పన్నులు వసూలు చేస్తేనే పథకాలకు నిధులు: జైట్లీ
న్యూఢిల్లీ: నిజాయితీగా పన్ను చెల్లించే వారు కొత్త నల్లధనం చట్టం గురించి భయపడాల్సిన అవసరం లేదని కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. సోమవారం ఢిల్లీలో ఆదాయ పన్ను శాఖ అధికారులతో జైట్లీ సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పన్ను చెల్లించే వారిని వేధింపులకు గురి చేయకుండా పన్ను పరిమితులను పెంచాలనుకుంటున్నట్లు ఆయన చెప్పారు. దీంతో వచ్చిన నగదుని మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులకు వినియోగించనున్నట్లు ఆయన పేర్కొన్నారు.
నల్లధనాన్ని పూర్తిగా నిరోధించేందుకు తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అన్నారు. 2015-16 ఆర్థిక సంవత్సరానికి ప్రత్యక్ష పన్నుల వసూళ్లు 14-15 శాతం పెరిగే అవకాశం ఉందని తెలిపారు. ఇలా చేయడం వల్ల భారత ఆర్థిక వ్యవస్థ మరింతగా బలోపేతంగా అవుతుందని అన్నారు.

అధికంగా పన్నులు వసూళు చేస్తేనే ప్రభుత్వ పథకాలకు అధికంగా నిధులు కేటాయించగలమని చెప్పారు. నల్లధనంపై పూర్తి స్ధాయిలో ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉందని అన్నారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం సేవా పన్ను లాంటి వాటిపై నిర్ణయాలు తీసుకుందని గుర్తు చేశారు.
కార్పోరేట్ పన్నుని 30 శాతం నుంచి 25 శాతానికి తగ్గించడంపై రానున్న నాలుగేళ్లలో వీలైనంత మేరకు మినహాయింపులతో తొలగించవచ్చని అభిప్రాయాన్ని వెల్లడించారు. ఇక పరోక్ష పన్నుల విషయానికి వస్తే, జీఎస్‌టీ పరిచయ ప్రక్రియ కొనసాగుతోందని అన్నారు.
ఇక దేశవ్యాప్తంగా జూన్ 1 నుంచి అన్ని రకాల సేవలూ మరింత ప్రియం కానున్న సంగతి తెలిసిందే. ఇందుకు కారణం ఇప్పటి వరకు 12.36 శాతంగా ఉన్న సర్వీసు ట్యాక్స్‌ను 14 శాతానికి పెంచుతున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ 2015-16 ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌లో ప్రతిపాదించారు. పార్లమెంట్ ఇందుకు ఆమోదం తెలపడంతో జూన్ 1 నుంచి దీన్ని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.


Click it and Unblock the Notifications