‘గ్లోబల్ 2000’: భారత్‌లోని 56 కంపెనీలకు చోటు
ప్రపంచంలోనే అత్యంత, శక్తివంతమైన అతి పెద్ద 2,000 కంపెనీల జాబితాను ఫోర్బ్స్ మ్యాగజైన్ విడుదల చేసింది. 2015 సంవత్సరానికి గాను విడుదల చేసిన ఈ జాబితాలో భారత్‌కు చెందిన 56 కంపెనీలకు స్ధానం లభించింది. ఫోర్బ్స్ మ్యాగజైన్ ‘గ్లోబల్ 2000' పేరుతో కంపెనీల జాబితాను విడుదల చేసింది. భారత్‌లో టాప్ టెన్‌లో ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ మొదటి స్ధానంలో ఉంది.
ఈ జాబితాలో అమెరికాకు చెందిన 579 కంపెనీలు ఉన్నాయి. ఆ తర్వాతి స్ధానంలో చైనా కంపెనీలున్నాయి. చైనా, హాంకాంగ్ నుంచి 232 కంపెనీలకు స్థానం దక్కింది. ఇక 218 కంపెనీలతో జపాన్ మూడో స్ధానంలో నిలిచింది. ఇక భారత్ విషయానికొస్తే గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాదిలో భారత కంపెనీల జాబితాలో రెండు కంపెనీలు కొత్తగా చేరాయి. ప్రపంచ వ్యాప్తంగా ప్రకటించిన ఈ జాబితాలో రిలయన్స్ ఇండస్ట్రీస్ కు 142వ స్ధానంలో నిలిచింది.

గత ఏడాది రిలయన్స్ ఇండస్ట్రీస్ స్ధానం 135గా ఉంది. దీనికి కారణం ఇటీవల రిలయన్స్ షేర్ విలువ తగ్గడమే. రిలయన్స్ మార్కెట్ విలువ 4,290 కోట్ల డాలర్లుగా ఉంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ తర్వాత 3,300 కోట్ల డాలర్ల మార్కెట్ విలువతో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 152వ స్థానంలో ఉంది.
ఓఎన్జీసీ(183వ స్థానం), టాటా మోటార్స్ (263), ఐసీఐసీఐ బ్యాంకు (283), ఇండియన్ ఆయిల్ (349), హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకు (376), ఎన్‌టిపిసి (431), టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (485), భారతి ఎయిర్‌టెల్ (506), యాక్సిస్ బ్యాంక్ (558), ఇన్ఫోసిస్ (672), భారత్ పెట్రోలియం (757), విప్రో (811), టాటా స్టీల్ (903), అదానీ ఎంటర్‌ప్రైజెస్ (944) వంటి కంపెనీలు కూడా ఫోర్బ్స్ జాబితాలో స్ధానం సంపాదించుకున్నాయి.


Click it and Unblock the Notifications