ఊరట: ఏసీ రెస్టారెంట్‌లో తింటేనే సర్వీస్ ట్యాక్స్
సేవా పన్ను బాదుడు నుంచి ప్రజలకు కాస్త ఊరట లభించింది. కేవలం ఏసీ రెస్టారెంట్లలో మాత్రమే సర్వీస్ ట్యాక్స్ వసూలు ఉంటుందని, అది కూడా మొత్తం బిల్లులో 40 శాతం మొత్తంపై 5.6 శాతం మాత్రమే ఉంటుందని కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు.
జూన్ 1 నుంచి సర్వీస్ ట్యాక్స్ అమల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. 14 శాతం సేవా పన్ను అమలవడంతో, కొన్ని రెస్టారెంట్లు ప్రజల వద్ద నుంచి అధికంగా డబ్బు వసూలు చేస్తున్నాయంటూ ఆరోపణలు రావడంతో దీనిపై కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది.

రెస్టారెంట్లు, ఈటింగ్ ఔట్‌లెట్లు, మెస్‌లు తదితరాల్లో ఏసీ సౌకర్యం ఉంటే, సర్వీస్ ట్యాక్స్ వసూలు చేయాలన్న నిబంధన విధించిన సంగతి తెలిసిందే. ఏసీ లేని రెస్టారెంట్లు ఎలాంటి సర్వీస్ ట్యాక్స్ చెల్లించాల్సిన అవసరం లేదని పేర్కొంది. దీంతో జూన్ 1 నుంచి సర్వీస్ ట్యాక్స్ 12.36 శాతం నుంచి 14 శాతానికి పెరిగిన సంగతి తెలిసిందే.
ఇక, ఏసీ రెస్టారెంట్లలో భోజనం తింటే సర్వీస్ ట్యాక్స్ 4.94 శాతం నుంచి 5.6 శాతానికి పెరిగింది. వీటితో పాటు డీటీహెచ్ సర్వీసులు, బ్యూటీ పార్లర్, ఇన్సూరెన్స్, స్టాక్ బ్రోకరేజ్ సర్వీసులు, ప్రకటనల బిల్లులు, క్రెడిట్ కార్డు బిల్లులు సైతం పెరిగాయి.


Click it and Unblock the Notifications