ఇటీవల ముగిసిన ద్రవ్య పరపతి విధాన సమీక్షలో నగదు నిల్వల నిష్పత్తి (సీఆర్ఆర్)లో కోత కంటే రెపో రేటు తగ్గించడమే మేలని ఆర్‌బీఐ గవర్నర్ రఘారామ్ రాజన్ స్పష్టం చేశారు. సీఆర్ఆర్‌ను తగ్గిస్తే, మరింతగా నగదు అందుబాటులోకి వస్తుందని, బ్యాంకులకు ఆర్ధిక భారం తగ్గుతుంది.
దీని కోసమే సీఆర్ఆర్ తగ్గించాలని గత కొంత కాలంగా డిమాండ్ వినిపిస్తోంది. రాజన్‌తో జరిగిన టెలీ కాన్ఫరెన్స్‌లోనూ ఆర్ధిక రంగ విశ్లేషకులు ఇదే అంశాన్ని ప్రస్తావించారు. బ్యాంకులు సైతం తమ బేస్ రేట్లను 10-25 బేసిస్ పాయింట్ల దాకా కోత వేశాయి.
సీఆర్ఆర్‌లో కోత వేస్తే తమ రుణ వ్యయాలు తగ్గుతాయని, అప్పుడు విధాన రేట్లలో కోత పడ్డ వెంటనే బేస్ రేట్లను తగ్గించేందుకు అవకాశం ఉంటుందని బ్యాంకులు అభిప్రాయపడ్డాయి. ఈ విషయాన్ని రాజన్ తోసిపుచ్చారు.

ఇందుకు గాను రాజన్ 'సీఆర్ఆర్ 100 బేసిస్ పాయింట్ల తగ్గింపు వస్తే బ్యాంకుల వ్యయాల్లో 7-8 బేసిస్ పాయింట్ల మేరే ప్రయోజనం కలుగుతుంది. అదే రెపో రేటును పావు శాతం తగ్గిస్తే మూలధన వ్యయాలు 25 బేసిస్ పాయింట్ల మేర తగ్గుతాయి' అని పేర్కొన్నారు.
ఇది ఇలా ఉంటే, ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో ఆర్‌బీఐ కీలక వడ్డీ రేట్లను మరో 75 బేసిస్ పాయింట్ల మేర తగ్గించవచ్చని అంతర్జాతీయ ఆర్ధిక సేవల సంస్ధ యూబీఎస్ పేర్కొంది. జనవరి నుంచి ఇప్పటి వరకు, 0.75 శాతం మేర ఆర్‌బీఐ రెపోరేటును తగ్గించిన సంగతి తెలిసిందే.
ప్రస్తుత ఆర్ధిక సంవత్సరానికి వచ్చే సరికి ఇందులో 0.25 శాతమే కోత విధించింది. వచ్చే ద్వైమాసిక సమీక్షలో రేట్ల కోత ఉండదనే దిశగా ఆర్‌బీఐ సంకేతాలిచ్చినా, యూబీఎస్ ఈ విధమైన అంచనా వేయడం గమనార్హం.


Click it and Unblock the Notifications