ముంబై: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) థర్డ్ జెండర్స్‌కు కూడా బ్యాంకు సేవలు అందేలా చూడాలని నిర్ణయం తీసుకుంది. అందుకు సంబంధించి ఒక ప్రకటన విడుదల చేసింది. థర్డ్ జెండర్స్‌కు బ్యాంకుల్లో ఖాతాను తెరిచేందుకు ఒక ప్రత్యేక కాలమ్‌ను బ్యాంకు దరఖాస్తు ఫామ్‌లో చేర్చింది.
బ్యాంకులకు సంబంధించిన వివధ లావాదేవీలు, ఖాతాను తెరిచే సందర్భంగా థర్డ్ జెండర్స్ సమస్యలు తమ దృష్టికి వచ్చిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామని ఆర్‌బీఐ అధికారులు వెల్లడించారు. దీనికి సంబంధించి అన్ని బ్యాంకులకు నోటీసులు జారీ చేశామని అన్నారు.
థర్డ్ జెండర్స్ కూడా రాజ్యాంగం కల్పించిన అన్ని హక్కులనూ పొందవచ్చంటూ ఏప్రిల్ 15, 2014న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును గౌరవిస్తూ ప్రవేశ దరఖాస్తు ఫారాల్లో స్త్రీ, పురుషుల కాలమ్‌లతోపాటు థర్డ్ జెండర్ కాలమ్‌ను చేర్పించాలని ఆదేశించింది. అంతే కాదు థర్డ్ జెండర్స్ కూడా తమ జెండర్‌ను అధికారికంగా ప్రకటించుకోవచ్చని సుప్రీం కోర్టు తీర్పు మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని ఆర్‌బీఐ తెలిపింది.

గత ఏడాది థర్డ్ జెండర్స్‌ను అధికారికంగా గుర్తించి సుప్రీం కోర్టు వారికి వెనుకబడిన తరగతుల కేటగిరీ కింద విద్య, ఉద్యోగ అవకాశాలు, వైద్య సౌకర్యాలు కల్పించాలని తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే. ఇటీవలే ఢిల్లీ యూనివర్సిటీ లింగమార్పిడి విద్యార్ధుల కోసం వినూత్న ప్రాజెక్టును చేపట్టింది. యూనివర్సిటీలో క్లస్టర్ ఇన్నోవేషన్ సెంటర్ (సీఐసీ) పేరుతో 'ద థర్డ్ ఐ - డిగ్నిటీ ఆఫ్ బీయింగ్' అనే ప్రాజెక్టుని చేపట్టింది.
ఈ ప్రాజక్టు ద్వారా లింగమార్పిడి చేయించుకున్న విద్యార్దులకు యూనివర్సిటీ ప్రవేశాలు కల్పించే భాగంగా చర్యలు చేపట్టింది. ఈ క్లస్టర్ ఇన్నోవేషన్ సెంటర్ కొత్త ప్రతిపాదనలతో విధివిధానాలను రూపొందించి ప్రవేశాల కమిటీకి అందజేసింది. కమిటీ ఆమోదించిన తర్వాత లింగమార్పిడి విద్యార్ధులకు ప్రవేశాలను కల్పించనుంది.


Click it and Unblock the Notifications