యధికంగా కుబేరులున్న దేశాల జాబితాలో భారత్ 4వ స్ధానంలో నిలిచింది. గతేడాది 10 కోట్ల డాలర్ల (ప్రస్తుత మారకం రేటు ప్రకారం మన కరెన్సీలో రూ.640 కోట్లు) కంటే అధిక సంపద కలిగిన కుటుంబాల వివరాలతో బోస్టన్ కన్సల్టింగ్ గ్రూపు(బీసీజీ) ఈ జాబితాను విడుదల చేసింది.
గతేడాది విడుదల చేసిన జాబితాలో 12వ స్ధానంలో నిలిచిన భారత్, ఈ సారి నాల్గవ స్ధానానికి ఎగబాకింది. ఎప్పటిలాగే అమెరికా ప్రథమ స్థానంలో నిలిచింది. గతేడాది అమెరికాలోని సూపర్ రిచ్‌ల సంఖ్య 5,201గా నమోదైంది.
1,037 మంది కుబేరులున్న చైనా 2వ స్థానంలో నిలవగా, 1,019 మందితో బ్రిటన్ మూడో స్థానంలో నిలిచింది. 679 మంది శ్రీమంతులతో జర్మనీ ఐదో స్థానం దక్కించుకుంది. భారత్‌లో 2013లో 284గా ఉన్న కుబేర కుటుంబాల సంఖ్య 928కి చేరుకుంది.

ఆసియా ఫసిఫిక్ ప్రాంతంలో ప్రైవేట్ సంపద అత్యధికంగా 29 శాతం వృద్ధిచెంది 47 లక్షల కోట్ల డాలర్లకు చేరుకుంది. తద్వారా ప్రపంచంలో అత్యధిక ధనిక ప్రాంతాల్లో యూరప్‌ను వెనక్కి నెట్టి రెండో స్థానానికి ఎగబాకింది.
దీంతో ప్రపంచంలో అత్యధిక ప్రైవేట్ సంపదున్న ప్రాంతాల్లో ఆసియా పసిఫిక్ ప్రాంతానికి రెండో స్థానం దక్కింది. అంతకుముందు రెండో స్థానంలో యూరప్ ఉండేది. గతేడాదిలో చైనా స్టాక్ మార్కెట్ 38 శాతం, ఇండియా మార్కెట్ 23 శాతం వృద్ధిని నమోదు చేసుకున్నాయి.
ప్రపంచంలో అత్యధిక ప్రైవేట్ సంపద ఉన్న ప్రాంతంగా 2016 నాటికి ఆసియా పసిఫిక్ ప్రాంతం నిలుస్తుందని, ఆ సమయానికి ఈ ప్రాంతం సంపద 57 లక్షల కోట్ల డాలర్లకు చేరుతుందని నివేదిక అంచనా వేసింది.
ప్రస్తుతం ప్రపంచంలో అత్యధిక ప్రైవేట్ సంపద ఉన్న ప్రాంతంగా ఉన్న ఉత్తర అమెరికా 2016 నాటికి 56 లక్షల కోట్ల డాలర్లతో రెండో స్థానానికి పరిమితమవుతుందని పేర్కొంది. 2019 నాటికి ఆసియా పసిఫిక్ ప్రాంతపు సంపద వాటా మొత్తం ప్రపంచ ప్రైవేట్ సంపద వాటాలో 34 శాతానికి చేరుతుందని పేర్కొంది.
ఏటా పది శాతం వృద్ధితో ఆ సమయానికి ఈ ప్రాంతంలో ప్రైవేట్ సంపద 75 లక్షల కోట్ల డాలర్లకు పెరుగుతుందని అంచనా వేసింది. చైనా, ఇండియాల్లో ప్రైవేట్ సంపద భారీగా పెరగడానికి ఈక్విటీ మార్కెట్లో పెట్టుబడుల విలువ భారీగా పెరిగిన నేపథ్యంలో సంపద భారీగా పెరిగిందని నివేదికలో వెల్లడించింది.


Click it and Unblock the Notifications