గురువారం స్టాక్ మార్కెట్లలో టాటా స్టీల్ షేర్లు భారీగా క్షీణించాయి. ఇందుకు కారణం టాటా స్టీల్ మార్చితో ముగిసిన నాల్గవ త్రైమాసికంలో రూ. 5,674 కోట్ల నష్టాన్ని నమోదు చేయడమే. గతేడాది ఇదే వ్యవధిలో కంపెనీ రూ. 1,036 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది.
తాజాగా ప్రకటించిన నాల్గవ త్రైమాసికంలో ఆదాయం 21 శాతం క్షీణించి రూ. 42,428 కోట్ల నుంచి రూ. 33,666 కోట్లకు తగ్గింది. టాటా స్టీల్ గ్రూప్‌లోని కొన్ని వ్యాపార విభాగాలు మంచి పనితీరుని ప్రదర్శించకపోవడం వల్ల నష్టాలు నమోదు చేయాల్సి వచ్చిందని టాటా స్టీల్ ప్రకటనలో పేర్కొంది.
మొత్తం మీద రూ. 5000 కోట్ల దాకా నగదేతర విలువలు తగ్గడం త్రైమాసిక ఫలితాలపై ప్రభావం చూపింది. అదే సమయంలో మొజాంబిక్ కోల్ ప్రాజెక్టులో రూ. 1577 కోట్ల పెట్టుబడులు పెట్టడం వల్ల కూడా ఫలితాలపై ప్రభావం కనిపించిందని కంపెనీ పేర్కొంది.